పులివెందుల: రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కౌరవుల కుట్రలు కనిపిస్తున్నాయని, శకునిలా చంద్రబాబు మాయ పాచికలు స్పష్టంగా కనబడుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే దాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ఫైర్ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో అంతులేని అక్రమాలు. దౌర్జన్యాలు ఏకంగా నామినేషన్ల పర్వంలోనే చంద్రబాబు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని, యథేచ్ఛగా నామినేషన్ కేంద్రాలు ఆక్రమిస్తూ, వైయస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వడం లేదని, అభ్యర్థుల చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేస్తున్నారని, చివరకు ఆర్‌ఓ చేతుల్లోని పత్రాలు కూడా లాక్కుంటున్నారని, అయినా వారు ఎక్కడా ఫిర్యాదు చేయడం లేదని వెల్లడించారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా, వారు ఊర్కే చూస్తున్నారని, మరోవైపు ఇన్ని జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) అస్సలు పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఇప్పుడు అన్యాయంగా తమ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్నారని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. ఇప్పుడు వారిపై పడుతున్న ప్రతి దెబ్బ తనపైనే పడుతోందన్న ఆయన, భవిష్యత్తులో తమ టైమ్ వచ్చినప్పుడు వడ్డీతో సహా, బదులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు తప్పు చేస్తున్న ఎవ్వరినీ విడిచిపెట్టబోమని, వారు ఎక్కడున్నా, చివరకు రిటైర్ అయినా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని, చేసిన తప్పుకు వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. పులివెందుల ఎన్నికల రోజు తాను వస్తానన్న శ్రీ వైయస్ జగన్, వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే, అక్రమాలు చేసి చూపాలని సవాల్ చేశారు. పులివెందులలోని భాకరాపేట క్యాంప్ కార్యాలయంలో పులివెందుల నియోజకవర్గ స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్న వైయస్సార్‌సీపీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న శ్రీ వైయస్ జగన్, వారందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు. ఈ సమావేశంలో శ్రీ వైయస్ జగన్ ఇంకా ఏమేం మాట్లాడారంటే..: శకుని పాచికల్లా చంద్రబాబు రాజకీయం: రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో దెబ్బలు తగిలిన వాళ్లు, కష్టాలు అనుభవించిన వాళ్లు, అన్నీ ధైర్యంగా నిలబడ్డ నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గం, మున్సిపాలిటీకి సంబంధించిన అందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మనస్ఫూర్తిగా మీ జగన్, రెండు చేతులు జోడించి, పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. నిజంగా ఈరోజు ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తుంటే, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలన్నీ కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడుగారిని ఒకసారి ఒకవైపున చూసినప్పుడు, రెండో వైపున మహాభారతంలో శకుని క్యారెక్టర్ ఉంటుంది. రెండు క్యారెక్టర్లను పక్కన పక్కన పెడితే, రెండు ఒకటిగానే కనిపిస్తాయి. నిజంగానే