ఎస్‌ఐఆర్‌ అనంతరం ఓటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

 జిల్లా కలెక్టర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్‌ అహమద్‌ విజ్ఞప్తి

మదనపల్లె: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ అనంతరం మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల్లో చోటుచేసుకున్న మార్పులపై వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్‌ అహమద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు పార్టీ తరఫున వినతిపత్రం సమర్పించారు. ఎస్‌ఐఆర్‌ అనంతరం పలు పోలింగ్‌ స్టేషన్లకు చెందిన ఓటర్లను ఇతర పోలింగ్‌ స్టేషన్లకు మార్చినట్లు గుర్తించామని నిసార్‌ అహమద్‌ తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులను సైతం వేర్వేరు పోలింగ్‌ స్టేషన్లకు మార్చడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మదనపల్లె పట్టణంలోని న్యూ పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ 183కు చెందిన పలువురు ఓటర్లను 184వ పోలింగ్‌ స్టేషన్‌కు మార్చిన అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభావిత ఓటర్లు సమర్పించిన వినతిపత్రాన్ని కూడా కలెక్టర్‌కు అందజేశారు.

ఫారం-8లో మార్పుకు ప్రత్యేక అవకాశం కల్పించాలి

ఒక పోలింగ్‌ స్టేషన్‌ నుంచి మరో పోలింగ్‌ స్టేషన్‌కు ఓటరును మార్చేందుకు ఫారం-8లో ప్రత్యేక ఆప్షన్‌ లేకపోవడాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు నిసార్‌ అహమద్‌ తెలిపారు. నిజమైన ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా తగిన పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని, దూర ప్రాంతాల్లో నివసించే ఓటర్లకు వెసులుబాటు కల్పించాలని కోరారు.
ఎస్‌ఐఆర్‌ అనంతరం దాదాపు 20 వేల మంది నోటీసులు అందుకున్న ఓటర్లను బూత్‌ లెవల్‌ అధికారులు భౌతికంగా హాజరు కావాలని కోరుతున్నారని తెలిపారు. దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి వ్యక్తిగతంగా హాజరు కావడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అనుమతించదగిన సందర్భాల్లో రక్త సంబంధీకులు లేదా అధీకృత ప్రతినిధుల ద్వారా తమ వాదన వినిపించే అవకాశం కల్పించాలని కోరారు.

వర్చువల్‌ విచారణకు అవకాశం ఇవ్వాలి

ప్రత్యామ్నాయంగా వర్చువల్‌ విధానంలో విచారణ లేదా వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాలని నిసార్‌ అహమద్‌ విజ్ఞప్తి చేశారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులను వేర్వేరు పోలింగ్‌ స్టేషన్లకు మార్చిన కేసులను ప్రత్యేకంగా పరిశీలించాలని, ప్రభావిత ఓటర్ల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు అనవసరమైన ఇబ్బందులు కలగకుండా బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. అర్హులైన ప్రతి ఓటరుకు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునే అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్.రెడ్డి, బూత్‌ కమిటీ అధ్యక్షులు ఎన్. నవాజ్‌ అలీ ఖాన్‌, చిప్పిలి మల్లికార్జునరెడ్డి, నాయకులు కొత్తపల్లి నాగార్జున నాయుడు, బయ్యా రెడ్డి, చెన్నకృష్ణ, మాలెపాడు చలపతి తదితరులు పాల్గొన్నారు.

Back to Top