తిరువూరు కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసుల నిర్లక్ష్యం

న్యాయస్థానం ఆదేశించినా స్పందించని పోలీసులు

కూటమి పాలనలో వ్యవస్థల పట్ల ఏ మాత్రం గౌరవం లేదు

బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల కమిషన్‌కు మరోసారి వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు 

విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు హాజరయ్యేందుకు వెడుతున్న వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం మండిపడింది. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పండుల రవీంద్రబాబు, వ‌రుదు క‌ళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్య నాయకులు విజయవాడలో మరోసారి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి జరిగిన దౌర్జన్యంకు సంబంధించి ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు బేఖాతరు చేయని వైనంపై ఆధారాలతో సహా కమిషనర్‌కు వివరించారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించకపోగా, దాడికి పాల్పడిన కూటమి నేతలకు అండగా నిలుస్తూ, వైయస్ఆర్‌సీపీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేసిన వైనంను కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. అనంతరం విజయవాడలో మీడియాతో పార్టీ నేతలు మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే...

పోలీసులే చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు:  ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి

ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలిచ్చినా అవి క్షేత్ర‌స్థాయిలో అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. పోలీసులే ఎస్ఈసీ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమ‌ల‌వుతుందా అనే అనుమానం క‌లుగుతోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థ‌ల్లో వైయస్ఆర్‌సీపీకి పూర్తి బ‌లం ఉన్నా, అధికార బ‌లంతో అడ్డ‌దారిలో నెగ్గాల‌ని చూస్తున్నారు. తిరువూరు మున్సిపాలిటీ చైర్మ‌న్ ఎన్నిక విష‌యంలో టీడీపీ అనుస‌రిస్తున్న విధానాలు, పోలీసులు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డంపై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్నిని కలిసి వైయస్ఆర్‌సీపీ త‌ర‌ఫున ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆమె హామీ ఇచ్చారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉందని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు.  

రాష్ట్రాన్ని బీహార్‌లా మార్చేశారు:  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 

ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌న్న త‌లంపుతో ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను తుంగ‌లో తొక్కి అధికార టీడీపీ నాయ‌కులు అరాచ‌కాలు సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా రాజ్యాంగాన్ని, చ‌ట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ నాయ‌కుల‌కు వంత పాడుతున్నారు. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన కౌన్సిల‌ర్ల‌కు స్వేచ్ఛ‌గా ఓటేసుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చిందంటే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌తలు ఎంత‌గా దిగ‌జారిపోయాయో అర్థం చేసుకోవ‌చ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస్ రౌడీ మూక‌ల్ని వెంటేసుకొచ్చి 144 సెక్ష‌న్ ను ఉల్లంఘించి హంగామా చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి స‌హ‌క‌రించారు. ఎన్నిక సక్ర‌మంగా జ‌రిగేలా చూసుకోవాల్సిన పోలీసులే  మా కౌన్సిల‌ర్ల మెడ‌లో ఉన్న వైయస్ఆర్‌సీపీ కండువాల‌ను లాగి ప‌డేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ల‌డం చూసి ప్ర‌జ‌లంతా చీద‌రించుకుంటున్నారు. తిరువూరులో పోలీసులే ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కూట‌మి పాల‌న‌లో ఆంధ్ర రాష్ట్రం బీహార్ క‌న్నా దారుణంగా త‌యార‌వుతోంది. ఇలాంటి సంస్కృతి భావిత‌రాల‌కు మంచిది కాద‌ని గుర్తుంచుకోవాలి. అధికార పార్టీ అరాచ‌కాల‌ను ప్ర‌జాస్వామ్య వాదులంతా  ఖండించాలి.

కోర్టులు, ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలను పట్టించుకోరా? :  మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ప‌చ్చ చొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓటేసేందుకు వెడుతున్న కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన పోలీసులు, తిరువూరు వ‌స్తేనే భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని మాట‌మార్చారు. చ‌ట్ట‌ప‌రంగా న‌డుచుకోవాల్సిందిపోయి అధికార పార్టీ నాయ‌కుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌న్నా, కోర్టుల‌న్నా గౌర‌వం కానీ భ‌యం కానీ క‌నిపించ‌డం లేదు. నిన్న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఇచ్చిన ఆర్డ‌ర్‌ను పోలీసులు పాటించ‌డం లేద‌ని ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. పోలీసులు, క‌లెక్ట‌ర్‌తో మాట్లాడతాన‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంట‌ల‌కు తిరువూరులో ఎన్నిక‌కు హాజ‌రుకావాల్సి ఉంటే, విజ‌య‌వాడ నుంచి వ‌స్తున్న వైయస్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్ల‌ను మార్గమధ్యలో ఎందుకు ఆపేయాల్సి వ‌చ్చిందో పోలీసులే స‌మాధానం చెప్పాలి. మున్సిపాలిటీలో కేవ‌లం ముగ్గురు స‌భ్యుల బ‌లం మాత్ర‌మే ఉన్న టీడీపీ, చైర్మ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవ‌డానికి అడ్డ‌దారులు తొక్కింది. పోలీసుల అండ‌తో ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస్ గూండాలతో వ‌చ్చి మా కౌన్సిల‌ర్లపై దాడికి పాల్ప‌డ్డాడు. పోలీసులే బ‌ల‌వంతంగా న‌లుగురు వైయస్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్ల‌ను కిడ్నాప్ చేసి తీసుళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్పించారు. ఈరోజు కూడా అదే విధంగా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పోలీసులు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌ను సైతం ఉల్లంఘిస్తున్నారు. పోలీసుల వ్య‌వ‌హార‌శైలిపై ఈ రోజు ఉద‌యం వైయస్ఆర్‌సీపీ కోర్టును ఆశ్ర‌యించింది. కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశించినా పోలీసులు ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సాక్షాత్తు కోర్టు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ 30 నిమిషాల్లో పూర్తి వివ‌రాల‌తో రిపోర్టు ఇవ్వాల‌ని ఆదేశించింది. అధికారం చేతుల్లో ఉంది క‌దా అని దౌర్జ‌న్యం చేసి మున్సిప‌ల్ చైర్మ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తున్నారు. వీరి ఆట‌లు ఎంతోకాలం సాగ‌వు.  తిరువూరు మున్సిపాలిటీ హాల్ వ‌ర‌కు కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.
 

Back to Top