విజయవాడ: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లేకపోగా ఛార్జీల మోత మోగిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ మంగళవారం వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ నిలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. అనంతరం సిఎండి కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. `కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైంది. పేద ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధ వేస్తుంది. రెండు, మూడు వందలు వచ్చే కరెంట్ బిల్లు నేడు వేయి రూపాయలు దాటుతోంది. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచారు. ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు పెంచం, ఛార్జీలు పెంచమని ప్రజలకు బాండ్ పేపర్లు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారు. ప్రజలను మోసం చేసిన నాయకులపై భవిష్యత్ లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తాం. ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో ఛార్జీలు పెంచకపోయిన తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు. కూటమి నేతలు డబ్బులు దోచుకునే పనిలోనే ఉన్నారు. అధికారుల తీరు కూడా ఆశ్చర్యంగా ఉంది. వారు ఏమైనా కూటమి నేతలు దగ్గర జీతాలు తీసుకుంటున్నారా? మేము వినతిపత్రాలు ఇస్తామంటే భయంతో వణికిపోతున్నారు. మేము వచ్చేది ప్రజా సమస్యలు మీద మా ఇంటిలో సమస్యలు మీద కాదు. అధికారులు ప్రజలకు అన్యాయం చేస్తే వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అకాల వర్షాలతో పంట నష్టపోయినా రైతులను వదిలేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయటం లేదు. పేపర్ స్టేట్‌మెంట్లకే పరిమితమవుతున్నారు తప్ప అన్నదాతలను ఆదుకోవడంలో విఫలమయ్యారు` అని దేవినేని అవినాష్ ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.