తాడేపల్లి : డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు హెలికాప్టర్‌లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా? అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు . జగన్‌ని అధికారంలోకి రానివ్వనని చెప్పడం కన్నా.. చంద్రబాబును మోస్తూ ఉంటానని చెప్తే మంచిదని అంబటి రాంబాబు చురకలంటిచారు. వైయస్ జగన మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు భయం పట్టుకుందని విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. కూటమి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడమని హెచ్చరించారు. ‘పుష్ప సినిమా అన్నా, ఆ సినిమాలోని హీరో అన్నా పవన్ కళ్యాణ్‌కు నచ్చదు. అందుకే ఆ సినిమాలోని డైలాగులు పోస్టర్ వేసిన యువకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు. సినిమా షూటింగులు చేసుకుంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ తెలుసుకోలేక పోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఆయన ఇచ్చిన స్క్రిప్టులు చదవటమే పనిగా పెట్టుకున్నారు. పవన్‌కి ఇల్లు, ఆఫీసు కట్టిస్తున్నది చంద్రబాబు కాదా?, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పేరుతో దియేటర్ల యాజమాన్యాలను బెదిరించారు. నాగబాబుని మంత్రి పదవిలోకి తీసుకుంటానని చంద్రబాబు లెటర్ రాసిచ్చి మోసం చేశాడు. మరి పదవి ఇవ్వలేదని చంద్రబాబును ఎందుకు అడగటం లేదు?’ అని అంబటి ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తెలుగుదేశం గూండాలు దాడులు చేస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారు. మూడు దాడులు - ఆరు తప్పుడు కేసులుగా రాష్ట్రంలో పాలన సాగుతోంది. గుంటూరుజిల్లా పొన్నూరు మండలంలోని మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు మీద స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో టీడీపీ గూండాలు తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఆయన చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌లు రెడ్‌బుక్ పాలన, పొలిటికల్ గవర్నెన్స్‌తో భయోత్పతాన్ని సృష్టిస్తున్నారు. వీటన్నిటి వెనుక ఒక అజ్జాత యంత్రాంగాన్ని నడుపుతున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రిటైర్డ్ ఐపీఎస్‌లు ఈ యంత్రాంగంలో భాగస్వాములుగా మారి, చంద్రబాబు కోసం ఎటువంటి తప్పుడు పనులకు అయినా సిద్దమవుతున్నారు. చంద్రబాబు ఆదేశాలు ఇస్తారు, ఈ అజ్ఞాత యంత్రాంగం కిందిస్థాయిలో దానిని ఆచరణలోకి తీసుకువస్తున్నారు. ఈ అజ్ఞాత యంత్రాంగంలోని వారందరూ మాకు తెలుసు, సమయం వచ్చినప్పుడు వారి సంగతి చూస్తాం. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన్పపుడు వారి ఆగడాలను ప్రజల ముందు పెడతాం. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. గూగుల్ టేక్ అవుట్లు మాకూ ఉన్నాయి. ఈ అజ్ఞాత యంత్రాంగం ఏం చేస్తుందో గమనిస్తూనే ఉన్నాం. చంద్రబాబును రక్షించడానికి, మమ్మల్ని భక్షించడానికి పనిచేస్తున్న వీరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ కేసులే అజ్ఞాత యంత్రాంగం అరాచక వ్యూహాలకు నిదర్శనం పల్నాడు గుండ్లపాడు అనే గ్రామంలో రెండు తెలుగుదేశం వర్గాలు కొట్టుకుని, ఇద్దరు చనిపోయారు. ఈ సంఘటనపై విచారణ జరిపిన పల్నాడు ఎస్పీ దీనిపై మీడియా ముఖంగా మాట్లాడారు. టీడీపీలోని రెండు వర్గాలు కొట్టుకున్నాయి, ఇది టీడీపీ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ, దానిలోనే ఈ మరణాలు జరిగాయని