తాడేపల్లి: అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోయి దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడం లేదు, మరోవైపు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు అండగా నిలబడకుండా చంద్రబాబు తన రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... అకాల వర్షాలతో నష్టపోయి ఆసరా కోసం చూస్తున్న రైతులను కూటమి ప్రభుత్వం నీచంగా చూస్తోంది. మామిడి, కోకో, పొగాకు, ధాన్యం, అరటి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతులకు మద్ధతు ధర దక్కడం లేదు. కోకో పంటలను సాగు చేయాలని ప్రభుత్వమే ప్రోత్సహించి ఇప్పుడు వారిని రోడ్లపాలు చేసింది. సాక్షాత్తు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మిర్చి, అరటి రైతులను పరామర్శించి వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వంలో చలనం లేదు. సీఎం చంద్రబాబు మద్ధతు ధర కల్పిస్తామంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేలా మేల్కొల్పాలని వైయస్ జగన్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. కళ్ళాల్లో ధాన్యం తడిసిపోయి రైతులు అల్లాడిపోతున్న వీడియోలు చూసి కూడా ఈ ప్రభుత్వానికి ధాన్యం కొనాలనే ఆలోచన చేయడం లేదు. కూటమి పాలనలో ఆక్వారంగం కుదేలు చంద్రబాబుకి హామీలు ఇవ్వడమే కానీ, వాటిని నెరవేర్చడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఆక్వా రైతుల పరిస్థితి కూడా మరీ ఘోరంగా తయారైంది. క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ రూ. 1.50 కి ఇస్తానని చెప్పి పట్టించుకోలేదు. గతంలో 2014-19 మధ్య ఇలాగే హామీ ఇచ్చి ఎన్నికలకు ఆరు నెలల ముందే అమలు చేశారు. ఆ మేరకు రూ. 340 కోట్లు బకాయిలు పెట్టి దిగిపోతే దాన్ని వైయస్ జగన్ సీఎం అయ్యాక తీర్చడం జరిగింది. 2024 ఎన్నికలకు ముందు కూడా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ. 1.50లకు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, 11 నెలలైనా ఇంతవరకు అమలు చేయలేదు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ కలిపితే రాష్ట్రంలో మొత్తం 64 వేల విద్యుత్ కనెక్షన్లు మాత్రమే ఉన్నా వాటికీ సబ్సిడీ విద్యుత్ ఇవ్వలేకపోతోంది. వైయస్ జగన్ సీఎంగా ఉండగా 54 వేల కనెక్షన్లను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చి ఐదేళ్లలో రూ. 3640 కోట్లు సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకున్నారు. గతంలో వరుసగా మూడు నెలలు సబ్సిడీ పొంది డిస్‌కనెక్ట్ అయిన వారికి బిల్లులు చెల్లించాలని నోటీసులు వచ్చినప్పుడు నాటి సీఎం వైయస్ జగన్ వెంటనే స్పందించి ఆక్వా రైతులు చెల్లించాల్సిన రూ. 23 కోట్లు రోల్ బ్యాక్ చేసి ఆదుకున్నారు. అమెరికాలో నెలకొన్న పరిస్థితులతో ఆక్వా రంగం కుదేలైపోయి ఉంటే, రైతులను ఆదుకునే దిశగా సరైన నిర్ణయం తీసుకునే సత్తా కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆర్బీకేలతో రైతులను ఆదుకున్న వైయస్ జగన్ గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గింజను కొనుగోలు చేయడం జరిగింది. రంగు మారిన ధాన్యానికి కూడా మద్ధతు ధర కల్పించి రైతును ఆదుకున్న పెద్ద మనసున్న నాయకుడు వైయస్ జగన్. ధాన్యం కొనుగోలుకు ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ అధికారిని నియమించి మరీ ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా కల్పించారు. అధికారులతోపాటు ఎమ్మెల్యేల స్థాయి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు రైతుల వద్దకు పంపించి అండగా నిలిస్తే, ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల ముఖం చాటేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. కృషి విజ్ఙాన కేంద్రాల ద్వారా మామిడి పంటను అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేసిన ఘనత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానిది. మిల్లర్లంతా ఏకమై రైతులను దోచుకుంటుంటే పట్టించునే నాథుడే లేడు. దళారుల రాజ్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నాడు. రైతులు ఎక్కువ ధాన్యం పండించారని బాధ పడిపోతున్న ప్రభుత్వాన్ని దేశ చరిత్రలో తొలిసారి చూస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా తక్షణం స్పందించి మామిడి, కోకో, ధాన్యం, పొగాకు, మిర్చి రైతులను ఆదుకోవాలి. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందజేసి అండగా నిలవాలి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతుల తరఫున వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నా.