టీడీపీ నేత‌ల భూకబ్జాలపై కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆగ్రహం 

కర్నూలు జిల్లా: కల్లూరు మండలం సమాదులపల్లె గ్రామంలో ఖాళీ భూములు కనిపిస్తే టిడిపి నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ్రామకంఠానికి చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల అవసరాల కోసం కేటాయించిన భూమిని కాజేయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. టిడిపి నాయకులు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మండిపడ్డారు.

ఇలాంటి దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని హెచ్చరించిన ఆయన, భూకబ్జాలను సహించబోమని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జా చేసిన భూములను తిరిగి ప్రజలకు అందజేస్తామని తెలిపారు. అలాగే కబ్జాదారులకు వత్తాసు పలికే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరించారు.
 

Back to Top