శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి పట్టణానికి చెందిన యువకులు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెనుకొండలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. తొగట సామాజిక వర్గానికి చెందిన బండి శివప్రసాద్, బీరే చిన్న తదితరులు టీడీపీని వీడుతూ వైయస్ఆర్‌సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం, ప్రభుత్వ విధానాల వల్ల చేనేత రంగం సంక్షోభంలోకి వెళ్లడం, కార్మికులు అప్పుల బారిన పడటం వంటి అంశాలపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో తమకు వైయస్ఆర్‌సీపీ విధానాలే ఆశాజనకంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఆమె పార్టీ కండువా కప్పి కొత్తగా చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌సీపీలో చేరిన యువకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి వైయస్ఆర్‌సీపీ కట్టుబడి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ చేరికలతో పెనుకొండ నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.