బాబూ..ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎప్పుడైనా పట్టించుకున్నావా?

వైయస్‌ఆర్‌సీపీ నేత దాడి వీరభద్రరావు 
 

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని వైయస్‌ఆర్‌సీపీ నేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. విశాఖ ప్రజలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విషం కక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తోంటే.. చంద్రబాబు విషపూరితం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో తాము అభివృద్ధి చెందుతామన్న భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో కలుగుతుందన్నారు. పరిపాలనా రాజధానిగా సేవలందించేందుకు విశాఖకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. ముంబై, చెన్నై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం విశాఖకే ఉందన్నారు. నాలుగు రకాల రవాణా మార్గాలు విశాఖకు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఐఐటీ నిపుణులు కూడా అమరావతిలో భారీ నిర్మాణాలు సరికాదని చెప్పారని వివరించారు.
 
మూడు ప్రాంతాల అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన
మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే వైయస్‌ జగన్‌ ఆలోచన అని వీరభద్రరావు తెలిపారు.  అడిగినా ఇవ్వని నాయకుడు చంద్రబాబు అయితే.. అడగకుండానే ఇచ్చే నాయకుడు వైయస్‌ జగన్‌ అని వీరభద్రరావు అభివర్ణించారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు ఆయనపై పోటీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. పార్టీ ఓడిపోవడంతో పదవి కోసం ఎన్టీఆర్‌ చుట్టు తిరిగారని విమర్శించారు. కూతురు కోసం చంద్రబాబును పార్టీలోకి తీసుకుని చివరికి..అతని చేతిలోనే ఎన్టీఆర్‌ మోసపోయారని తెలిపారు.
 

Back to Top