బెస్తవారిపేటలో వైయ‌స్ఆర్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

మార్కాపురం జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేరకు, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి పిలుపుతో బెస్తవారిపేట మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతులు, హామీ బాండ్లను చింపివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా తీర్పును, ప్రజాస్వామ్య విలువలను అవమానపరిచే విధంగా వెన్నుపోటు రాజకీయాలు సాగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించేందుకే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు నిజాలు తెలియజేసి, కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం ప్రజల్లోనే ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేగనాటి ఓసురరెడ్డి, మండల అధ్యక్షుడు ఆవులు శ్రీధర్‌రెడ్డి, మండల నాయకులు, గ్రామ పార్టీ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top