క్రాంతికుమార్ మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణకి ఆదేశించాలి

వారి కుటుంబాన్ని సీఎం చంద్ర‌బాబు పరామ‌ర్శించి న్యాయం చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్‌

కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజు వేధింపుల‌తో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని 
ప‌రామర్శించిన అనంత‌రం అక్క‌డే మీడియాతో మాట్లాడిన‌ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల బృందం 

రెడ్‌బుక్ రాజ్యాంగం వ‌ల్లే ద‌ళితుల‌పై వరుస దాడులు 

అమ‌ల్లోకి తెచ్చిన చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హోంమంత్రి అనిత క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

ద‌ళితుల‌పై జ‌రిగే దాడుల‌కు ఇప్ప‌టికైనా ఫుల్‌స్టాప్ పెట్టాలి

పోలీసుల నుంచే సామాన్యుల‌కు ర‌క్ష‌ణ క‌రువైన దుస్థితి

పేరుకే ఫ్రెండ్లీ పోలీసింగ్‌. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాలి  

ద‌ళితుల‌పై దాడులు జ‌రిగితే స‌హించేది లేదు

ప్ర‌భుత్వానికి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల హెచ్చ‌రిక 

విజ‌య‌వాడ‌:  పేరుపోగు క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచార‌ణకి ఆదేశించ‌డంతోపాటు వారి కుటుంబాన్ని సీఎం చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా క్రాంతికుమార్ మృతితో దిక్కులేకుండా పోయిన వారి బిడ్డ‌ల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరారు. రెడ్ బుక్ రాజ్యాంగం కార‌ణంగానే రాష్ట్రంలో పోలీసులు చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రెచ్చిపోతున్నార‌ని, దాన్ని అమ‌ల్లోకి తెచ్చిన చంద్ర‌బాబు, లోకేష్‌, హోంమంత్రి అనిత‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు బాధిత కుటుంబాల‌కు స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు. ప్ర‌జ‌ల‌ను కాపాడాల్సిన పోలీసులే రెచ్చిపోయి హింసిస్తుంటే సామాన్యులు త‌మ క‌ష్టాల‌ను ఎవ‌రితో చెప్పుకోవాల‌ని ప్రశ్నించారు. కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజు వేధింపుల‌కు తాళ‌లేక‌పోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని విజ‌య‌వాడ‌లో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల బృందం ప‌రామర్శించి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చింది. అనంత‌రం వారు అక్క‌డే మీడియాతో మాట్లాడారు. ప్ర‌తి సోమ‌వారం గ్రీవెన్స్‌ల పేరుతో విన‌తి ప‌త్రాలు తీసుకుంటూ క‌నీసం చ‌ద‌వకుండా చెత్త‌కుప్ప‌ల్లో ప‌డేస్తున్నార‌ని, వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటే గాదె సాయికృష్ణ‌, క్రాంతి కుమార్‌లు చ‌నిపోయేవారే కాద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కృష్ణ‌లంక లాంటి పోలీస్ స్టేష‌న్‌లు ఎన్నో ఉన్నాయ‌ని, వాటిల్లో అమాయ‌కుల‌కు జ‌రుగుతున్న అవ‌మానాలు, వేధింపుల‌కు ఇప్ప‌టికైనా ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఒక ద‌ళిత మ‌హిళ అయ్యుండీ బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి హోంమంత్రి అనిత‌కి తీరిక‌లేదా అని నాయ‌కులు ప్ర‌శ్నించారు. ప‌దే ప‌దే దళితుల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు సీఎం చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్ బాబు, మాజీ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, ఎమ్మెల్సీ రుహూల్లా త‌దిత‌రులు పేరుపోగు వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వారిలో ఉన్నారు. 
 
వారు ఇంకా ఏం మాట్లాడారంటే...  

మాదిగ కులంలో పుట్ట‌డం నా కొడుకు త‌ప్పా?  
- పేరుపోగు వెంకటేశ్వరావు, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు, క్రాంతి కుమార్ తండ్రి

కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజు వేధింపులు భరించ‌లేక నా కుమారుడు క్రాంతి కుమార్ మే 21న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయాడు. మాదిగ కులంలో పుట్ట‌డ‌మే త‌న త‌ప్ప‌యింద‌ని, త‌నకిష్టం లేక‌పోయినా సీఐ త‌నతో చాలా ప‌నులు చేయిస్తున్నాడ‌ని సెల్ఫీ వీడియో లో చెబుతూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న‌ను ఎన్నోసార్లు తీవ్రంగా కొట్టి హింసించాడ‌ని, చ‌నిపోయిన రోజున ఉద‌యం 10.30 గంట‌ల‌కు పోలీసులొచ్చినా త‌లుపులు తీయ‌లేదు. ఆ త‌ర్వాత 11 గంట‌ల ప్రాంతంలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. 12 గంట‌ల‌కు ఆస్ప‌త్రికి త‌ర‌లించినా బ‌తికించుకోలేక‌పోయాం. ఆ తర్వాత త‌న సెల్‌పోన్లో రికార్డు చేసిన వీడియో చూశాం. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌నిచేసే నా కొడుక్కే ఇలా జ‌రిగిందంటే సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌నేది ఆందోళ‌న క‌లిగిస్తోంది. సీఐ నాగ‌రాజు వంటి వారు పోలీసు వ్య‌వ‌స్థ‌కే మాయ‌ని మ‌చ్చ. నా కొడుకు మృతిపై ప్రభుత్వం స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాను. విజ‌య‌వాడ‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేష‌న్‌ల‌లో జ‌రుగుతున్న దారుణాల నేప‌థ్యంలో మా కుటుంబానికి సంఘీభావం ప్ర‌క‌టించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు.  

