ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ 1426ను ఉపసంహరించుకోవాలి

నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి.

అగ్రీడ్ లిస్ట్' పేరుతో ఉద్యోగులపై నిఘా పెట్టడం నిరంకుశ చర్య:

ఉద్యోగులను భయపెట్టి చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే జీవో 1426: 

కూటమి ప్రభుత్వ నిరంకుశ జీవో పై ఉద్యోగ వర్గాల ఆగ్రహం

స్పష్టం చేసిన నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి.

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 1426 ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించి, 'అగ్రీడ్ లిస్ట్' పేరుతో వారిపై నిఘా పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.  ఉద్యోగులను ప్రభుత్వ తాబేదార్లుగా మార్చడానికే ఈ తరహా జీవో విడుదల చేసిందని ఆయన ఆక్షేపించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని ఇలాంటి  నిరంకుశ ఉత్తర్వులను ఉద్యోగ వర్గాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ఈ నల్ల జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే...

- ఉద్యోగులను చెప్పుచేతుల్లో పెట్టుకునే కుట్ర...

కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగం, అత్యంత కీలక పదవుల్లో ఉన్నవారి కోసం తీసుకొచ్చిన నిఘా విధానాలను కోట్ చేస్తూ జీవో నంబరు1426 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై వాటిని మోపడం విడ్డూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇతర దేశాలకు రహస్యాలు చేరవేసే సంస్థలు ఉన్నాయా? ప్రతి గెజిటెడ్ అధికారిని అనుమానాస్పద దృష్టితో చూస్తూ నిఘా ఉంచాలనుకోవడం ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనం. 'అగ్రీడ్ లిస్ట్' పేరుతో అధికారుల జాబితా తయారు చేసి వారిపై నిరంతరం నిఘా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
కూటమి ప్రభుత్వం తమకు కావాల్సిన శాఖల్లో అధికారులను భయపెట్టి తప్పుడు పనులు చేయిస్తోంది. బదిలీలు చేస్తారేమో, అక్రమ కేసుల్లో ఇరికిస్తారేమో అనే భయాన్ని సొమ్ము చేసుకుని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి సోషల్ మీడియా  కేసులు పెట్టిస్తూ అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు అన్ని శాఖల్లోనూ ఇదే రీతిలో బెదిరింపులకు పాల్పడటానికే ఈ జీవో 1426ను తీసుకువచ్చారు.

- అభద్రతా భావంలో ముఖ్యమంత్రి - ఉద్యోగులపై నిరంతర బ్లాక్‌మెయిలింగ్..

సీఎం చంద్రబాబుకి అభద్రతా భావం పెరిగిపోవడం వల్లే ఉద్యోగులను బ్లాక్‌మెయిల్ చేసే ఎత్తుగడలకు దిగుతున్నారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత జీవనశైలి, వారు కొనుగోలు చేసే వాహనాలపై కూడా నిఘా పెట్టి లగ్జరీ లైఫ్ జీవిస్తున్నారనే సాకుతో కేసులు పెడతామని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులు కష్టపడి పొదుపు చేసుకుని కొనుక్కుంటే అది తప్పు చేసినట్లేనా? ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్ శాఖలు ఉండగా, జీఏడీ  ఆధ్వర్యంలో ఇటువంటి నిఘా జాబితాలు తయారు చేయడం ముమ్మాటికీ అధికారులను లొంగదీసుకోవడానికే.

- సకల వ్యవస్థల ప్రైవేటీకరణ- లక్షలాది కుటుంబాలు రోడ్డుపాలు..

ఒకపక్క ఉద్యోగుల హక్కులను కాలరాస్తూనే, మరోపక్క రాష్ట్రంలో ప్రైవేటీకరణను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. గతంలో వైయస్.జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, నేటి ప్రభుత్వం మళ్లీ ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో 'సేవా కేంద్రాల' పేరుతో ప్రైవేటీకరణ తీసుకొచ్చి, దాదాపు లక్ష మంది డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని ఊడగొట్టి రోడ్డున పడేశారు.

- జీవోను రద్దు చేసేవరకు పోరాటం తప్పదు..

ప్రభుత్వ అక్రమాలకు, నిరంకుశ పాలనకు ఏ గెజిటెడ్ అధికారీ భయపడాల్సిన అవసరం లేదని, ఉద్యోగులకు ప్రవర్తనా నియమావళి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా  అవి చాలవన్నట్టు 'రెడ్ బుక్ రాజ్యాంగం' అమలు చేస్తూ ఉద్యోగ వర్గాన్ని భయపెట్టాలని చూస్తే తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీవో నంబర్ 1426ను ఉపసంహరించుకోవాలని నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top