తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత కేశవరెడ్డిపై దాడి.. 

వీడియో కాల్ ద్వారా పరామర్శించిన వైయస్ జగన్ 

తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన దాడి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా స్పందించి, వీడియో కాల్ ద్వారా కేశవరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

వైయ‌స్ఆర్‌సీపీ వర్గాల కథనం ప్రకారం, తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడగా, పార్టీ శ్రేణులు వెంటనే ఆయనను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కేశవరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్న జేసీ వర్గీయులు విచ్చలవిడిగా రాళ్లదాడికి పాల్పడినట్లు తెలిపారు.

ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. కళ్లముందే దాడులు జరుగుతున్నా అడ్డుకునేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాడి ఘటనపై వైయస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బాధిత నేతకు పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, ఇలాంటి దాడులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ హింస పెరుగుతోందని, ప్రజాస్వామ్యంలో విభేదాలను హింసతో అణచివేయడం సరైన పద్ధతి కాదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది.
 

Back to Top