కడప కార్పొరేషన్‌ నేతలతో శ్రీ వైయస్‌ జగన్‌ భేటీ

కార్పొరేషన్‌ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం

నామినేషన్ల సందర్భంగా టీడీపీ దాడులు, బెదిరింపులపై ఆరా తీసిన మాజీ ముఖ్యమంత్రి

ప్రజాస్వామ్యంలో దాడులు, బెదిరింపులకు తావులేదు: వైయస్‌ జగన్‌

ఎన్ని దాడులు చేసినా ధైర్యంగా ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ శ్రేణులకు అభినందనలు

మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని పిలుపు

వైయ‌స్ఆర్ జిల్లా: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ పులివెందులలో కడప నగరపాలక సంస్థకు చెందిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. కడప కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల సన్నాహాలు, నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

నామినేషన్ల దాఖలు సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడులు, బెదిరింపులపై శ్రీ వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎదురైన ఆటంకాలు, పార్టీ అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులపై చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ, అధికార బలంతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పే అంతిమమని, దాడులు, బెదిరింపులతో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. నామినేషన్ల సందర్భంగా జరిగిన దాడులు, బెదిరింపులపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎన్ని దాడులు చేసినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడి ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలను శ్రీ వైయస్‌ జగన్‌ అభినందించారు. పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని సూచించారు.

కడప కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ నేతలంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేయాలని శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహణ అధికారులపై ఉందన్నారు.

ఈ సమావేశంలో కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్‌ యాదవ్‌, మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి, మాజీ మేయర్లు సురేష్‌బాబు, పాకా సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top