మచిలీపట్నం: రెండున్నరేళ్ల వెన్నుపోటు పాలన చూసిన తర్వాత కూడా కూటమి పార్టీలకు ప్రజలు ఓటు ఎందుకు వేయాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్‌లు సమాధానం చెప్పాలని కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. మచిలీపట్నంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన 143 హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు వివరించాలని నిలదీశారు. ఆడబిడ్డలకు నెలకు రూ. 1,500, 50 ఏళ్లు దాటిన బీసీ, మైనారిటీలకు రూ. 4,000 పెన్షన్, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా, అర్హులైన వారిలో ఏకంగా 7 లక్షల పెన్షన్లను పీకేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెట్రోల్, నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కూటమి నేతలు, ధరలు తగ్గించకపోగా రెండున్నరేళ్లలో భారీగా పెంచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేజీ బియ్యం రూ. 100, కందిపప్పు రూ. 190, చింతపండు రూ. 350కి చేరాయని, లీటర్ పెట్రోల్ ధర రూ. 117 దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీనాలీ చేసుకునే ప్రజలు బతకలేకపోతుంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాత్రం వారం వారం హైదరాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచలేదంటూ చంద్రబాబు లైవ్‌లో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రజలకు అబద్ధాలు చెప్పే చంద్రబాబు ఒక 'ఫేక్ సీఎం' అని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని "అలీబాబా ఇద్దరు దొంగల కూటమి"గా అభివర్ణించిన ఆయన, రెండున్నరేళ్ల విధ్వంసకర పాలన తర్వాత మళ్ళీ త్రిబుల్ ఇంజిన్ సర్కారు పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ బలహీనంగా ఉందంటూనే, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్లు అడ్డుకోవడం దేనికి అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టిన కూటమి ప్రభుత్వం, మండలాలు, జిల్లా పరిషత్‌లకు ఎందుకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టలేదని నిలదీశారు. కూటమి ఎమ్మెల్యేలలో ఒక్కరైనా నీతి నిజాయితీగా ఉన్నారా అని, అసలు వాళ్ళను చంద్రబాబు కంట్రోల్ చేయగలరా అని ప్రశ్నించారు. సీట్ల పంపకంలో జనసేన కార్యకర్తలే ప్రతిసారీ ఎందుకు త్యాగాలు చేయాలని పేర్ని నాని ప్రశ్నించారు. 'అర్నబ్ తుపాను' కారణంగా అభ్యర్థులను సరిగ్గా సెలెక్ట్ చేయలేకపోయానని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిన కూటమి: ఎన్నికలకు ముందు వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి, ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. విద్యుత్ ఛార్జీలు పెరగలేదని చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధం, ట్రూ డౌన్ తప్ప ట్రూ అప్ లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రెండున్నరేళ్ల పాలన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీలకు ప్రజలు మళ్లీ ఎందుకు ఓట్లు వేయాలి? నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే చంద్రబాబు ఫేక్ సీఎం అని విమర్శించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది అలీబాబా ఇద్దరు దొంగల ముఠా పాలన. ఈ రెండున్నరేళ్ల వెన్నుపోటు పాలన తర్వాత కూడా మళ్లీ ఎందుకు గెలిపించాలి? ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీల్లో ఒక్కటైనా నిజాయితీగా అమలు చేశారా? ఆడబిడ్డలకు నెలకు రూ.1,500, 50 ఏళ్లు దాటిన బీసీ, మైనారిటీలకు నెలకు రూ.4,000 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి? మత్స్యకారులకు ఇచ్చిన హామీలు ఎక్కడ, నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా? కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఏడు లక్షల పింఛన్లు తొలగించారు. రెండున్నరేళ్లలో సుమారు రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇచ్చామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. హామీలు అమలు చేయకుండా ప్రజలకే విచక్షణ లేదని లోకేష్ మాట్లాడటం దారుణం. ప్రజలకు ఇచ్చిన మాటపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ సమాధానం చెప్పాలి. పంచాయతీలకు నిధులేవి? చెత్త నిర్వహణలోనూ దోపిడీ: పల్లెల అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం, ఆ నిధులతో ఏ గ్రామంలో ఏ అభివృద్ధి పని చేసిందో చూపించాలి. కనీసం ఆగస్టు 15న జెండా ఎగరేయడానికి కూడా పంచాయతీలకు నిధులు ఇచ్చారా, సర్పంచులు అభివృద్ధి పనులు చేయడానికి నిధులు అందించారా? 