ఆరోజు ఏ రకంగా అయితే శకుడు మాయా పాచికలు వేసి, తనకు అనుకూలంగా జూదాన్ని మల్చుకున్నాడో, సరిగ్గా ఈరోజు చంద్రబాబునాయుడుగారు అదే పని చేస్తున్నారు. ఆరోజు శకుడి మాయ పాచికల మాదిరిగా, ఈరోజు చంద్రబాబు తన అధికారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారు. ఆరోజు ఆ సభలో పక్కనే ఉన్న వాళ్లందరూ అలా చూస్తూ ఉండిపోయి, శకుడికి, దుర్యోధనుడికి సహకరించినట్లే, ఈరోజు చూస్తుంటే అదే కనిపిస్తోంది. శకుని మాయ పాచికల మాదిరిగా, చంద్రబాబు తన «అధికారాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుని ఈ ఎన్నికలు నడిపిస్తున్నాడు. రెఫరీగా ఉండాల్సిన వారంతా చూసి చూడనట్లుగా ఉండిపోతున్నారు. ఇక్కడ ఎస్‌ఈసీ ఉంది. కానీ ఏమీ చేయదు. పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్లూ ఏమీ చేయరు. మిగిలిన అధికారులు ఉన్నారు. వాళ్లూ అంతే ఏ మాత్రం స్పందించరు. అలా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిన పరిస్థితి. అలా వ్యవస్థలన్నీ కూడా తానా తందానా అంటూ చంద్రబాబునాయుడుగారికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే..: నిజంగా ఇవన్నీ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన పరిస్థితుల్లో, అవసరమైన స్థానంలో ఉన్న వ్యక్తులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితి చూసినప్పుడు, నిజంగా బాధ అనిపిస్తుంది. భావి తరాలకు మనం ఎలాంటి లీడర్లను ఇవ్వబోతున్నాం. భావి తరాలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాం అన్నది ఈరోజు చంద్రబాబునాయుడుగారి పాపంలో భాగస్తులు అయిన ప్రతి అధికారి, ప్రతి పోలీసు, ఎస్‌ఈసీ, ప్రతి వ్యవస్థ ఆలోచించాలి. నామినేషన్ల పర్వంలోనే రిగ్గింగ్: గతంలో మనం పోలింగ్ బూత్‌ల స్వాధీనం. రిగ్గింగ్ చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా నామినేషన్ల పర్వంలోనే రిగ్గింగ్ చూస్తున్నాం. ఇలా ఇంతవరకు బహుషా దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. నామినేషన్ సెంటర్లను ఆక్రమించుకోవడం అన్నది ఇంతవరకు దేశంలోనే ఎక్కడా చూసి ఉండం. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో చంద్రబాబునాయుడుగారు సీఎంగా ఉండగా, ఆ పరిస్థితి చూస్తున్నాం. ప్రజాస్వామ్యం ఎంత దరిద్రంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనాలు ఇవి. పోటీయే లేకుండా గెల్చామంటూ సంబరాలు: మామూలుగా ఎక్కడ పోటీ జరిగినా, అందరూ పాల్గొంటారు. అలా అందరూ పార్టిసిపేట్ చేసిన తర్వాత, నేను గెలిచాను అని చెప్పి, గర్వంగా కాలర్ ఎగిరేసుకొని చెప్పుకునే పరిస్థితి చూస్తాం. కానీ ఇవాళ ఏం చూస్తున్నాం అంటే.. పోటీలో మిగిలిన ప్లేయర్లను ఎవ్వరిని రానివ్వకుండా, వారికి ఆడే అవకాశం కూడా ఇవ్వకుండా, వారిని తప్పించి ఆ తర్వాత మేమే గెలిచాము అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను బహుషా ఎక్కడా చూసి ఉండం. పోటీ అంటే నువ్వు తలపడు. నేను తలపడుతా. ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికే వేస్తారు. ప్రజలు ఒకవేళ నీకు ఓటు వేస్తే నువ్వు సంతోషపడు. ప్రజలు ఒకవేళ నాకు ఓటు వేస్తే, నేను సంతోషపడతా. దాన్ని పోటీ అంటారు. సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఉన్నాయా?: కానీ ఇవాళ అసలు పోటీ అనేది ఉండదు. అటువైపున పోటీ పడే మనిషి ఉండకూడదు. అలాంటి పోటీ లేకుండా గెలిచి, గెలిచాము అని చెప్పి, ఆ రౌడీజాన్ని, ఆ దౌర్జన్యాన్ని ఈ మాదిరిగా బ్యానర్లుగా రాస్తున్నారు. ‘17 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం కూటమి ఖాతాల్లోకి’ అని రాశారు. ఈ మాదిరిగా వాళ్ల పేపర్లలో వాళ్లు గొప్పగా ఏదో చేసినట్టుగా, ఈ మాదిరిగా రాసుకుంటారు. ఇంకా ఏమని రాస్తారు? ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 15, జసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి. అన్నీ ఏకగ్రీవం అట. మొత్తం వార్డుల్లో 21.08 శాతం, డివిజన్లలో 12.58 శాతం ఏకగ్రీవం అంట. జగన్ సొంత జిల్లాలో కూటమి ఖాతాల్లోకి ఆరు పురపాలక సంఘాలు అట. నగర పంచాయతీలు అట. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అడ్డాలో తెలుగుదేశం జెండా అట. ఇది ఈనాడు. వాళ్ల కరపత్రం. నేను అడుగుతున్నాను. సిగ్గు, బుద్ధి. జ్ఞానం. ఇవి ఉన్నవాళ్లు ఎవరైనా కూడా ఈ మాదిరిగా ఎన్నికలు జరిపించి, ఈ ఎన్నికల్లో మేము గెలిచాము అని చెప్పి, ఎవరైనా కూడా చంకలు గుద్దుకుంటున్నారు అని అంటే, వాళ్లకన్నా తెలివి లేనోళ్లు ఎవరైనా ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతున్నాను. అసలు మీకు ఎన్నికలంటే ఎందుకు భయం?: ఇదే చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నాను. ఆయనకు వత్తాసు పలుకుతున్న ఇలాంటి దిక్కుమాలిన పేపర్లు, దిక్కుమాలిన టీవీలు, ఇలాంటి వాళ్లందరిని కూడా అడుగుతున్నాను. ఎందుకయ్యా మీరు ఎన్నికల్లో పోటీ పెట్టించడానికి భయపడుతున్నారు. అందుకు కారణం ఒక్కటే. సూపర్ సిక్స్‌లు లేవు, సూపర్ సెవెన్‌లు లేవు. ఇంకా గత ఎన్నికలప్పుడు ఇంటింటికి పంచిన బాండ్లు. వాటిని ఎవరూ మర్చిపోలేదు. ప్రజలంతా ఆ బాండ్లు చూపించి తెలుగుదేశం పార్టీని నిలదీసే పరిస్థితి వచ్చింది. అదే ప్రతి ఇంట్లో జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి చెప్పి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని చెప్పి, ప్రతి ఇంటికి బాండ్లు పంచి, ఏకంగా 143 హామీలు ఇచ్చి, దాదాపు మూడేళ్లు అవుతున్నా కూడా ఆ హామీలన్నీ పక్కన పెట్టి, వాటిని బోడి సున్నా చేశారు. అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లే ముఖం లేక, ఎన్నికల్లో పోటీకి నిలబడే ధైర్యం లేక, ఈరోజు శకుని పాచికల మాదిరి మాయా పాచికలతో శకుని పాత్రలో చంద్రబాబునాయుడుగారు రాజకీయం చేస్తున్నారు. అక్కచెల్లెమ్మలను అడ్డుకోవడం దారుణం: నేను అడుగుతున్నాను. ఇదే చంద్రబాబునాయుడుగారిని, ఇదే ఈ దౌర్భాగ్యపు పేపర్లు, టీవీ ఛానళ్లు నడుపుతున్న వారిని కూడా అడుగుతున్నా. మీ వల్ల అందరికన్నా నష్టపోయింది ఎవరో తెలుసా? 50 శాతం రిజర్వేషన్ ప్రకారం, ఈ ఎన్నికల్లో సగానికి పైగా సీట్లు పోటీ చేసేది నా అక్కచెల్లెమ్మలే. నిజంగా ఈరోజు ఎన్నికల్లో 50 శాతం సీట్లలో పోటీ చేస్తోంది నా అక్కచెల్లెమ్మలు. అలాంటి అక్కచెల్లెమ్మలను గౌరవించాల్సిన చోట, అలాంటి అక్కచెల్లెమ్మలు నామినేషన్ వేయడానికి వస్తున్నారంటే సంతోషించాలి. నిజంగా అక్కచెల్లెమ్మల అభ్యున్నతికి, రాజకీయ పురోగతికి ఆర్థికంగా, సామాజికంగా వారు ఎదుగుతున్నారని చెప్పి సంతోషపడి వారికి అండగా, తోడుగా నిలబడాల్సిన పరిస్థితి. కానీ, అందుకు భిన్నంగా ఆ అక్కచెల్లెమ్మలను నడి రోడ్డు మీద