ఉద్యోగులకు వైయస్ జగన్‌ వరాల జల్లు

ఆదోని సభలో వైయస్‌ జగన్‌ 

చంద్రబాబు ప్రతి అడుగులో వంచనే

పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటుపొడిచారు

ఆదోనికి చంద్రబాబు ఏం చేశారు?

ఉల్లి, పత్తి రైతులకు గిట్టుబాటు ధర లేదు

పేదల కష్టాలు చూసి గుండెలు తరుక్కుపోయాయి

ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోని వర్గాల కష్టాలు చూశాను

పుట్‌పాత్‌లో ఉన్న వ్యాపారులకు రూ.10 వేల రుణం

ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటిస్తా, సకాలంలో పీఆర్‌సీ అందిస్తా్త

సీపీఎస్‌ రద్దు చేస్తా

ఔట్‌సోర్సింగ్‌లో పని చేసే వారికి సమాన పనికి సమాన వేతనం ఇస్తాం

పోలీసులు స్వేచ్ఛగా పనిచే సుకునే వీలు కల్పిస్తాం

మీ అందరికి నేనున్నానని భరోసా ఇస్తున్నా

 

కర్నూలు: అన్ని వర్గాల ప్రజలు,  ప్రభుత్వ, ఔట్‌సోర్సింగ్‌ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు వైయస్‌ జగన్‌ వరాల జల్లులు కురిపించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారని ప్రతి ఒక్కరికి చెప్పాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, స‌కాలంలో పీఆర్‌సీ ప్రకటిస్తానని, సీపీఎస్‌ రద్దు చేస్తానని మాట ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పొదుపు రుణాలు మాఫీ చేసి నేరుగా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

 నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య ఉంది. ఆదోని నగరంలో నాలుగు రోజులకు ఒకసారి నీరు ఇచ్చే పరిస్థితి ఉంది. ఐదేళ్లుగా పరిస్థితి ఇదని అడుగుతున్నా.. ప్రభుత్వం నుంచి పట్టించుకునేవాడు లేడు. చివరకు ఇదే ఆదోనిలో గతంలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ కూడా ఎవరు కట్టారంటే అప్పట్లో వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. ఆదోనిలో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య. బైపాస్‌ రోడ్డులో వైయస్‌ఆర్‌ హయాంలో బైపాస్‌ రోడ్డుకు సంబంధించి మూడు బిట్లు పూర్తి చేస్తే మిగిలిన ఒక్క బిట్టు పూర్తికి ఐదేళ్లలో పట్టించుకునే నాధుడే లేడు. ఆదోని రెవెన్యూ డివిజన్‌ అయినా ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా లేదు. ఉన్నది ఒక ఎయిడెడ్‌ కాలేజీ. దాంట్లో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చదువులు చదువుకోవాలంటే పిల్లలకు ఎండమావి అయ్యే పరిస్థితి ఏర్పడింది. 

ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉండాల్సిన 14 మంది డాక్టర్లు, దాంట్లో ఐదు మంది మాత్రమే పనిచేస్తున్నారు. మనందరికీ ఎల్‌ఎల్‌సీ ఉంది. లోలెవల్‌ కెనాల్‌ కింద భూములకు నీరు అందడం లేదు. ఆధునీకరిస్తేనే పని జరుగుతుందని అప్పట్లో వైయస్‌ హయాంలో 175 కోట్లు కేటాయించి 75 కోట్ల రూపాయల పనులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. తరువాత మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఐదు సంవత్సరాలు పాలన చేశారు. లోలెవల్‌ ఆధునీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మిగిలిపోయాయి. ఈ ఏడాది తుంగభద్రలో నీళ్లు కూడా ఉన్నా.. రబీ సాగును పూర్తిగా రద్దు చేశారు. మైనార్టీలకు ప్రార్థనా స్థలాలు కావాలని అడుగుతున్నారు.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈద్గా సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. గుండ్రేవుల ప్రాజెక్టు తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్‌ నిర్మిస్తే అక్షరాల 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రెండు జిల్లాల్లోని 659 గ్రామాలకు తాగునీరు అందించగలుగుతామని, లక్షల మందికి తాగునీటితో దాహం తీర్చవచ్చని తెలిసి ఈ పెద్దమనిషి పట్టించుకోలేదు. 2014 ఆగస్టు 15న కర్నూలులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఇచ్చిన హామీ గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు. మళ్లీ ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని గత నెల 21వ తేదీన శంకుస్థాపన అని టెంకాయ కొట్టి పోతున్నాడు. ప్రతి అడుగులో కనిపించేది మోసం, అబద్ధం, ప్రతి అడుగులో వంచన, కూతురును ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ప్రజలకు వెన్నుపోటు పొడవడం ఎంతటి పని అన్నట్లుగా ఉంది బాబు పాలన. 