15వ ఆర్థిక సంఘం నిధులు ఎందుకు విడుదల చేయలేదు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు రావాల్సిన వాటా జమ చేయలేదు. కోర్టులకు వెళ్తే తప్ప నిధులు విదిలించని దుస్థితి వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు సర్పంచులు ఆ శాఖ మంత్రి ఓఎస్డీ చెప్పినట్లే నడుచుకోవాలా? గ్రామాలకు నిధులు ఇవ్వకుండా పల్లెలను ఎలా అభివృద్ధి చేస్తారు? చెత్త నిర్వహణ, చెత్త పన్ను, ఇంటి పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపుతూ, చెత్తలో కూడా దోపిడీ చేస్తున్న చెత్త ప్రభుత్వం కాదా ఇది? క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో బోషడీకే పట్టాభి దోపిడీ చేస్తున్నాడనే నా విమర్శకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిధుల వినియోగం, ఒప్పందాలు, కాంట్రాక్టులపై పూర్తి లెక్కలు బయటపెట్టాలి. ప్రభుత్వం మారిన తర్వాత చెత్త నిర్వహణ సహా ప్రజాధనం ఖర్చు చేసిన ప్రతి అంశంపై లెక్కలు తేలుస్తాం. ప్రజల డబ్బు ఎక్కడ ఖర్చు చేశారో, గ్రామాలకు ఎంత మేలు జరిగిందో కూటమి ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలి. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు ఎందుకు లేవు? : మున్సిపాలిటీలకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టిన కూటమి ప్రభుత్వం మండల పరిషత్‌లకు, జిల్లా పరిషత్‌లకు ఎందుకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టలేదు? ఏ ఊరిలోనైనా నీతి, నిజాయితీకి పెద్దపీట వేశారా? కూటమి ఎమ్మెల్యేలలో ఒక్కరైనా నీతి నిజాయితీగా ఉన్నారా, అసలు ఈ ఎమ్మెల్యేలను చంద్రబాబు కంట్రోల్ చేయగలుగుతున్నారా? జనసేనలో సీట్ల పంపకంలో ప్రతిసారీ కార్యకర్తలే ఎందుకు త్యాగాలు చేయాలి? అర్నబ్ తుపాను కారణంగా అభ్యర్థులను సరిగ్గా ఎంపిక చేయలేకపోయానని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా సరిగ్గా చేయలేకపోతే పార్టీని, కార్యకర్తలను ఎలా నడిపిస్తారు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య చికిత్సల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లడం, దేశ ప్రధాని అక్కడికి వెళ్లి పరామర్శించాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాల పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వైఎస్సార్‌సీపీ అంటే అంత భయమెందుకు?: వైఎస్సార్‌సీపీ బలహీనంగా ఉందని ఒకవైపు చెబుతున్న కూటమి నాయకులు, మరోవైపు మా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారు? వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంటే అంత భయమెందుకు, బెదిరింపులు ఎందుకు, దౌర్జన్యాలు ఎందుకు? ప్రతి అభ్యర్థికీ పోటీ చేసే హక్కు ఉంది, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి. నామినేషన్ల ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ప్రతి ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ తమ పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన హామీలు, ఖర్చు చేసిన నిధులపై ప్రజలకు పూర్తి లెక్కలు చెప్పాలి. ప్రజలపై ధరల భారం మోపి, సంక్షేమ హామీలు అమలు చేయకుండా, పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా పాలన అద్భుతంగా సాగుతోందని చెప్పడం ఎంతవరకు సమంజసం? అలీబాబా ఇద్దరు దొంగల ముఠా రాష్ట్రాన్ని ఎలా దోచుకుంటుందో ప్రజలు తమ విజ్ఞతతో ఆలోచించాలని మాజీ మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.