సీబీఐ చార్జ్‌షీట్‌ను కచ్చితంగా సవాల్‌ చేస్తాం

దర్యాప్తు పేరిట పొలిటికల్‌ టార్గెటింగ్‌

వైయ‌స్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ పూర్తిగా అవాస్తవం

దర్యాప్తు పేరుతో వైయ‌స్ఆర్ సీపీ, ఎంపీ అవినాష్‌రెడ్డిని అప్ర‌తిష్ట‌పాలు చేయాల‌నే ఆలోచ‌న‌ 

సీబీఐ చార్జిషీట్‌ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉంది

నాడు వివేకా హత్యకు ఎంత కుట్ర చేశారో.. నేడు అంతకంటే ఎక్కువ కుట్ర

వైయ‌స్ వివేకా హ‌త్య వైయ‌స్ జ‌గ‌న్‌ను, పార్టీని కుంగ‌దీసింది

చంద్రబాబు, ఆ ముఠా లక్ష్యానికి తగినట్లుగా దర్యాప్తు జరుగుతోంది.. కాదంటారా?

చార్జ్‌షీట్ పేరుతో ఎల్లో మీడియా కథ‌నాలు వండి వార్చింది

క‌చ్చితంగా స‌వాల్ చేస్తాం.. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియాలి

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి: నాడు వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హత్యకు ఎంత కుట్ర చేశారో.. నేడు అంతకంటే ఎక్కువ కుట్ర జరుగుతోందని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్‌ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉందని, చార్జ్‌షీట్‌లో సంబంధం లేని వ్యక్తులపై కుట్ర జరుగుతుందన్నారు. వైయ‌స్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశానికి సంబంధించి ఎల్లో మీడియా అంతా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని మండిప‌డ్డారు. బాధితులనే నిందితులుగా చేర్చే కుట్ర జరుగుతుందని, సీబీఐ చార్జిషీట్‌ను కచ్చితంగా స‌వాల్ చేస్తామ‌ని, వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలియాల‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డిని అప్ర‌తిష్ట‌పాలు చేసేందుకు ఆలోచ‌న చేస్తున్న‌ట్టుగా స్ప‌ష్టంగా క‌నిస్తుంద‌న్నారు. 

వైయ‌స్ఆర్ సీపీ అధినేత‌ వైయ‌స్‌ జగన్‌ను ముఖ్య‌మంత్రి సీఎం చేయాలని వైయ‌స్ వివేకా అహర్నిశలు కృషి చేశార‌ని గుర్తుచేశారు. సీబీఐ చార్జిషీట్‌ హేతుబద్ధంగా లేకుండా కథనంలా ఉంద‌న్నారు. ఎంపీ టికెట్‌ కోసం వైయ‌స్ వివేకా హత్య జరిగిందనే కోణంలో చార్జిషీట్‌లో కథనం రాయడం పూర్తి అసంబద్ధమ‌న్నారు.  వైయ‌స్ అవినాష్‌ గెలుపు కోసం చివరి క్షణం వరకూ వైయ‌స్‌ వివేకా కృషి చేశారన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..

సత్యదూరం. అసంబద్ధ కథనం..
``2019 మార్చి 15న వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వైయ‌స్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి నేను ఒక ప్రభుత్వ సలహాదారుడిగా కాకుండా, వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా.. వైయ‌స్ వివేకానందరెడ్డిని ఎంతో అభిమానించే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. వాస్తవాలు మరిచి సత్యదూరమైన, అసంబద్ధమైన కథ‌నం సీబీఐ ఛార్జ్‌షీట్‌ పేరుతో వచ్చింది. ఎన్నికల ముందు మొత్తం పార్టీనే కుదిపేసిన, అప్పుడు పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌ను వ్యక్తిగతంగా కుంగదీసిన ఘటన వైయ‌స్ వివేకా హ‌త్య‌. కచ్చితంగా అది రాజకీయ అంశంతో ముడిపడి ఉందని అనుకున్నాం. అందుకు తగిన ఆధారాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

ఆ హత్యతో నష్టపోయింది పార్టీనే..
అది ఒక కోణం కాగా, మరో కోణం చూస్తే.. వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే చోటు చేసుకున్న పరిణామాలు, వరసగా బయటకు వచ్చిన వార్తల వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది అనుకోవడానికి అవకాశం ఏదైతే ఉందో.. దానికి కారణాలు ఏమిటని చూస్తే, సమాధానం కూడా దొరుకుతుంది. పార్టీలో కీలకంగా ఉండి, అందరితో కలిసిమెలిసి ఉంటూ, వైయ‌స్‌ జగన్ ని సీఎం చేయడానికి శాయశక్తులా పని చేసిన నాయకుడు హఠాత్తుగా చ‌నిపోవడం ఎవరికి నష్టం? ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు, మొత్తం పులివెందుల నియోజకవర్గానికి నష్టం. 

హత్యకు మించిన కుట్రలు కుతంత్రాలు..
కానీ ఇవాళ సీబీఐ ఛార్జ్‌షీట్‌ చూస్తే.. అది ఒక కథనంగా ఉంది. వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉంది. వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్య వైయస్సార్‌ కుటుంబానికి, వైయస్సార్‌సీపీకి ఎంతో నష్టం కలిగించగా.. అందులో వారే చేశారని చెప్పడానికి ప్రయత్నించడంతో పాటు, అందులో సంబంధం లేని వారిని కలపడానికి అభూతకల్పనలు సృష్టించి  ఛార్జ్‌షీట్‌ రూపొందిస్తే, దాన్ని చూపి ఎల్లో మీడియా రాసింది. దీన్ని బట్టి చూస్తే ఇది పూర్తిగా ఒక దురుద్దేశపూర్వకం. కుట్రపూరితం. ఆరోజు హత్యకు ఎలా కుట్ర చేశారో, అంతకు మించి ఇవాళ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. అందరూ చూస్తున్నారు. ఎల్లో మీడియా దీనికి ముందుగానే సిద్ధంగా ఉండడం, సమాచారం రాగానే అందుకోవడం, హైలైట్‌ చేయడం.. ఇదంతా ఒక సమన్వయంతో జరిగినట్లు కనిపిస్తోంది. 

పార్టీ గెలుపుకోసమే వైయ‌స్‌ వివేకా ప్రచారం..
సీబీఐ ఛార్జ్‌షీట్‌లో అసలు అర్థం కానిది ఏమంటే, టికెట్‌ ఇచ్చేది వైయ‌స్ జగన్‌. వారు ఆ టికెట్‌ ఆశిస్తున్నట్లు ఎక్కడా లేదు. అంతే కాకుండా వైయ‌స్‌ వివేకానందరెడ్డి, అప్పుడు ఎంపీగా పోటీ చేసిన వైయ‌స్ అవినాష్‌రెడ్డి గెలుపు కోసమే ప్రచారం చేస్తున్నారు. అందుకోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే విషయాన్ని వివేకానందరెడ్డి కూతురు సునీత కూడా చెప్పారు. హత్య తర్వాత 27వ తేదీన సునీత‌మ్మ మాట్లాడారు. 

అలా ఎలా అనుకుంటారు?
మరి అలాంటప్పుడు తనకు వైయ‌స్‌ జగన్ కుటుంబ సభ్యుల వల్ల టికెట్‌ రాదని వైయ‌స్‌ వివేకానందరెడ్డి అనుకున్నారని ఎలా అనుకుంటారు..? కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎందుకు అలా రాసిందో అర్ధం కావడం లేదు. అది ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిందంటే, వారి ప్రయోజనాల కోసం రాసి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ జాతీయస్థాయిలో దర్యాప్తులో పేరు పొందిన సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో ఎలా రాసిందన్నది తెలియడం లేదు. 

