శ్రీ సత్యసాయి జిల్లా: జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం చెందిన జవాన్ అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. బెంగళూరు నుంచి నేరుగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా చేరుకున్న వైయస్ జగన్, అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌నాయక్‌ను పరామర్శించారు. వైయస్ జగన్‌ను చూసిన ఆ వీర జవాన్ తల్లిదండ్రులు దుఖాన్ని ఆపుకోలేకపోయారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పిన ఆయన, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పారు. దేశం కోసం ప్రాణలర్పించిన వీర జవాన్ మురళీనాయక్ త్యాగానికి వెల కట్టలేమన్న వైయస్ జగన్, ఆ కుటుంబానికి పార్టీ తరపున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఏమన్నారంటే..: `మురళీనాయక్ చిన్నవాడైనా తన మరణంతో రాష్ట్రంలో చాలా మందికి, పెద్దలకు స్ఫూర్తి దాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు. దేశం కోసం పోరాడుతూ తన ప్రాణ త్యాగంతో అనేక మంది మిగిలిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రక్షణ ఇచ్చారు. దేశం కోసం తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని వెనక్కు తేలేం కానీ, అతడు చేసిన త్యాగానికి రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారు. దేశం కోసం పోరాడుతూ, ప్రాణాలు కోల్పోతే రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. దాని కొనసాగిస్తూ, ఈ ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతలు. పార్టీ తరపు నుంచి ఆ కుటుంబానికి అండగా ఉంటాం. వైయస్సార్‌సీపీ నుంచి రూ.25 లక్షలు ఇస్తాం. ఇంకా పార్టీ నుంచి ఈ కుటుంబానికి అందరం తోడుగా ఉంటాం` అని వైయస్ జగన్ వెల్లడించారు.