ద‌ళితుల‌కు సీఎం చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి
- టీజేఆర్ సుధాక‌ర్ బాబు, మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు

మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారి ఆదేశాల‌తో పేరపోగు వెంకటేశ్వరావు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చాం. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ద‌ళితుల‌పై దాడులు నిత్య‌కృత్య‌మైపోయాయి. చంద్రబాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశాల‌తోనే దళితుల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. ద‌ళిత యువ‌కుల‌పై  అక్ర‌మంగా గంజాయి కేసులు బ‌నాయించి రౌడీషీట్లు వేసి వేధిస్తున్నారు. అమాయ‌కుల‌ను నేరాల్లోకి లాగి పోలీసులు వారి అక్ర‌మాల కోసం ద‌ళిత యువ‌కుల‌ను వాడుకుంటున్నారు. బూట్ పాలిష్ చేయాల‌ని మాదిగ యువ‌కుడైన క్రాంతికుమార్‌ని వేధించిన సీఐ నాగ‌రాజు వైఖ‌రి ద‌ళితుల ప‌ట్ల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. చ‌ర్మం వ‌ల‌చ‌డం కూడా మా ద‌ళితుల వృత్తి అనే విష‌యం గుర్తుంచుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నాం. చంద్ర‌బాబు సీఎంగా ఉంటే ద‌ళితుల‌కు స్వేచ్ఛగా బతికలేక‌పోతున్నారు. అక్ర‌మ కేసులు, దాడులు చేసి మా గొంతు నొక్కాల‌ని చూస్తున్న చంద్ర‌బాబుకి రాబోయే రోజుల్లో ఖ‌చ్చితంగా బుద్ది చెబుతాం. సీఐని భ‌ర్త‌ర‌ప్ చేయ‌డంతోపాటు సీపీ, డీజీపీపై చ‌ర్య‌లు తీసుకోవాలి. ప‌దే ప‌దే ద‌ళిత జాతుల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు సీఎం చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.  

చంద్ర‌బాబు నేతృత్వంలో రాష్ట్రంలో నియంత పాల‌న‌
- నందిగం సురేష్‌, మాజీ ఎంపీ

లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగంతో రెండేళ్లుగా ద‌ళితుల‌పై న‌రమేధం సృష్టిస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించినా, విమ‌ర్శించినా కేసులే. చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చ‌ట్టాల‌ను ఉల్లంఘించి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.న్యాయ‌స్థానాలంటే వీరికి లెక్కే లేకుండా పోయింది. సాయికృష్ణ‌కు న్యాయం చేయాల‌ని కోరితే రౌడీషీట‌ర్ అని ఎల్లో మీడియాలో ట్రోల్ చేశారు. కేసులున్నాయ‌ని చంపే హ‌క్కు పోలీసుల‌కు ఎవ‌రిచ్చారు?  వైయ‌స్ జ‌గ‌న్ గారు స్పందించి బాధిత కుటుంబాన్ని ప్ర‌శ్నించే వర‌కు చంద్ర‌బాబు స్పందించ‌లేదు. ఓటు బ్యాంకు భ‌యంతోనే చివ‌రికి గాదె విజ‌య‌ల‌క్ష్మి కుటుంబాన్ని చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. క్రాంతి కుమార్ ఆత్మ‌హ‌త్య‌కు సీపీ, డీజీపీ, హోంమంత్రి స‌మాధానం చెప్పాలి. చంద్ర‌బాబు, నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హోంమంత్రి అనిత నేతృత్వంలోనే రాష్ట్రంలో ద‌మ‌న‌కాండ సాగుతోంది. చంద్రబాబు నియంత పాల‌న‌కు మూల్యం చెల్లించుకునే రోజులు త్వ‌ర‌లోనే ఉన్నాయి. రెండేళ్ల‌కే ఇన్ని దారుణాలు చేస్తే, రాబోయే మూడేళ్లు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ ప్ర‌భుత్వానికి మ‌ళ్లీ ఓటడిగే హ‌క్కు లేదు. 
 

రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చిన ధైర్యంతోనే ద‌ళితుల‌పై పోలీసుల దాడులు  
- ఆదిమూల‌పు సురేష్‌, మాజీ మంత్రి

పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని కూట‌మి ప్ర‌భుత్వం సాగిస్తున్న మార‌ణ‌కాండ‌కు కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిన సాయికృష్ణ‌, క్రాంతికుమార్ మ‌ర‌ణాలే సాక్ష్యం. ఇలాంటి కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్లు రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి. నెల‌రోజులుగా త‌న‌కు న్యాయం చేయాల‌ని సాయికృష్ణ త‌ల్లి విల‌పిస్తున్నా ప్ర‌భుత్వం త‌ర‌ఫున హోంమంత్రి స‌హా ఏ ఒక్క‌రూ స్పందించలేదు. వైయ‌స్ జ‌గ‌న్ గారు ముందుకొచ్చి సాయికృష్ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాకే ప్ర‌భుత్వంలో చ‌ల‌నం వ‌చ్చింది. ద‌ళితులుగా ఎవ‌రైనా పుట్టాల‌ని కోరుకుంటారా అని చెప్పిన సీఎం చంద్ర‌బాబు నుంచి ద‌లితుల‌కు ర‌క్ష‌ణ ఆశించ‌డం కూడా వృథా ప్ర‌యోసే అవుతుంది. రెడ్ రాజ్యాంగం ఇచ్చిన ధైర్యంతోనే పోలీసులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతూ అమాయ‌కులైన ద‌ళిత యువ‌కుల‌ను వేధిస్తున్నారు. మాదిగ జాతిలో పుట్టిన ద‌ళిత మ‌హిళ అయిన హోంమంత్రి అనిత త‌క్ష‌ణం స్పందించి క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి. క్రాంతి కుమార్‌ని ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన పోలీసుల‌పై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాలి. వారి కుటుంబాన్ని ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలి. వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు పాల్ప‌డుతున్న‌ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంది. 

క్రాంతి కుమార్ కుటుంబాన్ని చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించాలి   
- మ‌ల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రం న‌డిబొడ్డున ఉన్న విజ‌య‌వాడలోనే ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. ప్ర‌జ‌ల‌ను కాపాడాల్సిన పోలీసుల నుంచే పౌరుల‌కు వేధింపులు వ‌స్తుంటే వారు ఎవ‌రికి చెప్పుకోవాలి?  రెండేళ్లుగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను అక్ర‌మ కేసుల‌తో వేధించిన పోలీసులు, ఇప్పుడు సామాన్య పౌరుల‌ను సైతం వేధిస్తున్నారు. పోలీసులే పౌరుల హ‌క్కుల‌ను హ‌రిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పేప‌ర్ల‌కే ప‌రిమిత‌మైంది. సాయికృష్ణ‌ను చంపేసి శవాన్ని కూడా క‌న‌ప‌డ‌నీయ‌కుండా బూడిద చేసిన పోలీసులు, క్రాంతికుమార్‌ని ఇంటికొచ్చి మ‌రీ వేధించి ఆత్మహ‌త్య చేసుకునేదాకా ప్రేరేపించారు. తండ్రి మ‌ర‌ణంతో దిక్కులేకుండా పోయిన క్రాంతి కుమార్ కుటుంబానికి ప్ర‌భుత్వం న్యాయం చేయాలి. వారి కుటుంబాన్ని సీఎం చంద్ర‌బాబు, హోంమంత్రి అనిత ప‌రామ‌ర్శించాలి. ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జ‌ల నుంచి విన‌తిప‌త్రాలు తీసుకుని క‌నీసం చ‌ద‌వ‌కుండా చెత్త‌బుట్ట‌లో ప‌డేస్తున్నారు. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తే సాయికృష్ణ‌, క్రాంతికుమార్ మ‌ర‌ణాలు సంభ‌వించేవి కాదు. ఇది మంచి ప్ర‌భుత్వం కాదు.. ఇది మేక‌ప్‌, లాక‌ప్ ప్ర‌భుత్వం. 

మంచి ప్ర‌భుత్వంలో ద‌ళితుల‌పై అడుగ‌డుగునా దారుణాలు
- కొమ్మూరి క‌న‌కారావు, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ 

మూడు నెల‌లుగా కృష్ణ‌లంక సీఐ నాగరాజు త‌న‌ను వేధిస్తున్నాడ‌ని క్రాంతికుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయాడు. కానీ మంచి ప్ర‌భుత్వం అని చెప్పుకునే చంద్ర‌బాబు ఈ ఘ‌ట‌న‌పై ఎందుకు విచార‌ణ‌కు ఆదేశించ‌లేదు?  సీఐ నాగ‌రాజుపై ఎందుకు కేసు పెట్ట‌లేదు?  కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి దళితుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. క్రాంతి కుమార్ మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి. వారి కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకోవాలి.

Back to Top