ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారులకే అండగా ఉంటాం

 మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్ప‌ష్టం

వైయ‌స్ఆర్‌ జిల్లా: ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారుల ప్రయోజనాలకే తన మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కార్పొరేట్‌ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని రెండేళ్లుగా సవాల్‌ చేస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని రాచమల్లు అన్నారు. తన ఇంట్లో జూదం ఆడించి డబ్బులు తీసుకున్నానంటూ పదేపదే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కార్పొరేట్‌ వ్యాపారాలకు ప్రొద్దుటూరులో అనుమతులు ఇస్తే, వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అడ్డుకుని స్థానిక వ్యాపారులకు ప్రాధాన్యత కల్పిస్తామని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీరుపైనా రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం మానుకోవాలని సూచించారు.
 

Back to Top