తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ  నేత ఇల్లు కూల్చివేత

అనంతపురం జిల్లా: తాడిపత్రి వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు  
మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్‌కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్‌ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్‌ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్‌కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్‌ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.

వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్‌ పరికరాలు, మోటర్‌ సెల్‌ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Back to Top