తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు

పులివెందల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి

వైయ‌స్ జగన్ పిలుపు

 పులివెందల:  ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. “తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు” అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వైయ‌స్‌ఆర్‌ జిల్లా పులివెందులలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్‌, జెడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థులతో సమావేశమైన ఆయన, ఎన్నికల్లో పోటీ చేసే హక్కును హరించే చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు.

 ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు పాలన

చంద్రబాబు పాలనలో శకుని మాయాపాచికలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైయ‌స్ జగన్ మండిపడ్డారు. గతంలో పోలింగ్‌ బూత్‌ల రిగ్గింగ్‌ గురించి విన్నామని, ఇప్పుడు నామినేషన్‌ కేంద్రాలనే ఆక్రమించి నామినేషన్ల రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులకు పోటీ చేసే అవకాశం ఇచ్చి ప్రజల ఓట్లతో గెలవడమే నిజమైన ప్రజాస్వామ్యమని, అభ్యర్థులను పోటీకి రానివ్వకుండా అడ్డుకుని విజయాలు సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటని స్పష్టం చేశారు. 17 పట్టణ స్థానిక సంస్థలు కూటమి ఖాతాలోకి వచ్చాయని, 2,108 వార్డుల్లో 21 శాతం ఏకగ్రీవాలు సాధించామని గొప్పలు చెప్పుకోవడం కాదని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయా లేదా అన్నదే ముఖ్యమని ప్రశ్నించారు.

పులివెందలలో అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం ఏది?

పులివెందలలో 40 వార్డులుండగా కేవలం 20 వార్డుల్లోనే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారని, ఏడు జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు చోట్ల మాత్రమే పోటీ చేసే పరిస్థితి కల్పించారని వైయ‌స్ జగన్ వివరించారు. నామినేషన్‌ పత్రాలను లాక్కోవడం, చించేయడం, పరిశీలన పేరుతో తిరస్కరించడం ద్వారా ప్రత్యర్థులను ఎన్నికల బరిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అక్టోబర్‌ 17న నామినేషన్లు వేయడానికి వెళ్లిన అభ్యర్థులను ఉదయం, మధ్యాహ్నం అంటూ పలుమార్లు అడ్డుకున్నారని, నామినేషన్లు వేసేందుకు అనుమతి కోరిన వారిపై లాఠీచార్జి చేశారని తెలిపారు.

నామినేషన్ల సందర్భంగా 37 రౌండ్ల కాల్పులు జరిపారని, ఇద్దరికి కాళ్లకు గాయాలయ్యాయని, 20 స్టన్‌ షెల్స్‌, 40 స్మోక్‌ షెల్స్‌, ఏడు హ్యాండ్‌ గ్రెనేడ్లు ఉపయోగించిన పరిస్థితి ఏర్పడిందని వైయ‌స్ జగన్ వెల్లడించారు. మరోవైపు 924 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారని పేర్కొంటూ, తమ పార్టీ కార్యకర్తలపై కాల్పులు జరిపి, తిరిగి వారిపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం ఎలాంటి న్యాయమని ప్రశ్నించారు. కడప జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాల్లో 17 స్థానాలకు పోటీ లేకుండా చేశారని, ఆరు చోట్ల నామినేషన్లు వేయనివ్వలేదని, మరో 11 చోట్ల పరిశీలన పేరుతో నామినేషన్లు తిరస్కరించారని తెలిపారు.

మహిళల హక్కులు, గౌరవాన్ని కాపాడాలి

50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులే ఎక్కువగా నష్టపోతున్నారని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. మహిళా అభ్యర్థులను చెక్‌పోస్టుల వద్ద అడ్డుకోవడం, దాడులు చేయడం, చీరలు లాగడం, నామినేషన్‌ పత్రాలను చించేయడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే మచ్చ అని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ పథకాలతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించామని, అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా పిల్లల చదువులకు తోడ్పడ్డామని గుర్తుచేశారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి, 21 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడంతో పాటు నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళల పురోగతికి బాటలు వేశామని వివరించారు.

హామీలు అమలు చేయలేకే ఎన్నికలకు భయం

సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీల పరిస్థితి ఏమైందని వైయ‌స్ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ ఇచ్చిన హామీల బాండ్లను చూపిస్తూ ప్రజలు నిలదీస్తున్నారని, 143 హామీలు ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి సమాధానం చెప్పే ధైర్యం లేకే ప్రత్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నించాల్సిన పత్రికలు, టెలివిజన్లు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాయని అన్నారు.

అధికారులకు రాజ్యాంగమే మార్గదర్శకం కావాలి

ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు, ఇతర అధికారులు ప్రేక్షక పాత్ర పోషించకూడదని వైయ‌స్ జగన్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. పోలీసులు చంద్రబాబు కోసం కాకుండా రాజ్యాంగం కోసం విధులు నిర్వహించాలని, తమ టోపీలపై ఉన్న మూడు సింహాలను, రాజ్యాంగానికి చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలను రక్షించాల్సిన అధికారులే దౌర్జన్యాలకు పాల్పడితే ప్రజలకు రక్షణ ఎవరిస్తారని నిలదీశారు.

“కార్యకర్తలపై పడే ప్రతి దెబ్బా నామీద వేసినట్టే”

అరెస్టులు, కేసులు, వేధింపులు వైయ‌స్ఆర్‌సీపీకి కొత్త కాదని, పార్టీ ప్రతిపక్షంలోనే పుట్టిందని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల మద్దతుతో ముందుకు సాగామని, కార్యకర్తల సంక్షేమం, వారి సమస్యలు తన సమస్యలేనని భరోసా ఇచ్చారు. “పులివెందలలో మా వాళ్లపై చేయి వేస్తే నాపై చేయి వేసినట్టే. అన్యాయం చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టం” అని స్పష్టం చేశారు. నాన్న వైయ‌స్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత కూడా పులివెందల ప్రజలు తన కుటుంబానికి అండగా నిలిచారని, వారి మద్దతుతోనే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని గుర్తుచేసుకున్నారు.

పులివెందల నుంచే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం

“తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు. పులివెందల నుంచి మొదలయ్యే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలి” అని వైయ‌స్ జగన్ పిలుపునిచ్చారు. మూడేళ్లు గడిచిపోయాయని, ఇక మిగిలింది రెండేళ్లేనని, ఆ తర్వాత వచ్చేది “జగన్‌ 2.0” అని పేర్కొన్నారు. “జగన్‌ ఒకటైతే కార్యకర్త రెండు” అంటూ కార్యకర్తల బలాన్ని చాటిచెప్పారు. ఓటింగ్‌కు ముందు రోజు పులివెందలకు వస్తానని, ఓటింగ్‌ రోజున తాను కూడా బూత్‌లోకి వెళ్లి ఓటు వేస్తానని తెలిపారు. ప్రజలే స్వేచ్ఛగా తమ తీర్పును వెలువరించేలా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ధైర్యంగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 

Back to Top