రాజమండ్రి రోడ్ల దుస్థితిపై మార్గాని భరత్ నిరసన

గీతా అప్సర థియేటర్‌ రోడ్డులో గోతిలోకి దిగి వినూత్న ఆందోళన

రెండు నెలలుగా ప్రజలకు తప్పని ఇబ్బందులు.. వెంటనే పైప్‌లైన్‌ పనులు పూర్తి చేసి తారు రోడ్డు వేయాలని డిమాండ్‌

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగరంలో పైప్‌లైన్‌ పనుల కోసం తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ డిమాండ్‌ చేశారు. చర్చి గేటు నుంచి గీతా అప్సర థియేటర్‌ వరకు పైప్‌లైన్‌ పనుల కోసం తవ్విన రోడ్డును మంగళవారం పరిశీలించిన ఆయన, గోతిలోకి దిగి నిరసన తెలిపారు. రెండు నెలలుగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

గోతుల్లో పడి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది?

పైప్‌లైన్‌ పనుల పేరుతో రోడ్లను తవ్వి వదిలేయడం వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని మార్గాని భరత్‌ అన్నారు. పెద్దపెద్ద గోతుల్లో పడి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ పనులు ఎందుకు పూర్తి కావడం లేదని నిలదీశారు. కాంట్రాక్టర్‌కు గడువు నిర్ణయించి పనులు పూర్తి చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.

తుఫాను వర్షాలతో ప్రమాదాల ముప్పు

తుఫాను ప్రభావంతో వర్షాలు కురిస్తే గోతుల్లో నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మార్గాని భరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పైప్‌లైన్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, గోతులను పూడ్చి వెంటనే తారు రోడ్డు వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు, వాహనదారులకు కలుగుతున్న అసౌకర్యాన్ని వెంటనే తొలగించాలని కలెక్టర్‌, కమిషనర్‌ స్పందించాలని కోరారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళనను ఉధృతం చేస్తుందని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసనలో వార్డు ఇన్‌చార్జి కాటం రజనీకాంత్‌, కాటం ప్రియాంక, అజ్జరపు వాసు, మజ్జి అప్పారావు, మార్తి లక్ష్మి, నిరీక్షణ జేమ్స్‌, యజ్జవరపు శ్రీనివాస్‌, షేక్‌ హసీనా, కృష్ణవేణి, పీతా రామకృష్ణ, కొల్లి నాని, మద్దు సతీష్‌, దూలం ప్రసాద్‌, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Back to Top