అడ్డుకుంటున్నారు. చెక్ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ చెక్ పోస్ట్ దాటి దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్‌వో కేంద్రానికి వారు రావాల్సి వస్తోంది. అయితే అప్పటికే ఆ కేంద్రాన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ గుండాలు ఆక్రమిస్తున్నారు. దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న చెక్‌పోస్టు నుంచి అక్కచెల్లెమ్మలు నడుచుకుంటూ ఆర్‌ఓ కేంద్రానికి వస్తున్నారు. అభ్యర్థినితో పాటు, కేవలం ముగ్గురిని మాత్రమే అందుకు అనుమతిస్తున్నారు. దీంతో మధ్యలో దాదాపు నాలుగు చోట్ల తెలుగుదేశం పార్టీలు గుండాలు నా అక్కచెల్లెమ్మల మీద దాడులు చేయడం, చీరలు లాగడం, అగౌరవంగా వ్యవహరించడం, చివరికి ఆ నామినేషన్ పత్రాలను చించేయడం చేస్తున్నారు. అసలు ఇవన్నీ జరుగుతుంటే నీకు సిగ్గుందా చంద్రబాబు అని అడుగుతున్నాను. మా ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మలు ఎలా ఉన్నారంటే..: అదే మన ప్రభుత్వ హయాంలో నా అక్కచెల్లెమ్మలను ఎంతగా చూసుకున్నాము అని అంటే, నా అక్కచెల్లెమ్మల ముఖాన చిరునవ్వు ఉండాలని, నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే, ఆ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి, అక్కచెల్లెమ్మల కోసం తపన తాపత్రయ పడ్డ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా. ఒక చేయుత, ఒక ఓబీసీ నేస్తం. ఓ కాపు నేస్తం. ఇంకా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం సున్నా వడ్డీ. ఇంకా ఆ అక్కచెల్లెమ్మల పిల్లలైన నా మేనళ్లుల కోసం, నా మేనకోడళ్ళ కోసం ఓ అమ్మవడి, ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన. అన్ని నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండాలి అని చెప్పి, దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా, ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇల్లు నా అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, కట్టించి ఇచ్చే బృహత్తర కార్యక్రమం కూడా జరిగింది. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ అని చెప్పి కూడా గర్వంగా చెబుతాము. నా అక్కచెల్లెమ్మల చేయి పట్టుకొని నడిపించడమే కాకుండా, వారు ఆర్థికంగానే కాకుండా, రాజకీయంగా, సామాజికంగా కూడా ఎదగాలి అని చెప్పి, ఏకంగా 50% రిజర్వేషన్స్ నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్టుల్లోనూ ఇస్తూ చట్టం చేసి మరీ అమలు చేశాం. అలా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నది ఒక్క మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే. సిగ్గుతో చంద్రబాబు తల దించుకోవాలి: అలాంటి అక్కచెల్లెమ్మల గౌరవాన్ని ఈరోజు నిర్దాక్షిణ్యంగా మంట గలుపుతున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబునాయుడుగారు. 80 ఏళ్ల వయసు వచ్చింది. ఈ వయసులో చేస్తున్న ఇలాంటి దౌర్భాగ్యకరమైన పనులకు సిగ్గుతో తల దించుకోవాలని చంద్రబాబునాయుడుగారికి గట్టిగా చెబుతున్నాను. నిజంగా ఎన్నికలు అనేవి పోటీతో జరిగితే ఎవరు ప్రజలకు మంచి చేశారు? ఎవరు ప్రజలకు చెడు చేశారు? ఎవరు ప్రజల ఆశీర్వాదంతో ముందుకొచ్చారు? ఎవరు ప్రజల ఆశీర్వాదాలతో గెల్చారనేది తెలుస్తుంది. అప్పుడు ఆ గెలుపునకు ఒక సంతోషం అనేది ఉంటుంది. కానీ, ఈరోజు అవేవీ జరగడం లేదు. ఎన్నికల్లో అసలు పోటీ అనేది లేకుండా చేస్తున్నారు. పులివెందులలో మరీ దారుణం: ఇక పులివెందలో జరిగిన ఈ ఘటనలు విన్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. 