ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో అఖండ విజ‌యం

భారీ మెజార్టీతో గెలుపొందిన వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి

82,888 ఓట్ల మెజార్టీతో వైయ‌స్ఆర్ సీపీ ఘ‌న విజ‌యం, డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ

నెల్లూరు: ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజ‌యాన్ని సాధించింది. దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి సోద‌రుడు, వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్ సీపీకి 1,02,240 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీ 19,352 ఓట్ల‌తో స‌రిపెట్టుకొని భంగ‌పాటుకు గురైంది. బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్ధి మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించారు. ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించిన విక్ర‌మ్‌రెడ్డికి పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు, ఆత్మ‌కూరులో విజ‌య సంబ‌రాలు అంబ‌రాన్నంటుతున్నాయి. 

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక కౌంటింగ్ మొద‌లైన మొద‌టి రౌండ్ నుంచి వైయ‌స్ఆర్ సీపీ జోరు కొన‌సాగుతూనే వ‌చ్చింది. మొత్తం 20 రౌండ్ల‌కు గానూ రౌండ్ రౌండ్‌కు మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి ఆధిక్యం పెరుగుతూనే వ‌చ్చింది. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లోనూ వైయ‌స్ఆర్ సీపీ ఆధిక్యం క‌న‌బ‌రిచింది. తిరుప‌తి, బ‌ద్వేలు, ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసిన బీజేపీ వ‌రుస ఓట‌ములు చ‌విచూసింది. ఫ్యాన్ జోరు ముందు డీలా ప‌డిపోయింది. 

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నాయ‌క‌త్వంపై అత్యంత న‌మ్మ‌కం, విశ్వాసంతో, దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి కుటుంబంపై ఉన్న ప్రేమతో ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్ సీపీకి భారీ మెజార్టీని క‌ట్ట‌బెట్టారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని మ‌రోసారి రుజువైంది. 

Back to Top