ప్రకటించారు. ఈ ఘటన జరిగిన తరువాత చంద్రబాబు కనుసన్నల్లోని అజ్ఞాత యంత్రాంగం పల్నాడు ఎస్పీతో మాట్లాడి, ఆ కేసును ఎలా రాజకీయం చేయాలి, దానిలో ఎవరిని ఇరికించాలి, ఎవరిపైన కేసులు బనాయించాలో సూచించారు. ఆ వెంటనే జిల్లా ఎస్పీ కేసులోని అసలు నిజాలను పక్కకుపెట్టి, రాజకీయంగా వైయస్ఆర్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగానే ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేని వైయస్ఆర్‌సీపీ నేతలు పిన్నెల్లి సోదరులపై అక్రమంగా కేసులు బనాయించారు. వైయస్ జగన్ ఇటీవల సత్తెనపల్లిలో పర్యటించినప్పుడు పోలీసులు కనీస రక్షణ కల్పించలేదు. ఆయన వాహనం ప్రయాణించే చోట పోలీస్ సిబ్బంది, రోప్ పార్టీలు లేవు. ఈ పర్యటనలో ఒక కారు డీ కొనడంతో సింగయ్య అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పల్నాడు ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సింగయ్యను ఢీ కొట్టింది వైయస్ జగన్ కాన్వాయికి చెందిన కారు కాదు, అంతకు ముందుగానే ప్రయాణించిన ఒక ప్రైవేటు కారు అంటూ దాని నంబర్‌తో సహా మీడియాకు వివరించారు. గుంటూరు ఎస్పీ కూడా దానినే ధ్రువీకరించారు. కానీ తరువాత జరిగిన అజ్ఞాత యంత్రాంగం ఆదేశాలతో పోలీసులు ఈ కేసును మార్చేసి వైయస్ జగన్‌పై నెపాన్ని మోపేందుకు తప్పుడు కేసులు కట్టారు. ఇదే ఘటనపై సాక్షాత్తు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైయస్ జగన్ కారు కింద పడ్డ సింగయ్యను కుక్కపిల్లను లాగేసినట్లుగా లాగేశారంటూ అత్యంత దారుణమైన భాషతో మాట్లాడారు. సింగయ్యను ఆటోలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తే పోలీసులే అడ్డుకున్నారు. అంబులెన్స్‌లో ఎక్కేప్పుడు సింగయ్య బతికే ఉన్నాడు. అంతకు ముందు ఆయన అందరితోనూ మాట్లాడారు, తన భార్య ఫోన్ నెంబర్ ఇచ్చి, వారితో ఫోన్‌లో కూడా మాట్లాడారు. అంబులెన్స్‌లోకి ఎక్కినప్పుడు ఆయన బతికే ఉన్నారు. తరువాత కిందికి దిగేప్పుడు చనిపోయాడు. సింగయ్యను వైయస్ జగన్ కారు కావాలని మీదికి ఎక్కించి, తొక్కించి చంపారని చంద్రబాబు బుద్ది లేకుండా మాట్లాడారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు అన్నం తింటున్నారా? లేక గడ్డి తింటున్నారా? ఏమిటీ ఈ ఆరోపణలు? ఇంత దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని, అజ్ఞాత యంత్రాంగంతో తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని అనుకుంటున్నారా? అధికారంలోకి వచ్చినప్పుడు రాజకీయాలు ఎన్నికల వరకే అంటూ మాట్లాడారు. కానీ ఏడాది పాలనలో రాజకీయ కక్షసాధింపులతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. సాక్షి చర్చావేదికలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబు డబ్బుతోనే జనసేనను నడుపుతున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురంలో ఏదేదో మాట్లాడారు. ఏపీలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసా? అప్పుడప్పుడూ ఆయన నిద్రలేని, తోచింది మాట్లాడుతుంటారు. సినిమా డైలాగులు చెబితే సహించమంటూ పవన్ కళ్యాణ్ హూంకరిస్తున్నారు. పుష్పా సినిమా డైలాగ్ రప్పా...