విశాఖ: బీజేపీని ఆకర్శించేందుకు చంద్రబాబు కుప్పిగంతులు వేస్తున్నాడని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు ఉచిత ఇసుకను తన కుమారుడు లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చారని తెలిపారు. తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు మహా మాంత్రికుడని ప్రభుత్వం అవార్డు ఇస్తే సముచితంగా ఉంటుందన్నారు. 12 గంటల ఇసుక దీక్ష అట. భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం ఆయన నామమాత్రంగా పొద్దున నుంచి సాయంత్రం వరకు దీక్ష. ఆయన దీక్షను తన సొంత ఎమ్మెల్యేలు మద్దతు తెలుపలేదన్నారు. 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. అంటే చంద్రబాబు దీక్షకు మద్దతు లేదన్నారు. చంద్రబాబుతో ఉంటే డ్యామేజ్ అవుతామనే భయంతోనే టీడీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారన్నారు. చంద్రబాబు తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారన్నారు. అలాగే మరికొంత మంది ఎమ్మెల్యేలను కూడా బీజేపీలోకి పంపుతున్నట్లు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటీవల నాగపూర్ వెళ్లిన ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో రహస్య మంతనాలు జరిపారన్నారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, వారితో కలిసి ప్రయాణం చేయకూడదని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకుందన్నారు. ఎలాగైనా బీజేపీతో కలిసి నడిచేందుకు చంద్రబాబు తనకు పరపతి ఉందని, నా వెనుకలా మనుషులు ఉన్నారని చూపించేందుకు ఇసుక దీక్షను చేపట్టారన్నారు. ఇద్దరు ఆర్టిస్టులను పక్కన పెట్టుకొని భవన నిర్మాణ కార్మికులంటూ ఫోటోలకు ఫోజులిచ్చారన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగిన సమయంలో ఆ రోజు కూడా సానుభూతి పొందవచ్చు అని ప్రయత్నం చేశారన్నారు. ఆయన్ను ఎవరు కూడా పరామర్శించేందుకు ముందుకు రాకపోవడంతో..రోజుకు 10 బస్సుల్లో స్కూల్ పిల్లలను పిలిపించుకొని వారితో మాట్లాడినట్లు ప్రచారం చేశారన్నారు. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా డబ్బులిచ్చి ప్రజలను ప్రత్యేక బస్సుల్లో మీటింగ్‌కు తరలించడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. నిన్న భవన నిర్మాణ కార్మికులపై ఉన్న ప్రేమతో దీక్ష చేయలేదన్నారు. లోకేష్‌పై తప్ప ఎవరిపైనా కూడా చంద్రబాబుకు ప్రేమ ఉండదని, అందరితోనూ ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటారన్నారు. ఎమ్మెల్యేలను, నాయకులను ఆకర్శించేందుకు దీక్ష చేశారన్నారు. అలాగే బీజేపీని ఆకర్శించేందుకు దీక్ష చేశారన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఉన్న ప్రేమతో ఎందుకు దీక్ష శిబిరాన్ని సందర్శించలేదన్నారు. గతిలేకనే చంద్రబాబుతో పవన్ కొనసాగుతున్నారన్నారు. నిజంగా ప్రేమ ఉంటే నిన్నటి దీక్షలో పాల్గొనే వారన్నారు. ఉచిత ఇసుక వచ్చే వరకు చంద్రబాబు పోరాటం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తన పాలనలో ఉచిత ఇసుక ప్రజలకు ఇవ్వలేదని, తన కుమారుడు లోకేష్‌కు, తన టీడీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి రాష్ట్ర ఖజానాను దోచిపెట్టారన్నారు. ప్రత్యేక నిధి పేరుతో నిధుల సేకరణకు ఈ ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఒక్క ఇసుక ట్రాక్టర్ అయినా టీడీపీ నేతలు పట్టుకున్నారా అని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. Read Also: రైతులు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే పాదయాత్ర