40 వార్డులున్న పులివెందలలో కేవలం 20 వార్డులోల మాత్రమే నామినేషన్లు వేయనిచ్చారు. మిగిలిన 20 వార్డుల్లో నామినేషన్లు వేయనివ్వలేదు. అంటే, మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అని చెప్పి ఈ పాలకులంతా సిగ్గుతో తల దించుకోవాలి. ఇంకా ఇదే నియోజకవర్గంలో ఏడు జెడ్పిటీసి స్థానాలకు కేవలం నాలుగింటిలో మాత్రమే ఈరోజు పోటీ జరుగుతోంది. ఒక స్థానంలో దగ్గరుండి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ క్యాండిడేట్ భార్య దగ్గరుండి నామినేషన్ చింపేస్తుంది. అభ్యర్థుల చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేస్తున్నారు. ఇక రెండోది నామినేషన్ పత్రాల తిరస్కరణ. స్క్రుటినీ పేరిట రెండు నామినేషన్లు, రెండు మండలాలకు సంబంధించిన నామినేషన్లు రిజెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులే స్వయంగా అడ్డుకోవడం!: మరోవైపు పోలీసులే స్వయంగా అడ్డుకోవడం. అక్టోబరు 17న, మన కౌన్సిలర్లు నామినేషన్ వేయడానికి అక్కడికి వెళ్తే, పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది కాబట్టి, మధ్యాహ్నం రావాలని పోలీçసులు తిప్పి పంపించారు. సరే, మధ్యాహ్నం దాకా వేచి చూసి, 1 గం.కు నామినేషన్లు వేయడానికి మన పార్టీ అభ్యర్థులు ముందుకు అడుగులు వేస్తే, అప్పుడు ఇదే పోలీసులు మళ్ళీ అడ్డుకోవడం అన్నది నేను ఎప్పుడూ చూడలే. ఇదే పోలీసులు మళ్ళీ అడ్డుకోవడమే కాకుండా, పోవడానికి వీలు లేదు, నామినేషన్లు వేయడానికి వీలు లేదు అని చెప్పి హుకుం జారీ చేశారు. దీంతో ఎంపీ అవినాష్‌తో పాటు, దుష్యంత్ ఏం చెప్పారంటే.. ‘అయ్యా మేము ఇక్కడే ఉంటాం. మేము రాము. మా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులంతా మూడు వాహనాల్లో ఎక్కుతారు. అప్పుడు మీరే స్వయంగా వారిని తీసుకుపోయి, మీరే దగ్గరుండి నామినేషన్లు వేయించండి’ అని విజ్ఞప్తి చేశారు. అయితే దానికి కూడా పోలీసులు ససేమీరా అనడంతో, మా పార్టీ నాయకులు ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. దీంతో మానవత్వం అన్నది పూర్తిగా మర్చిపోయిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అంతే కాకుండా ఏకే–47 తో ఏకంగా 37 రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో ఇద్దరి కాళ్లు, తొడల్లోకి గుండ్లు దూసుకుపోయాయి. నిజంగా ఇలాంటి ఘటనలు నాడు స్వాతంత్య్ర పోరాట సమయంలోనే విన్నాం. ఇక్కడ పులివెందులలో పోలీసుల కేవలం కాల్పులతోనే ఆగిపోలేదు. 20 స్టన్ షెల్స్, 40 స్మోక్ షెల్స్ కూడా ప్రయోగించారు. ఇంకా ఏడు హ్యాండ్ గ్రెనైడ్స్ కూడా ఉపయోగించారు. నేను అడుగుతున్నాను. అసలు మా పార్టీ అభ్యర్థులు చేసిన తప్పేమిటి? అంతæ బల ప్రయోగం ఎందుకు చేశారు? కేవలం నామినేషన్లు వేయడానికి రావడమే మా అభ్యర్థులు చేసిన తప్పా? అని ఇదే చంద్రబాబునాయుడుగారిని గట్టిగా నిలదీస్తున్నా. వారిని కాల్పులతో అడ్డుకున్న ఇదే పోలీసులను అడుగుతున్నాను. మరి ఎన్నికలు ఎందుకు పెట్టారు?: 924 మందిపై హత్యాయత్నం కేసులా!: ఎన్నికల్లో పోటీ చేయడానికే ఇంతగా భయపడుతున్నప్పుడు మీరు అసలు ఎన్నికలు ఎందుకు పెట్టారు?. అన్ని నామినేషన్ పద్ధతిలో మీరే నింపుకోవచ్చు కదా. ఎన్నికలను నామినేషన్ పద్దతిలోకి తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క చంద్రబాబునాయుడుగారిది. అందుకు ఆయన సిగ్గు పడాల్సిన పరిస్థితి. పులివెందులలో దౌర్జన్యాలు ఇంకా అక్కడితో ఆగిపోలేదు. ఆ ఘటనల్లో బాధితులైన వారిలో 924 మంది మీద ఏకంగా హత్యాయత్నం సెక్షన్–307 కింద కేసు నమోదు చేశారు. అంటే పోలీసులను చంపడానికి మనం ప్రయత్నించామట!. అదే మీ అసలు కుట్ర: తొండి. దౌర్జన్యం. అన్యాయం: నిజానికి మమ్మల్ని చంపడానికి నువ్వు తుపాకులు కాల్చావు. అందులో ఏకంగా 37 రౌండ్లు కాల్చారు. ఇంకా నువ్వే బాంబులు విసిరావు. దాంతో మా వాళ్ళకి గాయాలయ్యాయి. అన్ని పనులు చేసిన మీరు, తిరిగి మా వాళ్లు 924 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టడం అత్యంత హేయం. నిజం చెప్పాలంటే వారంతా ఈ ఎన్నికల్లో కనిపించకుండా ఉండడమే మీ లక్ష్యం. అదే మీ కుట్ర. అందుకే అంత దారుణంగా కేసులు పెట్టారు. తొండి తొండి.. అని ఎప్పుడైనా మనం వింటా ఉంటాం. చిన్న పిల్లలు ఏదైనా ఆడుకుంటున్నప్పుడు అలా అంటుంటారు. మరి ఇది కూడా తొండి కాకపోతే మరేమిటి? తొండి. దౌర్జన్యం, అన్యాయం. నిజంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చంద్రబాబులో మార్పు రాలేదు. ఎస్‌ఈసీలో మార్పు రాలేదు. కలెక్టర్లలో మార్పు రాలేదు. మరి ఇలాంటి అధికారులు ఇలాగే కొనసాగుతుంటే, ఎన్నికలు సజావుగా జరుగుతాయా? ఈ విషయాన్ని చంద్రబాబుగారు మనస్సాక్షి మీద చెయ్యి వేసుకొని చెప్పాలి. నీవు ఎన్నికలు నిర్వహిస్తున్నావా? లేక నామినేషన్ పద్ధతిలో ఎన్నికలకు పోతున్నావా? చెప్పమని చంద్రబాబునాయుడుగారిని గట్టిగా నిలదీస్తున్నా. కడపలో పరిస్థితి చూస్తే..: ఇక కడపలో కూడా అంతే. కడపలో పరిస్థితి చూస్తే ఎలా ఉంది అని అంటే, జిల్లాలో 39 మంది జెడ్పిటీసీలు పోటీ చేయాల్సి ఉంటే, వాటిలో ఏకంగా 17 చోట్ల పోటీ లేకుండా చేశారు. 6 చోట్ల నామినేషన్లు వేయనివ్వలేదు. మరో 11 చోట్ల, అర్ధరాత్రి దాటాక స్క్రుటినీ పేరుతో నామినేషన్లు తిరస్కరించారు. అలా 39 చోట్లలో 17 చోట్ల అసలు ఎన్నిక లేకుండా, పోటీ లేకుండా చేసి, కడప జెడ్పిటీసి స్థానాన్ని గెల్చుకున్నామని రేపు చెప్పుకుంటారు. అందుకు మీకు సిగ్గు ఉండాలి. రేపు ఆస్తులు లాగేసుకుంటారు: ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పార్టీ నాయకుడు చేస్తున్న రాజకీయాలు ఎలా ఉన్నాయని చూస్తే.. ఈరోజు నామినేషన్స్ వేయనియకుండా మన పత్రాలను చింపేశారు. అలా మన హక్కులు లాగేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే, అధికారుల సమక్షంలోనే ఈరోజు నామినేషన్లు వేయకుండా, వేయనివ్వకుండా మన పత్రాలను చింపేశారు. మరి రేపు పొద్దున జరగబోయేది ఏమిటో తెలుసా? దీన్ని ఇలాగే చూస్తూ ఊరుకుంటూ వెళ్తే, రేపు పొద్దున మీ ఆస్తి పత్రాలను ఇదే మాదిరిగా వీళ్ళే లాక్కుంటారు. వీళ్ళే ఆ పత్రాలను చింపేస్తారు. ఇక ఆ ఆస్తి మీది కాదు, మాది అని చెప్పి కూడా చెప్పే రోజు కూడా ఇక త్వరలోనే వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పులివెందల నుంచి మొదలయ్యే ఈ ఆలోచనను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన నామినేషన్ పత్రాలు, అలా మన హక్కులను అధికారులు, పోలీసలు సమక్షంలోనే లాక్కుంటున్న వీరి వల్ల రేపు పొద్దున మన ఆస్తుల పరిస్థితి ఏమిటి? రేపు పొద్దున మనం సబ్ రిజిస్టార్ ఆఫీస్‌కు పోతే, అక్కడ వాళ్లే మన పేపర్లు చింపేసి, ఇక ఈ ఆస్తి నీది కాదు, నాది అని చెప్పే పరిస్థితి అతి త్వరలోనే వస్తుంది. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుతున్నా. తిరగబడండి. మీ అన్న తోడుగా ఉంటాడు: మన హక్కులను మనం కాపాడుకోకపోతే, మన హక్కులు మనకు ఎప్పటికీ దక్కకుండా పోతాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అందుకే అందరినీ ఒక్కటే కోరుతున్నా. తిరగబడండి. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు అని గట్టిగా చెబుతున్నా. పులివెందులలో మీరు కొట్టే దెబ్బకు చెంప గువ్వుమనాలి. అది రాష్ట్రమంతా వినిపించాలి. ఎందుకంటే, ఇక్కడ చాలా దారుణంగా వ్యవహరించారు. ఇక్కడి మున్సిపాలిటీలో మనం కేవలం 29 స్థానాల్లోనే ఉండేలా చేశారు. అదే వారు మాత్రం మొత్తం స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అలాగే జెడ్పీటీసీల్లో వారు మొత్తం ఏడు చోట్ల పోటీ చేస్తుంటే, మనం నాలుగింటిలోనే పోటీకి దిగుతున్నాం. అంతగా తొండి, అన్యాయం, దౌర్జన్యం చేస్తున్నారు. అందుకే నా ఈ పిలుపు. వచ్చే సెప్టెంబరులో నా పాదయాత్ర ప్రారంభం: అందుకే మీరంతా తిరగబడాలని పిలుపునిస్తున్నా. మీకు మీ అన్న తోడుగా, అండగా ఉంటాడు. చూస్తుండగానే రెండున్నర ఏళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసుకుని తెరిచేలోగా మరో రెండేళ్లు. వచ్చే సంవత్సరంలో నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. వచ్చే సెప్టెంబరులో నా పాదయాత్ర మొదలుపెడతాను. అప్పుడు ఒక సంవత్సరం తర్వాత, ఈ ప్రభుత్వమే పూర్తిగా తుడిచిపెట్టుకోబోతుంది. ఇది నేను గట్టిగా చెబుతున్నా. ఆ చేయి నా మీద వేసినట్లే..: తప్పు చేసిన ఎవ్వరినీ వదిలేది లేదు: పులివెందులలో ప్రతి పోలీస్ అధికారికి చెబుతున్నా. ప్రతి అధికారికి చెబుతున్నా. పులివెందులలో మా వాళ్ళ మీద చెయ్యి వేశారు అంటే దానర్థం, మీరు నా మీద చేయి వేసినట్లే. అదే గట్టిగా చెబుతున్నాను. ఈరోజు టైమ్ మీది. మా మీద చేయి వేస్తున్నారు. రేపు మా టైమ్ వస్తుంది. అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం. అన్యాయం చేసిన ఏ అధికారిని వదిలిపెట్టబోము. ఇప్పుడు అన్యాయం చేసిన, చేస్తున్న ఏ అధికారి ఎక్కడికి పోలేడు. ఒకవేళ రిటైర్ అయిపోయి ఉన్నా కూడా తీసుకొని వస్తాం. చంద్రబాబునాయుడుగారికి కూడా గట్టిగా చెబుతున్నా. ప్రతి పోలీస్ అధికారికి, ప్రతి అధికారికి చెబుతున్నా. మీరు డ్యూటీ చేస్తోంది చంద్రబాబు కోసం . మీరు డ్యూటీ చేస్తోంది మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు అని ఒకసారి గుర్తు చేసుకొండి. అలాగే మీరు డ్యూటీ చేస్తోంది భారత రాజ్యాంగ వ్యవస్థ కోసం అనేది కూడా గుర్తు పెట్టుకొండి. ఇకనైనా వైఖరి మార్చుకొండి: మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మనమే ప్రజలను గౌరవించలేని పరిస్థితికి వస్తే, మనమే దౌర్జన్యం చేస్తే, రక్షకులుగా ఉండాల్సిన మనమే దౌర్జన్యం చేస్తే, ఇక రక్షించే వాడు ఎవడు? అని ఒకసారి ఆలోచించండి. ఇది ప్రతి అధికారికి, ప్రతి పోలీస్‌కు చెబుతున్నా. ఇప్పటికైనా సమయం మించి పోలేదు. మీలో మార్పు రావాలి. ఆ మార్పు తెచ్చుకొని మీరు అడుగులు వేయండి. ప్రజల కోసం మీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చండి. మనకు పోరాటాలు కొత్త కాదు: విజయాలూ మనం చూడనివి కావు: నేను మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు కొత్త కాదని గుర్తు చేస్తున్నా. మన పార్టీ పుట్టింది ప్రతిపక్షంలోనే. మన పార్టీ నడిచింది కష్టాల్లోనే. కానీ ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా చివరికి జరిగింది ఏమిటి? కొంచెం ఆలస్యమైనా మనం సీఎం సీట్లో కూర్చున్నాం. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఆరోజు జగన్ చేసిన మంచి ప్రతి ఇంట్లో లేనప్పుడే, జగన్ తప్పకుండా మంచి చేస్తాడు అన్న నమ్మకంతో మనల్ని గెలిపించారు. మనం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాం. అదీ ఈరోజు జగన్ చేసిన మంచి ప్రతి ఇంట్లో బ్రతికే ఉంది. అందుకే చంద్రబాబునాయుడుగారి పాలన, జగన్ పాలన మధ్య తేడాపై ప్రతి ఇంట్లో ఈరోజు చర్చ జరుగుతోంది. అందుకే ఈసారి ప్రజలు ఓటు వేస్తే చంద్రబాబునాయుడుగారికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితి వచ్చింది. వచ్చేది జగన్ 2.0 ప్రభుత్వం. అప్పుడు..: ఈ రెండు సంవత్సరాలు కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత వచ్చేది జగన్ 2.0 అన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి. జగన్ 2.0 లో జగన్ ఒకటైతే. పార్టీ కార్యకర్త రెండు అన్నది గుర్తు పెట్టుకోండి. మీ ద్వారానే ప్రజలకు మంచి చేస్తాను. మీ సంక్షేమం నా లక్ష్యం. మీ సమస్యలు నా సమస్యగా భావించి మీకు తోడుగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. ఎల్లవేళలా నాతో మీరున్నారు: మీ మీద పడ్డ ఏ దెబ్బపైనా మీ అన్న ఊర్కే చూస్తూ ఉండిపోడు. పులివెందుల ప్రజలు ఎప్పుడూ, నాన్న చనిపోయిన తర్వాత కూడా నా కుటుంబ సభ్యులుగానే అండగా నిలబడ్డారు. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా.. ఎవరి భుజానైనా నేను కన్నీళ్లు పెట్టుకోవాలని అంటే అది పులివెందల ప్రజలే అని మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మీరు నన్ను గెలిపించారు కాబట్టే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలిగాను అన్నది మాత్రం మరొక్కసారి గుర్తు పెట్టుకోండి. పులివెందుల నుంచే అందుకు బీజం: మీ బిడ్డకు మీరు తోడుగా నిలబడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమానికి పులివెందల నుంచే బీజం వేస్తాం. ఇక్కడి నుంచి పడే బీజం రేపు పొద్దున ఒక చెట్టుగా మారి చంద్రబాబునాయుడుగారిని కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేస్తుంది. మీ తోడు నీడ, మీ ఆప్యాయతలకు ఎప్పుడూ మీ జగన్ మీకు రుణపడి ఉంటాడు. దమ్ముంటే ఆరోజు అన్యాయం చేసి చూపండి: ‘స్థానిక ఎన్నికల్లో ఓటింగ్‌కు ముందు రోజు రాత్రి నేను ఇక్కడికే వస్తాను. ఓటింగ్ రోజున మీ జగన్ కూడా బూతులోకి వెళ్లి ఓటు వేస్తాడు. అయినా అన్యాయం చేయడానికి అయినా మీరు ముందుకు వస్తారా? రండి. స్లీవ్ (చొక్కా చేతులు) ఎట్లాగూ మడిచాం. ఎంత మంది వస్తారో రండి. గట్టిగా నిలబడి చూపుదాం’. ప్రజాస్వామ్యంలో ఎవరు మంచి చేశారో వారికే ప్రజలు తోడుగా నిలబడతారు అన్న సంకేతం ఖచ్చితంగా పంపిస్తాం. ఎల్లప్పుడూ మీకు తోడుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా నిలబడతాను. చివరగా, మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ శ్రీ వైయస్ జగన్ ప్రసంగం ముగించారు.