దేశంలోనే మహారాష్ట్ర తరువాత అత్యధికంగా ఉల్లిపంట సాగు చేసేది మన కర్నూలు జిల్లాలోనే. కానీ ఇదే ఉల్లిపంటకు రేటు ఎంతో తెలుసా.. గత ఐదు సంవత్సరాలుగా పంటకు రేటు రాక పొలాల్లోనే పంటను వదిలేసే పరిస్థితి. ఉల్లికి ధర కేజీ రూపాయిన్నరకు కూడా కొనుగోలు చేసే దిక్కులేదు. ఇదే ఉల్లి చంద్రబాబు కంపెనీ హెరిటేజ్‌ షాపుల్లో కేజీ రూ. 23కు అమ్ముకుంటున్నాడు. అంటే దళారీల వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు. దళారీలకు చంద్రబాబు కెప్టెన్‌ అయితే రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు. ఉల్లి, టమాట, పత్తి పరిస్థితులు అంతే. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం కనిపిస్తుంది. మీ అందరితో ఒకటే చెబుతున్నా.. చంద్రబాబు పాలనలో ఇంతటి దారుణాలు, మోసాలు, అబద్ధాలు, వెన్నుపోట్ల మధ్య జరుగుతుంది. 

నా పాదయాత్ర 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగానంటే అది కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగాను. ఆ పాదయాత్రలో మీ కష్టాలను చూశాను. మీ బాధలను చూశాను. మీ కష్టాలు చూశాను కాబట్టి మీతో మమేకమయ్యాను కాబట్టి మీ అందరికీ ఒక్క హామీ ఇస్తున్నాను.. నేను ఉన్నానని కచ్చితంగా హామీ ఇస్తున్నా.. నేటికీ రాష్ట్ర జనాభాలో 85 శాతం మందికి తెల్లకార్డులే ఉన్నాయి. అంటే దాని అర్థం 85 శాతం జనాభాలో పేదవాళ్లని అర్థం, వీరికి కచ్చితమైన ఆదాయం లేదని అర్థం. నా పాదయాత్రలో ఇటువంటి వాళ్లు పడుతున్న బాధలు చూశా. పేదవాడిని ఎలా బాగుపరచాలి. పేదరికం నుంచి ఎలా బయటకు తీసుకురావాలనే ఆలోచనతో నా పాదయాత్ర సాగింది. కొందరి కష్టాలు చూసినప్పుడు గుండె తరుక్కుపోయింది. కొందరు ప్రభుత్వం పట్టించుకోని వర్గాలు.. ద్యాస పెడితే బతుకులు మారుతాయన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఫుట్‌పాత్‌పై సరుకులు అమ్ముకుంటున్న పరిస్థితులు, తోపుడు బండ్ల మీద కూరగాయలు, సామాన్లు అమ్ముకుంటున్న పరిస్థితులు, రోడ్డు పక్కనే బండి, బండిలో టీషాపులో ఒక అక్క టీ, దోశలు తయారు చేస్తున్న పరిస్థితి చూశా. వాళ్లు ఎలా బతుకుతున్నారనే ఆలోచన ఎవరూ చేయలేదు. వారందరూ పెట్టుబడుల కోసం రూ. 4, 5 వడ్డీకి తెచ్చుకుంటున్నారు. వాళ్లకు అనారోగ్యంగా ఉంటే రెండ్రోజులు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ దుకాణం తీయలేని పరిస్థితి. వీళ్లందరికీ చెబుతున్నా.. మీ అందరి కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ సమస్యలు నేను చూశా. మీ సమస్యలు దగ్గర నుంచి విన్నాను. మీ అందరికీ నేనున్నానని భరోసా ఇస్తున్నా.. మీ అందరికీ గుర్తింపుకార్డులు ఇస్తా.. ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకునే వ్యక్తులకు గుర్తింపుకార్డులు ఇవ్వడమే కాదు.. వాళ్లందరికీ ఎప్పుడు అవసరం అయితే అప్పుడు రూ. 10 వేలు వడ్డీ లేకుండా రుణాలు అందజేస్తాం. కార్డు చూపిస్తే వడ్డీలేకుండా రుణాలు వచ్చే కార్యక్రమం చేస్తాం. 

