న్యూఢిల్లీ: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారంటూ ఆ రెండు పత్రికలపై వైయస్ జగన్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు రాశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ పత్రికల్లో తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను తొలగించాలని కూడా వైయస్ జగన్ కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున ‘సెకీ’ (కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ)తో విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి వైయస్ జగన్ తరఫు న్యాయవాదులు ఇటీవల లీగల్ నోటీసులు జారీ చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఆ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దాన్ని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకు ఆ పత్రికలు స్పందించకపోవడంతో, వాటిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అలాగే, ఆ పత్రికల్లో తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలు కూడా తొలగించేలా ఆదేశించాలని కోరుతూ, వైయస్ జగన్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పైనా కోర్టు స్పందించింది. ఈ వ్యవహారం తర్వాత పిటిషనర్ వైయస్ జగన్‌పై రాసే కథనాలకు న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.