శింగనమల: నియోజకవర్గంలోని గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ బెల్ట్ షాపులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని శింగనమల సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎక్సైజ్ ఎస్‌ఐని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో యువత, కూలీలు, పేద కుటుంబాల జీవితాలను అక్రమ మద్యం విక్రయాలు చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. శింగనమల మండల కేంద్రంలోనే తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల నుంచే బెల్ట్ షాపులు తెరిచి మద్యం విక్రయించడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ వ్యవహారంపై వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అన్ని బెల్ట్ షాపులను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మద్యం, కల్తీ మద్యం కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల శింగనమల మండల కేంద్రంలో కుటుంబ పెద్దలను కోల్పోయి చిన్నారులు, మహిళలు అనాథలుగా జీవిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని అన్నారు. అలాంటి కుటుంబాలకు అండగా నిలిచింది ఎవరు? వారి జీవితాలకు బాధ్యత ఎవరిది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొంటూ, అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెల్ట్ షాపులను కొనసాగనిస్తే, బెల్ట్ షాపుల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడంతో పాటు అవసరమైతే ఎక్సైజ్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌ల ఎదుట కూడా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో రాజీ పడే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, బెల్ట్ షాపుల నిర్మూలన కోసం ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు.