అనంతపురం : కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులు పెద్ద ఎత్తున పంట నష్టపోయే పరిస్థితులు వస్తున్నాయని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏ సీజన్‌లో పంట నష్టపోతే అదే సీజన్‌లో ఆదుకున్నారని, కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. రైతాంగ సమస్యలపై సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మకు వైయస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి అనంత వెంకటరామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతివృష్టి, అనావృష్టి కారణంగా పెద్ద ఎత్తున జిల్లాలో రైతులు నష్టపోయారు. గత ఏడాది బీమా అందించలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో వర్షాలు కురవలేదు. జూన్, జూలై మాసాల్లో ఆశించిన వర్షాలు పడలేదు. రైతులు ఆశగా ఎదురుచూసినా ఫలితం లేకుండాపోయింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 8.50 లక్షల ఎకరాలు ఉంటే కేవలం 3.26 లక్షల మాత్రమే వివిధ పంటలు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 38 శాతం మాత్రమే సాగు చేస్తే అవి కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇప్పటికే కార్తెలన్నీ అయిపోయాయి. పల్లెల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో ఉద్యాన పంటలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి చోట్ల కూడా బోర్లలో నీరు లేవు. చెట్లు ఎండిపోతున్నా పట్టించుకునే నాథులు లేరు. కేవలం మాటలకే పరిమితం అవుతన్నారు. ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నారు. రైతులకు ధైర్యం చెప్పే పరిస్థితి లేదు ఎక్కడా కనిపించడం లేదు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ప్రజాప్రతినిధులు సమీక్ష చేసిన పాపాన పోలేదు. ఆలస్యంగా వర్షాలు పడినా..ఒక వేళ వర్షాలు పడకపోయినా ఏం చేయాలన్న ఆలోచన చేయకుండా అందరూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బోర్ల కింద, హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా కింద వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసుకుంటే యూరియా, డీఏపీ లభించడం లేదు. యూరియా కొరత లేదని ఓ వైపు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. ప్రైవేట్ వ్యాపారులు, అధికారులు కుమ్మక్కు కావడంతో యూరియా దొరడం లేదు. బస్తా యూరియాపై రూ.50 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు తుంగభద్ర డ్యాం పొంగిపొర్లుతోంది. శ్రీశైలం డ్యాం నుంచి నీరు సముద్రంలోకి వెళ్లిపోతోంది. నీరు పుష్కలం వస్తున్నాయని చెబుతున్నా ఇప్పటి వరకు హెచ్‌ఎల్ నార్త్, సౌత్ కెనాల్‌కు నీరు వదల్లేదు. ఆ నీరయినా వస్తే ఆయకట్టులో పంటలు సాగు చేయవచ్చు. భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయి. ఉద్యాన పంటలు కాపాడుకునే అవకాశం ఉంది. అయినా దీని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏడాది కాలంలో 250 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో 46 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇంత వరకు రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదు. రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వాటిని పరిష్కరించని పక్షంలో రైతులతో కలిసి పోరాటం చేస్తాం’’ అని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచి ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చూడాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వలసలు ప్రారంభం కాకుండా గ్రామాల్లోనే ఉపాధి పనులు కల్పించాలని కోరారు. గత ఏడాదికి సంబంధించి రైతు భరోసా (అన్నదాత సుఖీభవ) డబ్బుల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా ఇస్తానన్న రూ.20 వేలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన 7 లక్షల మంది రైతులకు వెంటనే పెట్టుబడి సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. చీనీ తోటలకు అనంతపురం జిల్లా ప్రసిది అని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 92 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు జరుగుతోందన్నారు. గతంలో టన్ను చీనీ రూ.40 వేలు పలుకుతుండగా ఇప్పుడు రూ.20 వేలకు మించడం లేదని పేర్కొన్నారు. చీనీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా ద్వారా నీటి విడుదల జరుగుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డ్ (ఐఏబీ) సమావేశం నిర్వహించి నీటి కేటాయింపులు చేయాలన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వలసలు ప్రారంభం కాకుండా స్థానికంగానే గ్రామాల్లో ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏరాశి నారాయణరెడ్డి, అనుబంధ విభాగాల జిల్లా ఇన్‌చార్జ్ ఉదయ్ కుమార్, రైతు విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేంద్రరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి భాస్కర్ రెడ్డి, వైయస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, బిసి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జానీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ నీలం భాస్కర్, గ్రీవెన్స్ సెల్ శింగనమల నియోజవర్గ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, వైయస్ఆర్‌సీపీ నాయకులు చెన్నంపల్లి వెంకటరెడ్డి, కొత్తపల్లి నాగలింగారెడ్డి, పురుషోత్తం, శ్రీనివాసులు, సుంకిరెడ్డి, నారాయణస్వామి, కసిరెడ్డి కేశవరెడ్డి, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.