ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రక్షణ కరువైంది. ప్రధాన కూడళ్లలో ఉన్న మహానేత విగ్రహాలను తొలగించడమే పనిగా పెట్టుకున్న అధికార పార్టీ నేతలు తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో ఏర్పాటైన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి అక్రమంగా తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అనుచరులే ఈ పని చేసి ఉంటారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. గురువారం అర్ధరాత్రి అధికారులు కక్షపూరితంగా వైయస్ఆర్ విగ్రహాన్ని తొలగించి మునిసిపల్ కార్యాలయంలో ఉంచారని మండిపడ్డారు. విగ్రహాన్ని తొలగించిన స్థానంలోనే యథావిధిగా ఏర్పాటు చేయాలని దేవినేని అవినాష్, స్వామిదాస్ డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి తన సంక్షేమ పాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, మహానేతను గుర్తు చేసుకుంటూ ప్రతి ఊర్లోను ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రజల హృదయాల్లో కొలువుదీరిన వైయస్ఆర్‌ను తొలగించలేరని వైయస్ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.