బరితెగింపునకు అంతం లేదా?

పోలీసుల అండతో అభ్యర్థులకు బెదిరింపులు, ప్రలోభాలు

లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను బెదిరిస్తున్న పోలీసు అధికారుల తీరుపై రాష్ట్ర ఎన్నికల 
కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలను వివరించారు.

నామినేషన్ల అడ్డగింత నుంచి అప్పీళ్ల తిరస్కరణ వరకు.. అడుగడుగునా ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు

అభ్యర్థులను బెదిరిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు

పోలీసు, రెవెన్యూ అధికారుల అండతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్న వైనం

అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో అప్పీళ్ల ప్రక్రియలో టీడీపీ నాయకుడి జోక్యం ఏమిటి?

గూడూరు డీఎస్పీ, నెల్లూరు సీఐ వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ‌టం దారుణం

పోలీసు అధికారుల వ్యవహారాలపై ఆడియో, వీడియో ఆధారాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పణ

ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ప్రజల తీర్పును గౌరవిస్తూ స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేలా చూడాలి

స్పష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు   

విజ‌య‌వాడ‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు కొందరు పోలీసు అధికారులు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. పోలీసులే ఎన్నికల నిబంధనలను పక్కనపెట్టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడని, ఈ బరితెగింపునకు అంతం లేదా అని నిలదీశారు. నామినేషన్ల అడ్డగింత, అభ్యర్థులపై ఒత్తిళ్లు, అప్పీళ్ల ప్రక్రియలో జోక్యం వంటి పరిణామాలకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సమర్పించినట్లు వెల్లడించారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో టీడీపీ నాయకుడి జోక్యం, గూడూరు డీఎస్పీ, నెల్లూరు సీఐ వ్యవహారాలపై తక్షణ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పోలీసు వ్యవస్థ దుర్వినియోగాన్ని అడ్డుకుని, ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్ఈసీని కలిసిన అనంతరం లేళ్ల అప్పిరెడ్డి, టీజేఆర్ సుధాకర్‌బాబు అక్కడే మీడియాతో మాట్లాడారు. 
మీడియాతో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఏమ‌న్నారంటే..

- పోలీసులే బెదిరింపులకు, ప్రలోభాలకు దిగితే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడ?: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

‘‘రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను ఒకవైపు భయపెడుతూ, మరోవైపు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ఫోన్లు చేసి బేరసారాలకు దిగుతున్న పరిస్థితి నెలకొంది.  మాజీ మేయ‌ర్ అజీజ్‌, వైయ‌స్ఆర్‌సీపీ నేత ఎద్దుల న‌రేంద్ర‌రెడ్డిల‌ను పోలీసు అధికారులే ఫోన్లు చేసి బెదిరించారు. నెల్లూరు సీఐ సీతారాం, గూడూరు డీఎస్పీ నరసింహమూర్తికి సంబంధించిన వ్యవహారాలపై ఆడియో ఆధారాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాం. పోలీసులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు?

- నామినేషన్ల నుంచి అప్పీళ్ల వరకు అధికారుల జోక్యం

నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పరిశీలన పేరుతో తిరస్కరించడం, అప్పీళ్లు చేసుకునే అవకాశాలను దెబ్బతీయడం.. ఇలా ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో టీడీపీ నాయకుడు కూర్చొని స్టెనోలకు ఫైళ్లు ఎలా రాయాలో నిర్దేశించిన వ్యవహారంపై ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. నూజివీడులో రౌడీలు, గూండాలు కత్తులు తిప్పుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను కూడా అందించాం. పల్నాడు ప్రాంతంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల పేర్లతో నకిలీ నామినేషన్లు దాఖలవుతున్న వ్యవహారాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

- డీఎస్పీ, సీఐలను సస్పెండ్ చేయాలి

గూడూరు డీఎస్పీ నరసింహమూర్తి, నెల్లూరు సీఐ సీతారాం వ్యవహారాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆడియో, వీడియో ఆధారాలు అందించినా ఫిర్యాదులను కాగితాలకే పరిమితం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఎన్నికల కమిషన్ తనకున్న అధికారాలను ఉపయోగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల పోలీసు అధికారుల బెదిరింపులు కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించి చట్టం ముందు ఉంచుతాం. వైయ‌స్ఆర్‌సీపీకి ప్రత్యేకంగా ఎలాంటి మేలు చేయాలని కోరడం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసి, ప్రజల తీర్పు ప్రకారం ఎన్నికలు జరగాలన్నదే మా లక్ష్యం. ఎన్నికల కమిషన్ నుంచి సరైన స్పందన లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఎన్నికల్లో జరిగిన ప్రతి ఘటనపై భవిష్యత్తులో విచారణ జరిపించి, తప్పు చేసిన అధికారులను చట్టం ముందు నిలబెడతాం ’’ అని లేళ్ల అప్పిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

- ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలి:  టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే

‘‘రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు సమాన న్యాయం చేయాలి. కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఫిర్యాదులు స్వీకరించడం తప్ప, వాటిపై చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెల 13వ తేదీ నుంచి ఎన్నికల అక్రమాలు జరిగే అవకాశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు అందించాం. ఇప్పుడు బాధితుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో ఆధారాలను కూడా సమర్పించాం. అయినా డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులు నేరుగా ఫోన్లు చేసి అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు బేరసారాలు చేస్తున్నారంటే వ్యవస్థల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

- ప్రజాస్వామ్య పరిరక్షణకు తక్షణ చర్యలు అవసరం

పోలీసులకు లాఠీలు, తుపాకులు ఇచ్చింది ప్రజలను, రాజ్యాంగాన్ని రక్షించడానికి.. ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయడానికి కాదు. ఆర్డీఓ కార్యాలయంలో టీడీపీ నాయకుడు ఫైళ్లపై సూచనలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? గ్రామాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వారి ఇళ్లపై దాడులు జరుగుతున్నా, మహిళలను అవమానించే ఘటనలు చోటుచేసుకుంటున్నా ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం బాధాకరం. మీడియా కూడా ఈ వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సహకరించాలి. ఎన్నికల కమిషన్ తక్షణమే తన అధికారాలను వినియోగించి చర్యలు తీసుకోవాలి. ప్రజల ఓటు హక్కును కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతుంది ’’ టీజేఆర్ సుధాక‌ర్‌బాబు తేల్చి చెప్పారు.

ఎస్ఈసీని క‌లిసిన వారిలో ఎమ్మెల్సీ రుహుల్లా, వైయ‌స్ఆర్‌సీపీ గ్రివెన్స్ సెల్ అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, అధికార ప్ర‌తినిధి ష‌రీఫ్‌, ఎస్సీ సెల్ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ యోహ‌న్ రాజు, త‌దిత‌రులు ఉన్నారు.

Back to Top