వైయ‌స్ అవినాష్‌రెడ్డికి ఎప్పుడు తెలిసింది?
వైయ‌స్ వివేకానందరెడ్డికి గుండెపోటు అన్న విషయం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వైయ‌స్ అవినాష్‌రెడ్డి అక్కడికి ఎప్పుడు వెళ్లాడు? శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేస్తే జమ్మలమడుగు వెళ్తున్న అవినాష్‌రెడ్డి వెనక్కి వచ్చాడు. ఆయన వెంట ఉన్న శంకర్‌రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయనా వచ్చాడు. మరి అవినాష్‌రెడ్డికి శివప్రసాద్‌రెడ్డి ఫోన్‌ చేశాడంటే, విషయం ముందుగా ఎవరికి తెలిసింది?  అసలు వైయ‌స్‌ వివేకానందరెడ్డికి గుండెపోటు వచ్చి పడిపోయాడన్న మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీజేపీ నాయకుడిగా ఉన్న ఆదినారాయణరెడ్డి మాట్లాడిన వీడియోను ప్ర‌ద‌ర్శించారు. 

లెటర్‌ ఎందుకు బయట పెట్టలేదు?
వైయ‌స్ వివేకా హత్య విషయాన్ని శివప్రసాదరెడ్డి.. ఫోన్‌ చేసి వైయ‌స్ అవినాష్‌రెడ్డికి చెబితే.. విషయం అంత క్లియర్‌గా ఉంటే.. సీబీఐ ముందుగానే సిద్ధం చేసుకున్నట్లుగా అవినాష్‌ను చేరుస్తూ ఛార్జ్‌షీట్‌ రూపొందించింది. అందుకే దాన్ని చూడగానే షాక్‌కు లోనయ్యాం. వైయ‌స్ వివేకానందరెడ్డికి సన్నిహితుడైన కృష్ణారెడ్డికి ఒక లెటర్‌ దొరికితే, దాన్ని పక్కన పెట్టించారు. దాన్ని ఎవరికీ చూపలేదు. ఎంపీ అవినాష్‌రెడ్డికి కానీ, సీఐకి కానీ చూపలేదు. అలా చూపి ఉంటే అన్నీ తెలిసేవి. వైయ‌స్ వివేకానందరెడ్డి మరణం సహజం కాదు. దారుణ హత్య. పక్కా ప్రణాళికతో చేసిన హత్య అన్నది ఆ లేఖ ద్వారా తేలిపోయేది. కానీ అందుకు భిన్నంగా కొందరిని ఇరికించడానికి, ఆ లేఖను మాయం చేశారు. అదే యోచనతో సీబీఐ ఛార్జ్‌షీట్‌ కూడా తయారు చేసినట్లు ఇప్పుడు స్పష్టమవుతోంది. వైయ‌స్ వివేకానందరెడ్డిది హత్య అన్న విషయం స్పష్టం చేసే, ఆ లెటర్‌ను కనీసం ఆ సాయంత్రం అయినా ఎందుకు బయటపెట్టలేదు.

ప్రి డిటర్మైండ్‌. మోటివేటెడ్‌..
నిజానికి హత్య విషయం ముందుకు ఆయన కుటుంబ సభ్యులకు తెలిసింది. అందుకే ఆయనకు సన్నిహితుడైన శివప్రసాదరెడ్డికి కూడా తెలిస్తే, ఆయన స్వయంగా ఫోన్‌ చేసి వైయ‌స్ అవినాష్‌రెడ్డికి చెప్పాడు. వాస్తవాలు ఇంత క్లియర్‌గా ఉంటే, సీబీఐ ఛార్జ్‌షీట్‌ పూర్తిగా ఒక ప్రిడిటర్‌మైండ్, మోటివేటెడ్, మాలఫైడ్‌ ఇంటెన్షన్‌తో రూపొందించినట్లు ఉంది. ముఖ్యంగా దర్యాప్తు పేరుతో బలవంతంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీ నాయకులను, ఇంకా ఎంపీ అవినాష్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది.

