రాక్షసుల గురించి చదివాం.. ఐదేళ్లుగా చూస్తున్నాం

చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర వనరులను దోచేసుకుంటున్నారు

బాబు నేతృత్వంలో రాష్ట్రంలో మాఫియా తయారైంది

ఐదేళ్లుగా పన్నుల రూపంలో పేదవాడి రక్తం పీల్చేస్తున్నాడు

ఇక మోసపోయింది చాలు.. మళ్లీ పొరపాటున బాబుకు ఓటేయొద్దు

మార్పు కోసం విశ్వసనీయతకు ఓటేయండి

నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతా

మైలవరం సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మైలవరం: పురాణాల్లో రాక్షసుల గురించి చదివాం. ఐదేళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో చూస్తున్నామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక,  మ‌ట్టి, కొండలు, గుట్టలు రాష్ట్ర వనరులన్ని కొల్లగొడుతున్నారు. చంద్రబాబు గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఒక మాఫియాను తయారు చేశాడని విమ‌ర్శించారు.  మైలవరం ప్రచార సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. మళ్లీ ఇలాంటి వ్యక్తులకు ఓటేస్తే ఒక సామాన్య ప్రజలు ఎవరూ బతికే పరిస్థితి ఉండదని, మార్పు కోసం విశ్వసనీయతకు ఓటు వేయాలని సూచించారు. నవరత్నాలతో ప్రతి కుటుంబంలో సంతోషం నింపుతానని జననేత అన్నారు. మైలవరం సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 

ఇదే మైలవరం గుండా నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. అది పూర్తి చేయగలిగాను అంటే ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగాను. ఆ రోజున మీరు చెప్పిన ప్రతి అంశం గుర్తుంది. మైలవరంలో ఏరకంగా అన్యాయాలు, అరాచకాలు, ఏరకంగా పోలీసులు గుండా రాజ్యం నడుస్తుందని మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఇవాళ నా కళ్లతో చూశా.. ప్రజలకు కనిపించే దారిలో డీఎస్పీ నాగేశ్వరరావు లారీలు అడ్డం పెట్టి ఆ దారి నుంచి పోకూడదని అడ్డుకున్నాడు. వీరంతా పోలీసు చొక్కాలు వేసుకొని సెల్యూట్‌ చేయాల్సింది ఆ టోపీ మీద ఉన్న మూడు సింహాలకా.. లేకపోతే ఆ సింహాల వెనుక ఉన్న గుంత నక్కలకా.. అని ఆశ్చర్యమేసింది. నిజంగా ఈ దోపిడీ సామ్రాజ్యంలో జరుగుతున్న అన్యాయాలు గుర్తున్నాయి. పురాణాల్లో చదివినప్పుడు చాలా మంది రాక్షసుల గురించి చదివాం. ఈ ఐదు సంవత్సరాల్లో మన కళ్ల ముందు ఇసుకాసురులు చూస్తున్నాం. కృష్ణానది అవతలి వైపున సాక్షాత్తు ముఖ్యమంత్రి తన ఇంటి పక్కనే ఇసుక దోపిడీ చేస్తుంటే.. నదికి ఇవతలి వైపు కస్తలా, కోసూరు, కంచికచర్ల, నందిగామ, చంద్రన్నపాడు సహా మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, సూరాయిపాలెం నుంచి ఏరకంగా ఇసుకను ఇక్కడి మంత్రి ఏరకంగా దోచేస్తున్నాడని మీరు చెప్పిన విషయాలు ఇవాల్టికి నాకు గుర్తున్నాయి. సామాన్య ప్రజలకు ఇసుక మీకు ఫ్రీగా వస్తుందా అని అడుగుతున్నా.. ఇంతటి దారుణంగా మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. 

కృష్ణా పుష్కరాల పేరుతో ఏరకంగా దోపిడీ చేశారో చూశా. కృష్ణా పుష్కరాల పేరుతో నామినేషన్‌ పద్ధతిలో ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచి ఘాట్లు, రోడ్లు ఇవాల్టికి ఉన్నాయా.. మైలవరం నియోజకవర్గంలో దాదాపు వందకు పైగా అనుమతి లేని కంకర క్వారీలను ఇక్కడే నిర్వహిస్తూ నిసిగ్గుగా అధికార దుర్వినియోగాన్ని పట్టపగలే చేస్తుంటే.. మాఫియా సామ్రాజ్యం ఏ స్థాయిలో జరుగుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. జల వనరుల శాఖామంత్రి నియోజకవర్గంలో పంట పొలాలకు నీరు ఉండవు. నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏమాత్రం వచ్చాయని ప్రశ్నిస్తున్నాను. రైతులు పడుతున్న బాధలు, మంత్రికి, ముఖ్యమంత్రికి అర్థం కావు. గడిచిన ఐదేళ్లలో అరకొర నీరు మాత్రమే ఇస్తున్నారు. జీ.కొండూరులో ఉడవేరుపై తారకరామా ఎత్తిపోతల పనులు ఇవాల్టికి పూర్తి కాలేదు. అప్పట్లో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు వైయస్‌ఆర్‌ హయాంలో రెండోదశ పనులు మొదలుపెట్టి పూర్తి చేసి మూడో దశకు కూడా శంకుస్థాపన చేశారు. మూడు దశ పనులు దేవుడు ఎరుగు.. చంద్రబాబు హయాంలో రెండో దశలో పెట్టిన పంపులు ఇవాల్టికి పనిచేయని పరిస్థితి. ఎంతటి దారుణంగా రైతులను అన్యాయం చేస్తున్నారో వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. 

పోలవరం కుడి కాల్వ దాదాపుగా 174 కిలోమీటర్లలో అక్షరాల 145 కిలోమీటర్లు వైయస్‌ఆర్‌ హయాంలోనే పూర్తయింది. అటువంటి పోలవరం ప్రాజెక్టు కుడిక్వాలను వెలగలేరు వరకు తీసుకువచ్చారు. కేవలం రెండు కిలోమీటర్లు తవ్వి మొత్తం మేమే పనిచేశామని డబ్బాలు కొట్టుకుంటున్న ఇటువంటి టీడీపీ నేతలను ఏమనాలి. తాగునీటి కొరతతో ప్రజలు అల్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కృష్ణానది నుంచి నీటిని తీసుకువచ్చే పైపులైన్‌ అప్పట్లో దివంగత నేత వైయస్‌ఆర్‌ హయాంలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 40 శాతం పూర్తి చేయడానికి ఐదేళ్లు అయినా ఇంకా పది శాతం పనులు పూర్తి కాలేదు. పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు చెప్పిన ప్రతి సంఘటన నాకు గుర్తుంది. మామిడి రైతులు బంగినపల్లి వెరైటీ టన్ను రూ. 30 – 35 వేలు ఉంటే కానీ గిట్టుబాటు అవుతుంది. కానీ రైతులు రూ. 8 వేలకు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు అల్లాడిన పరిస్థితి పాదయాత్రలో చూశాను. అసలు ప్రభుత్వంలో ఉన్నది మనుషులేనా వీరు ఉండి ఏం లాభం అని ప్రశ్నించిన సంఘటన. తోతాపురి టన్ను రూ. 16 నుంచి 18 వేల వస్తే కాస్త డబ్బు రైతుకు అందుతుంది. కానీ గతేడాది రూ. 5 వేలు కూడా రాని పరిస్థితి. పత్తిపంటకు కనీస మద్దతు ధర రూ. 5,450, కానీ రైతు చేతికి వచ్చే సరికి కనీసం రూ. 5 వేలు కూడా రావడం లేదన్న మాటలు ఇవాల్టికి గుర్తున్నాయి. మిర్చి పంట కనీసం రూ. 10 వేలు వస్తే రైతులకు ఖర్చులకైనా వస్తుంది. మిర్చి పంట కనీసం రూ. 6 వేలకు కూడా అమ్ముకోలేకపోయామనే మాట ఇవాల్టికి గుర్తుంది. మీ ప్రతి కష్టం చూశా.. మీ ప్రతి బాధ విన్నా.. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను.. నేను ఉన్నానని మాటిస్తున్నాను. 

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏరకంగా అవినీతి, అన్యాయాలు, అరాచకాలు రాజ్యమేలిన పరిస్థితులు మీరు చూశారు. పొరపాటున మళ్లీ చంద్రబాబుకు మీరు ఓటేస్తే.. ఇప్పటికే ఐదేళ్ల పాలనలో చూస్తున్నాం.. 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మేసేశారు. గవర్నమెంట్‌ స్కూళ్లలో టీచర్‌ పోస్టులు భర్తీ చేయరు. సమయానికి పుస్తకాలు ఇవ్వరు. మధ్యాహ్న భోజన పథకానికి సరుకుల బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పేదవారు ఎవరూ తమ పిల్లలను బడులకు పంపించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే నారాయణ స్కూళ్లలో ఎల్‌కేజీకి సంవత్సరానికి రూ. 25 వేలు వసూలు చేస్తున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే గవర్నమెంట్‌ స్కూళ్లు ఉండవు. నారాయణ స్కూళ్లలో ఎల్‌కేజీకి రూ. లక్షా గుంజుతారు. కాలేజీల ఫీజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంజనీరింగ్‌ చదవాలంటే సంవత్సరానికి ఇవాల్టికి లక్ష రూపాయల పైచిలుకు ఫీజులు గుంజుతున్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు సంవత్సరానికి రూ. 5 లక్షలు గుంజుతాడని ఎవరూ మర్చిపోవద్దు. మనం అప్పులు చేసినా మన పిల్లలను చదువులు చదివించలేం. 

ఐదు సంవత్సరాల కాలంలో ఆర్టీసీ చార్జీలు బాదుడే.. బాదుడు. కరెంటు చార్జీలు బాదుడే.. బాదుడు. పెట్రోల్, డీజిల్‌ రేట్లు బాదుడే.. బాదుడు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు బాదుడే.. బాదుడు. మళ్లీ చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే వీరబాదుడు ఉంటుందని ఎవరూ మర్చిపోవద్దు. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే అధికారంలోకి రాగానే పెన్షన్లు, రేషన్‌ కార్డులు కట్‌.  2014లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు మన రాష్ట్రంలో పెన్షన్‌ కార్డులు 44 లక్షలు, బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 36 లక్షలకు తగ్గించాడు. రేషన్‌ కార్డుల గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ చంద్రబాబుకు రేషన్, పెన్షన్‌ కార్డులు పెంచాలని ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా గుర్తుకువచ్చాయి. 

మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మీ భూములు, మీ ఇళ్లు తన అత్తగారి సొత్తు అన్నట్లుగా ఎక్కడి పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు లాక్కుంటున్నాడు. భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ ఎలా సవరణలు చేశాడో మీరంతా చూస్తున్నారు. ఐదు సంవత్సరాల కాలంలో వెబ్‌ల్యాండ్‌ పేరిట మీ భూములు ఇప్పటికే భూ రికార్డులు తారుమారు చేస్తూ మాయం చేస్తున్నాడు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే భూములు, ఇళ్లు ఉండవని ఎవరూ మర్చిపోవద్దు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్న వనరులు దోచేస్తాడు. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే ఈసారి ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు ఏవీ మిగలవని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ఇసుక లారీ రేటు రూ. 40 వేలు పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇసుక రేటు లక్ష రూపాయలు దాటుతుందని ఎవరూ మర్చిపోవద్దు. మీ గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశాడు. ఏ సంక్షేమ పథకం మీకు ఇవ్వాలన్నా.. ఆ కమిటీలు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఈసారి జన్మభూమి కమిటీలు మీరు ఏ సినిమా చూడాలో.. ఏ టీవీ చానల్‌ చూడాలో, ఏపత్రిక చదవాలో వారే నిర్ణయిస్తారు. చంద్రబాబు మహానాయకుడు సినిమా చూడాలని బెదిరింపులకు గురిచేస్తున్నారు. కానీ, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మాత్రం చూడకూడదంట. ఇప్పటికే పరిస్థితి ఇది ఒక్కసారి ఆలోచన చేయండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మీరు సినిమా చూడాలో.. మీరు టీవీ చానల్‌ చూడాలో.. మీరు స్కూలుకు వెళ్లాలో.. మీరు ఏ పత్రిక చదవాలో.. మీరు ఏ ఆస్పత్రికి వెళ్లాలో.. వారు చెప్పిన డబ్బులు ఏ రకంగా మొత్తం వాళ్లే నిర్ణయించే కార్యక్రమం చేస్తారనే విషయం మర్చిపోవద్దు. 

పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే రైతులకు ఇక ఉచిత విద్యుత్‌ ఉండదు. రైతులకు ఉచిత విద్యుత్‌ అంటూనే ఏడు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చాయనగానే రెండు నెలల ముందు రైతులకు చంద్రబాబు కరెంటు ఇస్తున్నాడు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే రైతులకు ఉచిత విద్యుత్‌ ఉండదు. ఇప్పటికే పక్షవాతం వచ్చిన వాళ్లు మంచానికే పరిమితమై మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తే మా పరిస్థితి ఏంటన్నా అని ఆవేదన చెందుతున్నారు. 108 నంబర్‌కు ఫోన్‌ చేస్తే కుయ్‌.. కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌ వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి. పెద్ద ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వస్తే హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ కటింగ్‌ పెట్టాడు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇప్పటికే నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టాడు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఆరోగ్యశ్రీ, 108, 104 ఉండదని మీరంతా గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం కొన ఊపిరితోనే ఉంది. ఒకవైపు కాలేజీ ఫీజులు సంవత్సరానికి లక్ష రూపాయలు దాటుతుంది. రియంబర్స్‌మెంట్‌ అరకొర ఇస్తున్నారు. అది కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతో పిల్లలు సర్టిఫికేట్లు అక్కడే వదిలేస్తున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి. మళ్లీ చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం పూర్తిగా ఎగరగొడతాడు. 

గ్రామానికి పక్కా ఇళ్లు గ్రామానికి పది కూడా ఇవ్వడం లేదు. అవి కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే వస్తున్నాయి. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇళ్లు కూడా ఇవ్వడని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చంద్రబాబు గతాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి 1994 సంవత్సరంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం రూ. 2కే కిలోబియ్యం, సంపూర్ణ మద్య నిషేదం అనే నినాదాలతో వచ్చారు. ఆ తరువాత 1995 వచ్చే సరికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తరువాత కిలో రూ. 2 బియ్యం రూ. 5.25 పైసలకు పెంచాడు. సంపూర్ణ మద్యనిషేదం పూర్తిగా ఎత్తేశాడు. చంద్రబాబుది ఇదే నైజం. చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలన కూడా చూస్తున్నారు. ఇప్పటికే పొదుపు సంఘాలకు ఇప్పటికే సున్నా వడ్డీ పథకం పూర్తిగా రద్దు అయిపోయింది. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మళ్లీ పొదుపు సంఘాల వడ్డీ బాదుడే.. బాదుడు. ఇవాల్టికి రైతుల పరిస్థితి చూస్తున్నారు. రైతులకు ఇచ్చే సున్నావడ్డీ ఇప్పటికే రద్దు అయిపోయింది. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే రైతులకు ఇచ్చే రుణాలు కూడా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అని పెట్టి రుణాలు కత్తిరిస్తాడు. చంద్రబాబు నైజం గమనించండి. ఇప్పటికే తనను వ్యతిరేకించే వారిని ఎవరిని బతకనివ్వడం లేదు. మళ్లీ పొరపాటున ఓటు వేస్తే చంద్రబాబును వ్యతిరేకించే ఎవరినీ బతకనివ్వడు. రాజధాని ప్రాంతం నుంచి గ్రామ స్థాయి వరకు తనకు కావాల్సిన వారిని పోలీసులకు వేసుకున్నాడు. మనుషులను చంపించిన ఇక కేసులు ఉండవు. సీబీఐని, ఈడీని ఆంధ్రరాష్ట్రంలోకి రానివ్వడు. ఇప్పటికే ఎల్లో మీడియా తీరు చూస్తున్నారు. చంద్రబాబు ఏ నేరాలు చేసినా కూడా రాసేవ్యక్తి, చూపించే వ్యక్తి ఉండరు. పైగా చంపించి వారి బంధువులే చంపించారని ఎల్లో మీడియాలో వక్రీకరిస్తూ రాస్తారు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే బీసీలు, ఎస్టీ, ఎస్సీలు, మైనార్టీలు ఎవరూ బతికే వీలు ఉండదు. ఇప్పటికే బీసీలకు జడ్జిల ఉద్యోగాలు వస్తే ఏరకంగా చంద్రబాబు లేఖలు రాసి బీసీలకు సమర్థ లేదని జడ్జీల పోస్టులు రానివ్వని పరిస్థితి చూశారు. 

చివరి మూడు నెలల్లో చంద్రబాబు చూపిస్తున్న డ్రామాలు నమ్మితే ఎన్నికల వేళ మళ్లీ మోసం చేయడానికి చేస్తున్న వాగ్దానాలు నమ్మితే.. ఇంటికి వెళ్లి టీవీల్లో వచ్చే ప్రకటనలు నమ్మితే నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మినట్లేనని గుర్తుపెట్టుకోండి ఒకసారి మోసపోయాం. మళ్లీ అవే మోసాలు జరుగుతున్నాయి. మళ్లీ అవే కుట్రలు జరుగుతున్నాయి. అందరినీ కోరేది ఒక్కటే అప్రమత్తంగా ఉండండి.. విశ్వసనీయతకు ఓటు వేయండి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఏదైనా వాగ్దానం చేస్తే.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చి హామీ నిలబెట్టుకోలేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. గత 20 రోజులుగా చంద్రబాబు చేస్తున్న కుట్రలు మీరు చూస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5 ఇంకా అమ్ముడుపోయిన ఎల్లో మీడియా ఏరకంగా కుట్ర చేస్తున్నారో మీరంతా చూస్తున్నారు. రోజుకో డ్రామా, పుకార్లు పుట్టించి వాటిపై చర్చ జరుపుతారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు. ఈ కుట్రల్లో భాగంగా ఎన్నికల తేదీ వచ్చే సరికి ప్రతి గ్రామానికి మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలోనూ రూ. 3 వేలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. కాబట్టి మీరంతా గ్రామాలు, మీ వార్డుల్లోకి వెళ్లి ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి అవ్వాతాతలను కలవండి. 

అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. ఆవరం రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. వారం రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. చంద్రబాబు ఊరికి కనీసం 10 ఇళ్లులు కూడా కట్టించలేదు. వారం రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో మన బతుకులు మారుతాయి. మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడవచ్చని గట్టిగానమ్ముతున్నా.. నవరత్నాలను మీ గడప దగ్గరకు తీసుకువస్తానని మాటిస్తున్నాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి.  మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణప్రసాద్‌ను నిలబెడుతున్నాను. మీ ఎంపీ అభ్యర్థిగా పొట్లూరి వరప్రసాద్‌ను నిలబెడుతున్నాను. వీరిద్దరిని ఆశీర్వదించాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరకు మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 

Back to Top