తాడేపల్లి: విజయవాడ శాప్ కార్యాలయం వద్ద నారా లోకేశ్ మోహరించిన రౌడీ దళం చేసిన విన్యాసాలు, వికృత చేష్టలు చూసిన తర్వాత చంద్రబాబు తన కొడుకు కోసం ఏ స్థాయికైనా దిగజారుతానని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ అవకతవకలపై రాష్ట్రంలోని జన్ జీ యువత, విద్యార్థులు, నిరుద్యోగులు శాప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించగా, ఆందోళనను అణచివేయాలని చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నిందని ఆయన విమర్శించారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ముసుగులో రౌడీ దళాలను ప్రవేశపెట్టి, తమపై లాఠీచార్జ్ చేయించారని, పోలీసుల ముందే తమపై దాడులు జరిగినా పట్టించుకోని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జన్ జీ యువత నిరసనలాగే, విజయవాడలోనూ యువత కదం తొక్కిందని పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షా పత్రం లీకేజ్ నుండి మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ కోటా, కాల్ లెటర్ల జారీ వరకు ప్రతి దశలోనూ నారా వారి అవినీతి మరకలు ఉన్నాయని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణ వేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. స్వతంత్ర దర్యాప్తు జరిగితే వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని నాగార్జున యాదవ్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... యువతకు నారా లోకేష్ సమాధానం చెప్పాలి డీఎస్సీ నియామక ప్రక్రియలో పేపర్ లీకేజ్ నుంచి మెరిట్ లిస్ట్ వరకు, స్పోర్ట్స్ కోటా నుంచి కాల్ లెటర్లు, నియామకాల వరకు ప్రతి దశపై నిరుద్యోగ యువతకు అనుమానాలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి. డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోంది? నిష్పక్షపాతంగా సీబీఐతో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలి. డీఎస్సీపై నిరుద్యోగ యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. విజయవాడ శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనపై కూడా సమగ్రంగా విచారణ జరిపించాలి. పోలీసుల సమక్షంలోనే తమ పార్టీ శ్రేణులపై దాడి జరిగిందని చెబుతున్నాం. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉందో నిష్పక్షపాతంగా తేల్చాలి. వైఎస్సార్సీపీ ఎప్పుడూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి వ్యతిరేకం కాదు. అయితే ఉపాధ్యాయుల ముసుగులో రాజకీయంగా వ్యవహరించి, మా ఆందోళనపై దాడులకు పాల్పడిన వారిని మాత్రం ప్రశ్నిస్తాం. డీఎస్సీపై యువత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రత్యామ్నాయ కార్యక్రమాలతో అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయవద్దు. నారా లోకేశ్ ఇప్పటికైనా యువత ముందుకు వచ్చి డీఎస్సీపై స్పష్టమైన సమాధానం చెప్పాలి. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం డీఎస్సీ అక్రమాలకు నారా లోకేశ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. డీఎస్సీ నియామకాలపై సమగ్రంగా సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి బాధ్యులు ఎవరో తేల్చాలి. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మీరు భావిస్తే సీబీఐ విచారణకు సిద్ధపడండి.. మీ నిజాయితీని, పారదర్శకతను నిరూపించుకోండి. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా నిరుద్యోగ యువత తరఫున మేము అడుగుతున్న ప్రశ్నలను ఆపలేరు. డీఎస్సీ నియామకాలపై యువతకు, రాష్ట్ర ప్రజలకు విశ్వాసం కలగాలంటే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచే వరకు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్య పద్ధతిలో తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వారి తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని నాగార్జున యాదవ్ స్పష్టీకరించారు.