పత్తికొండ: ఈ నెల 28న కర్నూలులో జరిగే ర్యాలీకి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పిలుపునిచ్చారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ డిమాండ్ చేశారు. ఈ నెల 28న కర్నూలులో నిర్వహించనున్న భారీ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీదేవమ్మ మాట్లాడుతూ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. క్రీడా మైదానం కూడా చూడని వారికి ఉద్యోగాలు దక్కగా, నిజమైన అర్హత కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పోస్టులను పెద్ద ఎత్తున అమ్ముకున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కటారుకొండ సాయికుమార్, పత్తికొండ యువజన విభాగం అధ్యక్షుడు బోయినపల్లి అశోక్‌కుమార్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా కార్యదర్శి బుక్కాపురం శంకర్‌రెడ్డి, యువజన, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.