టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట వైయ‌స్‌ఆర్‌సీపీ ఆందోళన

నాలుగు రోజుల క్రితం గుల్జార్‌పేటలో డ్రెయినేజీపై ఆక్రమణల తొలగింపు 

అదే సమయంలో కాలువపై టీడీపీ జెండా దిమ్మెను తొలగించిన కాంట్రాక్టర్‌ 

రాజకీయ కక్షసాధింపులో భాగంగా వైయ‌స్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ కుమారుడి అరెస్ట్‌ 

అధికార పార్టీ దౌర్జన్యాలపై వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఆందోళన

అనంతపురం: అనంతపురం నగరంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళనకు దిగారు. గుల్జార్‌పేటకు చెందిన స్థానిక వైయ‌స్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ ముంతాజ్‌ బేగం కుమారుడు దాదును అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు.

నగరంలోని గుల్జార్‌పేటలో రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులలో భాగంగా నాలుగు రోజుల క్రితం కాలువపై ఉన్న ఆక్రమణలను నగర పాలక సంస్థ అధికారులు తొలగించారు. ఈ క్రమంలో కాలువపై ఏర్పాటు చేసిన టీడీపీ జెండా దిమ్మెను కూడా కాంట్రాక్టర్‌ తొలగించినట్లు వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు. అయితే దీనిపై రాజకీయ కక్షసాధింపుతో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా, టూటౌన్‌ పోలీసులు వైయ‌స్‌ఆర్‌సీపీ మైనార్టీ నేత దాదును అరెస్ట్‌ చేశారని ఆరోపించారు.

ఈ అరెస్ట్‌ను ఖండిస్తూ పెద్ద సంఖ్యలో వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టేషన్‌కు వచ్చిన త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపిస్తూ వైయ‌స్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయగా, వాగ్వాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసరావు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలతో చర్చలు జరిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై అక్రమ అరెస్టులు చేస్తే సహించబోమని వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు. అధికార పార్టీ దౌర్జన్యాలు ఆపాలని, దాదును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Back to Top