సోమిరెడ్డి బతుక్కి జగన్‌పై విమర్శలా?

 డీఎస్సీ అక్రమాలపై మాట్లాడే నైతిక హక్కు లేదు

 జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారు
 
 స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే పాత కేసులు, రీ-సర్వే అంశాలతో కొత్త నాటకాలు: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజకీయ జీవితమంతా అవినీతి, అక్రమాలతోనే సాగిందని, అలాంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లి, వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామాల్లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీలో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడే నైతిక హక్కు సోమిరెడ్డికి లేదన్నారు. చదువు విలువ తెలిసిన వ్యక్తి డీఎస్సీ అంశంపై మాట్లాడకుండా దర్యాప్తు కోరుతారని, అయితే అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరపకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.

డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా అక్రమాలు, ఉద్యోగాల విక్రయంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని కాకాణి ప్రశ్నించారు. నారా లోకేష్‌ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన అంశాలను పక్కదారి పట్టించేందుకు కూటమి నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి ఫలితాలను మరిపించేందుకు జగన్‌పై విమర్శలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు.

 జగనన్న కాలనీల్లో పేదల స్థలాలను అడ్డుకోవడం దుర్మార్గం

జగనన్న కాలనీల ద్వారా పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసిందని కాకాణి గుర్తుచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల నిర్మాణాల విషయంలో ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి ఆ స్థలాలను టీడీపీ నేతలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాలను ఆశ్రయించగా స్టే ఉత్తర్వులు వచ్చినా, మళ్లీ ప్లాట్ల రద్దుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలను రద్దు చేస్తే వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాకాణి హెచ్చరించారు.

 రీ-సర్వేలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

గ్రామాల్లో జరుగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియపై కూడా కాకాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా రికార్డుల్లో మార్పులు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, విఆర్‌ఓ నుంచి ఎంఆర్‌ఓ స్థాయి వరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భవిష్యత్‌లో పూర్తి స్థాయి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. భూమిపై హక్కు ఉన్నవారికి కాకుండా ఇతరులకు అనుకూలంగా సర్వే రికార్డులు మార్చడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

గ్రామాల్లో అభివృద్ధి జాడ కనిపించడం లేదు

కూటమి పాలనలో గ్రామీణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని కాకాణి అన్నారు. గ్రామాల్లో రోడ్లపై మురుగునీరు ప్రవహించడం, వీధిలైట్లు పనిచేయకపోవడం, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండటం వంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, ప్రజా సేవలపై స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందని పేర్కొన్నారు.

అధికారం లేకపోయినా ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ అండ

అధికారంలో లేకపోయినా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తమ సొంత నిధులతో గ్రామాల్లో కనీస వసతులు కల్పిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని కాకాణి తెలిపారు. నిధులు, అధికారం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం గ్రామాల సమస్యలను పరిష్కరించలేకపోతోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పేదల ఇళ్ల స్థలాలు, భూ రీ-సర్వే వంటి అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని సూచించారు.
 

Back to Top