దారిపొడవునా కష్టాలు వింటూ.. బాధలు వింటూ సాగిన పాదయాత్ర, రైతులు, పేదవాడి కష్టాలు విన్నాం. చదివించలేని పరిస్థితుల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు దుస్థితి, ఉద్యోగాలు లేక అల్లాడుతున్న పిల్లలను చూశా. వాళ్లందరి సమస్యలను చూస్తూ దారిపొడవునా.. పలానవి చేస్తే జీవితాలు బాగుపడతాయని వాళ్లందరి తరుఫున మాట్లాడుతూ వచ్చా.. నవరత్నాలు తీసుకొచ్చాం. వాళ్లందరికీ అండగా ఉండే కార్యక్రమాలు తప్పకుండా చేస్తానని చెబుతున్నా.. ఆదోనిలోనే ఉద్యోగస్థులు కూడా ఎక్కువ. ఆ ఉద్యోగస్థుల కోసం నాలుగు మాటలు మాట్లాడండి అని చాలా మంది కోరారు. ప్రతి ఉద్యోగస్థుడికి చెబుతున్నా.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తాం. ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌ ప్రకటిస్తామని హామీ ఇస్తున్నా.. సకాలంలో పీఆర్సీ కూడా అమలు చేస్తా. అన్ని శాఖల్లో ఉన్న గవర్నమెంట్‌ ఉద్యోగులకు చెబుతున్నా.. చంద్రబాబు రెగ్యులరైజ్‌ మాటలు విని మోసపోయిన ఉద్యోగులందరికీ చెబుతున్నా.. మీ సర్వీసు, మీ చదువులను పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్‌లో పనిచేస్తున్న వారిలో వీలైనంత ఎక్కువమందిని గవర్నమెంట్‌ ఉద్యోగులుగా చేస్తాం. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వాళ్లందరికీ హామీ ఇస్తున్నా.. సమన పనికి సమాన వేతనం కావాలని ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారందరికీ హామీ ఇస్తున్నా.. సమాన పనికి సమాన వేతనం అందిస్తానని హామీ ఇస్తున్నా. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో ఒక సెల్‌ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసే పరిస్థితులు తీసుకొస్తాం. స్నేహపూర్వక వాతావరణంలో తోడుగా ఉంటాం. 

పోలీసు బాసులకు చంద్రబాబు తొడిగిన పచ్చ చొక్కాలు విప్పుతాం. కిందస్థాయిలో పనిచేస్తున్న హోంగార్డులకు మెరుగైన జీతాలు ఇస్తాం. పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు కూడా ప్రకటిస్తాం. సెలవు ప్రకటించడం వల్ల అవసరం మేరకు ఎక్కువగా రిక్యూట్‌మెంట్లు కూడా జరుపుతాం. ఉద్యోగస్థుల ప్రతి సమస్య నేను చూశాను.. మీ అందరికీ తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా.. అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్న అక్కచెల్లెమ్మలకు అందరికీ నేను ఒకటే చెబుతున్నా.. మీ ప్రతి సమస్య నేను విన్నాను.. మీ ప్రతి సమస్య నేను చూశా. మీ అందరికీ తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా..

ఎన్నికలు దగ్గరపడ్డాయని చంద్రబాబు చెప్పని అబద్ధం ఉండదు. చేయని మోసం ఉండదు. ఆయన చూపని సినిమా కూడా ఉండదని మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి. మీ అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా.. ఇవాళ జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతుంది. చంద్రబాబు ఒక్కడితోనే కాదు మన యుద్ధం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇంకా అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నాం. ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు చేయని కుట్ర, కుతంత్రం ఉండదు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి గ్రామాలకు మూటల మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మళ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. మీ అందరినీ కోరేది ఒక్కటే.. మీ అందరూ మీ గ్రామాలు, వార్డుల్లో ప్రతి అక్కాచెల్లెమ్మలు, అన్నను, ప్రతి అవ్వాతాతలను కలవండి. మీ గ్రామాల్లో ప్రతి అక్కను కలిసి చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. మన పిల్లలను ఇవాళ ఇంజనీరింగ్, డాక్టర్‌ చదివించగలుగుతున్నామా.. ఒక్కసారి ఆలోచన చేయండి అని అడగండి. ఫీజులు చూస్తే సంవత్సరానికి రూ. లక్షలు దాటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేకపోతున్నాం అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టండి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరువాత మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్‌ వంటి చదువులను ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న చదివిస్తాడని ప్రతి అక్కకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. ఐదేళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. ఎన్నికలప్పుడు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్నాడు.. మాఫీ చేయకపోగా గతంలో వచ్చే సున్నా వడ్డీ కూడా ఎగరగొట్టిన పరిస్థితిని చూస్తున్నాం.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఎంతైతే రుణాలు ఉంటాయో మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీకే ఇస్తారక్కా అని చెప్పండి. 

పేదరికంలో ఉండి అలమటిస్తున్న బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు చెప్పండి... 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు ఉన్న అక్కలకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం.. ప్రతి అక్క చేతిలోనూ వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తున్నాడు.. అక్షరాల రూ. 75 వేలు ప్రతి అక్కచేతికి నాలుగు దఫాలుగా ఇస్తాడని చెప్పండి. ప్రతి అవ్వాతాతల దగ్గరకు వెళ్లి ఆ అవ్వను ఒకే ఒక్క మాట అడగండి మూడు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. రూ. వెయ్యి అని మాత్రమే చెబుతుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే చంద్రబాబు ఇచ్చేవాడా అని అడగండి. అవ్వాతాతలకు చెప్పండి చంద్రబాబు మోసాలకు బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టండి.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. పెన్షన్‌ రూ. 3 వేలకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి.  

నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాన్నగారి పాలన తీసుకువస్తామన్నారు. మీ దీవెనలు, చల్లని ఆశీస్సులు ఎమ్మెల్యే అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి అన్నకు ఓటు వేసి గెలిపించండి. చేనేత కులానికి చెందిన నాయకుడు, డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ అన్న మంచివాడు, మీ అందరికీ మంచి చేస్తాడనే నమ్మకం ఉంది. మీ అందరి చల్లని దీవెనలు సంజీవన్నపై కూడా ఉంచాలని భావిస్తున్నాను. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. దర్గాకు రాలేకపోతున్నానని ఎవరూ తప్పుగా అనుకోవద్దు అన్నా.. ఎన్నికల సమయం కాబట్టి రాలేకపోతున్నందుకు ఎవరూ ఏమీ అనుకోవద్దు, వీళ్లంతా రకరకాలుగా వక్రీకరిస్తారు. కోడ్‌ ఉల్లంఘన అని రకరకాలుగా అంటారు. అదొకటే కాదు.. సమయాభావ కారణం కూడా ఉంది. ఈ సారి కచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి హోదా వస్తానని కచ్చితంగా చెబుతున్నా.. 

Back to Top