గుంటూరు : పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల వేధింపులు తాళలేక ఉర్దూ అకాడమీ లైబ్రేరియన్ షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమని గుంటూరు టౌన్ వైయస్సార్‌సీపీ అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. షేక్ నూరి ఫాతిమా ఏమన్నారంటే.. ఒక స్థలం వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకుని, పోలీసు అధికారుల వేధింపులు, బెదిరింపుల కారణంగానే దరియా హుస్సేన్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో కూడా తన మరణానికి పోలీసులే కారణమని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. కూటమి ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ చెప్పుచేతల్లో నడుస్తోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు ప్రజలను బెదిరించే స్థాయికి దిగజారడం అత్యంత దురదృష్టకరం. ప్రజలకు భరోసాగా ఉండాల్సిన పోలీసులంటే ఇప్పుడు భయం కలుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలు జరిగాయి. ఇప్పుడు దరియా హుస్సేన్ మరణం కూడా పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర అనుమానాలు కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దరియా హుస్సేన్ మరణానికి కారణమైన పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేసి, నిష్పాక్షిక విచారణ చేపట్టాలి. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇకపై పోలీసుల వేధింపులకు మరో కుటుంబం బలి కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం.