తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త చల్లా నాగరాజు కలిశారు. 2024 అక్టోబర్‌లో టీడీపీ గూండాలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన నాగరాజు తన గోడును పార్టీ అధినేతకు వివరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైయస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్‌గా పనిచేసినందుకు టీడీపీ గూండాలు రాడ్లతో దాడి చేసి నాగరాజు రెండు కాళ్లను విరగ్గొట్టారని తెలిపారు. ఈ దాడి కారణంగా ప్రస్తుతం వీల్‌చైర్‌కే పరిమితమై జీవనం కొనసాగిస్తున్నానని, కుటుంబ పోషణకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వైయస్ జగన్‌కు విన్నవించారు. అలాగే తనపై దాడి జరిగిన తీరును, అనంతరం తన కుటుంబంపై కొనసాగుతున్న వేధింపులను కూడా వివరించారు. నాగరాజు పరిస్థితిని సానుభూతితో విన్న వైయస్ జగన్, అతడికి పూర్తి అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను వైయస్ఆర్‌సీపీ ఎప్పటికీ ఖండిస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్థానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.