దాడులు చేస్తే వైయ‌స్ఆర్‌సీపీ బలహీనపడుతుందని అనుకోవడం భ్రమ

జగనన్న, పార్టీ కార్యకర్తలు అండగా ఉన్నంతకాలం పోరాడుతూనే ఉంటాం

మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి

ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో కక్షపూరిత రాజకీయాలతో తన వ్యవసాయ భూముల్లో పంటలు కోయకుండా రెండేళ్లుగా అడ్డుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని తన 70 ఎకరాల పొలంలో పామాయిల్, కోకో పంటలను కోయించేందుకు ప్రయత్నిస్తుంటే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

రెండేళ్లుగా పంటలు సకాలంలో కోయనివ్వకపోవడంతో ఇప్పటికే పదుల సంఖ్యలో కోకో, పామాయిల్ చెట్లు చనిపోయాయని తెలిపారు. బుధవారం మరోసారి అబ్బయ్య చౌదరి తన పొలంలో పామాయిల్ గెలలు కోయిస్తుండటంతో ఆయన నివాసం, పంట పొలాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కొండలరావుపాలెంలోని ఆయన నివాసానికి చేరుకున్నాయి.

ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘‘దెందులూరులో దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది. గ్రామాల్లో దారుణమైన సంప్రదాయాలను తీసుకొస్తున్నారు. నా 70 ఎకరాల పొలంలో పంట కోసేందుకు కూలీలను పిలిస్తే చింతమనేని స్వయంగా కూలీల ఇళ్లకు వెళ్లి పనికి వెళ్లొద్దని బెదిరించే పరిస్థితికి వచ్చారు. రెండేళ్లుగా మా పొలాలకు వచ్చే కూలీలపై కేసులు పెట్టడం, రౌడీలను పంపించి బెదిరించడం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

‘‘నాపై దాడి చేస్తే వైయ‌స్ఆర్‌సీపీ బలహీనపడుతుందని అనుకుంటే పొరపాటు. ఎవరూ భయపడే పరిస్థితిలో లేరు. మా పొలాలు, మా బంధువుల పొలాల్లో పంట ఫలసాయం తీసుకోనివ్వకుండా కక్షపూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పార్టీ భేదాలు లేకుండా దెందులూరులో అందరికీ సంక్షేమ పాలన అందించడమే మేము చేసిన తప్పా?’’ అని ప్రశ్నించారు.

‘‘చింతమనేని ప్రభాకర్‌కు నిజంగా దమ్ముంటే 2029 ఎన్నికల్లో అబ్బయ్య చౌదరిని రాజకీయంగా ఎదుర్కోవాలి. ఇలాంటి కక్షపూరిత చర్యలతో భయపెట్టాలని చూడొద్దు. జగనన్న, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు మాకు అండగా ఉన్నంతకాలం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం’’ అని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు.
 

Back to Top