కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

 నెల్లూరు జిల్లా: నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జిల్లాలో ఏ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తకు చిన్న సమస్య వచ్చినా, మీ ఇంటి బిడ్డగా నేను అండగా ఉంటా.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం మాకు తెలుసు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీని ప్రశ్నించినందుకే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అనుమాల ప్రభాకర్‌ రెడ్డిని విచారణ పేరిట మనుబోలు పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి నిర్బంధించడాన్ని ఖండిస్తూ, మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు డా౹౹ కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. మనుబోలు మండల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న కాకాణి, పోలీసుల ఏకపక్ష వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌ రెడ్డిని ఆరు నెలల పాటు నోరు మెదపవద్దని, కౌంటర్‌ ఇవ్వవద్దని, మీడియా ముందుకు రాకూడదని, తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌కు అంగీకరించాలంటూ మనుబోలు ఎస్సై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు కాకాణి ఆరోపించారు.

కాకాణితో పాటు పెద్ద సంఖ్యలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత్యంతరం లేక పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేసి ప్రభాకర్‌ రెడ్డిని విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డా౹౹ కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దూషణలు, అక్రమ కేసులు సర్వసాధారణమైపోయాయని మండిపడ్డారు. సోమిరెడ్డి రైతులను అడ్డుపెట్టుకుని ఇరిగేషన్‌ పనుల్లో దోపిడీ చేస్తున్నారని తాము ప్రశ్నించగా, సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇరిగేషన్‌ పనుల పేరుతో సర్వేపల్లి నియోజకవర్గంలో 316 పనులకు రూ.19 కోట్ల 70 లక్షలు మంజూరు చేయించుకుని, పనులు ప్రారంభించకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మోంథా తుఫాన్‌లో దెబ్బతిన్న కాలువలు, చెరువుల మరమ్మత్తులు వెంటనే చేపట్టి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

పోలీస్‌ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఇరువర్గాలు ఫిర్యాదులు ఇచ్చినా అధికార పార్టీ నేతలను వదిలేసి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై మాత్రమే కేసులు నమోదు చేయడం అన్యాయమని కాకాణి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 41ఏ నోటీసులు ఇస్తూ, బైండోవర్‌కు బలవంతం చేయడం పోలీసులకు ఏ విధంగా అధికారం వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి, ప్రైవేట్‌ కేసులు వేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. మా నాయకుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలో వైయస్ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Back to Top