నిష్పాక్షిక దర్యాప్తు కోరుకున్నాం..
2020 మార్చిలో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2019 మార్చి 15న వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్య జరిగితే, అదే ఏడాది మే 30 వరకు టీడీపీనే అధికారంలో ఉంది. అప్పుడు ఉన్న అధికారులే, వైయ‌స్ జగన్  సీఎం అయిన తర్వాత చాలా కాలం ఉన్నారు. కేసు సీబీఐకి అప్పగించాలని కోరితే, సీఎం  వైయస్‌ జగన్  వెంటనే ఒప్పుకున్నారు. ఎక్కడా ఏదీ దాచుకోలేదు. ఆయన ఈ కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని కోరుకున్నారు. 

అంతా విచిత్రం..
కేసును 2020 మార్చిలో సీబీఐకి అప్పగిస్తే, ఇప్పుడు అది కీలక ఘట్టానికి చేరింది. ఆరోజు ఫిర్యాదు చేసిన కృష్ణారెడ్డి.. తనను దారుణంగా వేధిస్తున్నారని, శంకర్‌రెడ్డి, ఆయన అనుచరుల పేర్లు చెప్పమని వేధిస్తున్నారని చెప్పడం. మరోవైపు రాంసింగ్‌ అనే వ్యక్తి కూడా తనను బెదిరిస్తున్నారని చెప్పడం, ఇంకా సీఐ శంకరయ్యను బెదిరించారని.. ఇవాళ ఉదయ్, గంగారెడ్డి, కృష్ణారెడ్డి.. అందరూ చెబుతున్నారు. శంకర్‌రెడ్డి రక్తాన్ని తుడవమన్నాడని. గంగిరెడ్డి ఇతరులు హత్య చేశారని. వీళ్ల వెనక పెద్దలు ఉన్నారని. ఇదంతా చెప్పింది దస్తగిరి అని రాశారు. 

కౌన్సిల్‌ ఎన్నికతో ముడి పెట్టారు..
అప్పుడు జరిగిన కౌన్సిల్‌ ఎన్నికలో వైయ‌స్ వివేకానందరెడ్డి ఓడిపోయాడు కాబట్టి, ఆ ఓటమిపై ఆయన కోపంగా ఉన్నాడని, శంకర్‌రెడ్డి తనను ఓడించాడని కోపంగా ఉండడంతో, కాబట్టి ఆయనను తప్పించాలని శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇచ్చాడని, ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పాడన్న దస్తగిరి.. తానే గొడ్డలి తీసుకుని నరికాడని క్లియర్‌గా చెప్పినా, ఆయనకు సీబీఐ ముందస్తు బెయిల్‌ ఇప్పించింది. అంటే సీబీఐ ఎలా పని చేస్తుందో అర్ధం అవుతుంది. అసలు వివేకానందరెడ్డిని నిలబెట్టిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిపించుకోవాలని చూస్తుందా? లేక ఓడిపోవాలని పని చేస్తుందా? నిజానికి పార్టీకి అక్కడ మంచి మెజారిటీ కూడా ఉంది. అలాంటప్పుడు వైయ‌స్ వివేకాను ఓడించడానికి శంకర్‌రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆనాడు బీటెక్‌ రవి ఎలా గెల్చాడు? వైయస్సార్‌సీపీ ఓట్లు ఎలా లాక్కున్నారు అన్నది ఇవాళ సీబీఐ చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కౌన్సిల్‌ ఎన్నిక 2017లో జరిగితే, వైయ‌స్ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. మరి రెండింటినీ ఎలా కలుపుతారు?