రప్పాను సహించడు, ఆ సినిమా హీరోనూ పవన్ సహించడు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా అది. ఆ సినిమా అంటే ఇష్టం లేదు కాబట్టే దానిలోని డైలాగ్‌లను సహించను అంటున్నాడు. డిప్యూటీ సీఎంగా ఉండి తొక్కి నార తీస్తానంటూ ఆయన మాత్రం సినిమా డైలాగులు చెబుతాడు. ఇలా డైలాగులు చెప్పడానికి పవన్‌కు బుద్ది, జ్ఞానం ఉందా? గతంలో కారు మీద ఎక్కి వీర విహారం చేసిన విషయం మరిచిపోయాడు. జల్‌జీవన్ మిషన్ కార్యక్రమంలో పవన్ చెప్పినవన్నీ సినిమా డైలాగులే. కాకినాడ జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.1000 కోట్లు చెల్లింపులు లేక అల్లాడుతున్న విషయం పవన్ కు తెలుసా? స్పెషల్ ఫ్లైట్లలో హైదరాబాద్‌కు, షూటింగ్‌లకు వెళ్ళడమే పవన్‌కు తెలుసు. చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే దానిని చదువుతాడు. చంద్రబాబు, లోకేష్‌లు బ్యాగులకు బ్యాగులు డబ్బులు పంపిస్తుంటే తీసుకోవడం లేదా? జనసేన పార్టీని నడపడానికి, ఆయన కార్లకు ఆయిల్ పోసుకోవడానికి, ఆఖరికి ఆయనకు చెందిన బిల్డింగ్ నిర్మించడానికి కూడా వారే డబ్బులు పంపుతున్నారు. కాదు అని గుండెమీద చేయి వేసుకుని చెప్పాలి. చంద్రబాబుకు ఊడిగం చేయడమే పవన్ పని హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా అంటూ సినిమా థియేటర్ల మీద భగ్గుమన్నారు. దానిపై విచారణ అంటూ రంకెలు వేశారు. ఆ విచారణ ఏమయ్యిందీ? తనకు వ్యతిరేకంగా ఉన్న థియేటర్ల మీద దాడులు చేయించాడు. దాని తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. వీరమల్లు సినిమా ఎందుకు రిలీజ్ కాకుండా వాయిదా పడింది? తన శాఖ పరిధిలో నరేగాలో కూలీలకు వేతనాలు చెల్లించకుండా ఇన్ని రోజుల పాటు బకాయి పెట్టిన సందర్భం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అంతెందుకు పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలో చేర్చుకుంటాను అని చంద్రబాబు సీఎంగా ఒక లేఖను విడుదల చేశారు. దీనిని ఇంత వరకు ఎందుకు అమలు చేయలేదు? దీనిపై చంద్రబాబును అడిగే ధైర్యం పవన్‌కు ఉందా? అప్పుడప్పుడూ గుర్తుకు వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి జగన్‌ను అధికారంలోకి రానివ్వనంటూ రంకెలు వేస్తున్నారు. 2019లో జగన్ అధికారంలోకి రారు, రానివ్వనూ, నాదీ హామీ అంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఆయనను అడ్డుకోగలిగారా? ఇటువంటి జరగని విషయాలను కాకుండా చంద్రబాబునే నేను మోస్తాను, ఆయనను అధికారంలో కూర్చోబెట్టడమే నా కర్తవ్యం, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, ఆయనకు భజన చేస్తాను, నేను సెకండ్ గ్రేడ్ లీడర్ గానే మిగిలిపోతాను అని చెప్పుకోవాలి. చివరికి తనను నమ్ముకున్న జనసేన పార్టీ శ్రేణులను కూడా పవన్ మోసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పేరుకే ఉప ముఖ్యమంత్రి తప్ప పాలనలో పవన్ భాగస్వామ్యం ఏదీ? అటువంటి పవన్ వైయస్ఆర్‌సీపీని అధికారంలోకి రానివ్వనంటూ రంకెలు వేయడం హాస్యాస్పదంగా ఉంది. మమ్మల్ని ఆపడం పవన్, చంద్రబాబు వల్ల కాదు. జగన్ గారు ఒంటరిగా పోరాడేతత్వం ఉన్న నాయకుడు. అందుకే నేటికీ వైయస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం ఆయన వెంట నడుస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ పట్ల ఆదరణతో మళ్ళీ మేం అధికారంలోకి వస్తాం. పవన్ కళ్యాణ్ తాటాకు చప్పుళ్ళకు భయపడేదే లేదు. వైయస్ఆర్‌సీపీకి 11 సీట్లు వచ్చినా, 40 శాతం ఓట్లు వచ్చాయి. మూడు పార్టీలు కలిసి, అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఏడాది పాలన తరువాత తొలి అడుగు పేరుతో ప్రజల ముందుకు వెడుతుంటే, వారి నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సింగిల్‌గా ఎన్నికల్లో నిలబడి ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. తెలుగుదేశం, బీజేపీల అండతోనే జనసేన గెలిచింది. దానిని ఆయన సొంతబలం అనుకుని భ్రమపడుతున్నారు.