స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాల భద్రత పెంచాలి

సీఈసీని కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు
 

  

న్యూఢిల్లీ: ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని వైయ‌స్ఆర్‌సీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. న్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో టీడీపీ సృష్టిస్తున్న అరాచకాలు, ఆపద్ధర్మ ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పుల గురించి ఫిర్యాదు చేశారు. ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విఙ్ఞప్తి చేశారు. అనంత‌రం విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులు, ఆశావర్కర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించాలని కోరామన్నారు. గుంటూరులో శాంతిభద్రతల ఉల్లంఘన స్వయంగా స్పీకరే ఉద్రిక్తతలు సృష్టించడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోడెలపై మేం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే తిరిగి మా పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారని తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మరిన్ని కేంద్ర బలగాల భద్రత పెంచాలని, రాష్ట్రానికి అదనపు బలగాలను కేటాయించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. 
ఆధార్‌ విభాగాధిపతి సత్యనారాయణ ఏపీ ప్రభుత్వ సలహాదారుడని, ఆధార్‌ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని ఈ–ప్రగతి సంస్థకు ఇచ్చారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆర్పీ ఠాకూర్‌కు సంబంధించిన వ్యక్తులు, ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు ఈ–ప్రగతి సంస్థను నిర్వహిస్తున్నారని వెల్లడించారు. సరైన సమయంలో అన్ని ఆధారాలు బయటపెడతామని స్పష్టం చేశారు. 
మచిలీపట్నంలో ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ లోపలి దృశ్యాలు బయటకు వచ్చాయని, ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సీఈసీని క‌లిసిన వారిలో పార్టీ సీనియ‌ర్ నేత‌లు బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బాలశౌరి, సి. రామచంద్రయ్య, అవంతి శ్రీనివాస్‌, బుట్టా రేణుక ఉన్నారు..
 
 

Back to Top