ఛార్జ్‌షీట్‌ షాకింగ్‌.. దురదృష్టకరం..
వైయ‌స్ వివేకానందరెడ్డిది దారుణహత్య. విషయం ముందు వారి కుటుంబానికి తెలిసింది. సమాచారం అందగానే వైయ‌స్ అవినాష్‌రెడ్డి పరుగెత్తుకుని వచ్చాడు. ఎర్ర గంగిరెడ్డి చంపించాడని, తానే చంపానని దస్తగిరి స్పష్టంగా చెబితే, అవన్నీ విడిచిపెట్టి, అసలు సంబంధం లేని వాళ్లను సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చడం షాకింగ్‌.. దురదృష్టకరం. హైకోర్టు ఏ ఉద్దేశంతో అయితే దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్సగించిందో, దానికి కూడా తూట్లు పొడిచారు. కేసు నిష్పాక్షిక దర్యాప్తు జరగలేదు. సీఎం వైయస్‌ జగన్‌ కూడా నిష్పాక్షిక ద‌ర్యాప్తు కోరుకున్నారు కాబట్టి, సీబీఐ దర్యాప్తును ఆమోదించారు. కానీ చివరకు హైకోర్టు ఉద్దేశాన్ని కూడా పట్టించుకోసి సీబీఐ చాలా దారుణంగా వ్యవహరించింది. కేసుతో సంబంధం లేని వారిని ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..
ఇవన్నీ చూస్తుంటే.. ఒక్కటే అనిపిస్తోంది. చంద్రబాబు లేదా ఆ ముఠా లక్ష్యానికి తగినట్లుగా దర్యాప్తు జరుగుతోంది. కాదంటారా?. అలా అయితే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
– హత్య విషయం ఎవరికి ముందు తెలిసింది? ఎవరు, ఎవరికి చెప్పారు?
– ఆ లేఖను అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు?
– ఘటనా స్థలానికి ముందు సీఐ వచ్చారు. నిజానికి సీఐని అక్కడికి పంపించింది వైయస్‌ అవినాష్‌రెడ్డి. నిజంగా ఆయన ఆ హత్య చేయించి ఉంటే, ఫోన్‌ చేసి సీఐని ఘటనా స్థలానికి పంపిస్తారా.?

ఇప్పుడు మరో వింత విమర్శ..
ఇవన్నీ ఇలా ఉంటే.. నిన్న మొన్న జైలర్‌ గురించి దుష్ప్రచారం. కడప జైలుకు బదిలీ అయి వచ్చిన జైలరు.. గతంలో ఒక జైలులో పని చేస్తున్నప్పుడు మొద్దుశీను హత్య జరిగిందని, ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. అంటే వైయ‌స్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను చంపడానికి ఆయనను కడప జైలుకు బదిలీ చేశారని పూర్తిగా దిగజారిన టీడీపీ, దారుణంగా విమర్శలు చేస్తోంది. పైగా సీబీఐకి లేఖ రాయడం. ఇదా రాజకీయం? ఇంతగా దిగజారాలా? దమ్ము, ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో పోరాడాలి. నిజంగా ఆ జైలర్‌ మొద్దుశీనును చంపించి ఉంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు.

ఛార్జ్‌షీట్‌ను ఎదుర్కొంటాం..
నిజానికి వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్య వల్ల నష్టపోయింది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. కానీ ఘటన దర్యాప్తును పూర్తిగా వక్రీకరించడం, జాతీయ స్థాయి దర్యాప్తు సంస్ఠ అయిన సీబీఐ ఇలా ఛార్జ్‌షీట్‌ రూపొందిస్తే, ఎలా స్పందించాలో కూడా అర్ధం కావడం లేదు. అయినా దీన్ని కచ్చితంగా సవాల్‌ చేస్తాం. ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొంటాం. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి, ఇవాళ మాట్లాడుతున్నాం.

వ్యవస్థల మేనేజ్‌మెంట్‌..
ఇంత సమన్వయంతో వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చూస్తుంటే, ఇంత పైశాచిక స్వభావం ఉన్న నాయకుల ముఠా, తెలుగుదేశం పార్టీని అర్ధం చేసుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు కేసును తొలుత దర్యాప్తు చేసిన పోలీసులు, ఆ తర్వాత సిట్, ఆ తర్వాత సీబీఐ.. ఈ క్రమం చూస్తుంటే, ఇప్పుడు సీబీఐ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ కేసును ఎలా పూర్తిగా పక్కదోవ పట్టించారన్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అన్యాయంగా ఒక యువ ఎంపీని కేసులో ఇరికిస్తున్నారు. కాబట్టి కచ్చితంగా అన్నీ ఎదుర్కొంటాం..`` అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

Back to Top