రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం తాజాగా యాక్సిస్ సంస్థలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వెనుక రూ.11,000 కోట్ల అవినీతి ఉందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఆనాడు వైయస్ జగన్ దేశంలోనే అతితక్కువ రేటుకు సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే, దానిపై చంద్రబాబు విషం చిమ్ముతూ తప్పుడు ఆరోపణలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సీఎంగా చంద్రబాబు తన బినామీ సంస్థలైన యాక్సిస్‌తో దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోళ్ళు చేస్తూ భారీ కుంభకోణంకు తెర తీశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... చంద్రబాబు తన పదకొండు నెలల పాలనలోనే స్కామ్‌ల ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉర్సా స్కామ్‌ను ప్రజలు మరిచిపోక ముందే, ఏపీఈఆర్‌సీ అనుమతితో ఈ నెల 2వ తేదీన ఒక జీఓను జారీ చేశారు. చంద్రబాబు తన బినామీలతో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ కంపెనీలను ప్రారంభింప చేస్తున్నారు. దానిలో భాగంగానే యాక్సిస్ రెన్యువబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ రెన్యువబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (కృష్ణా), యాక్సిస్ రెన్యువబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్), యాక్సిస్ రెన్యువబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (తుంగభద్ర) పేరుతో కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ కంపెనీల నుంచి విండ్, సోలార్ ప్రాజెక్ట్‌ల ద్వారా వంద మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లుగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇది దేశంలోనే అతి ఎక్కవ రేటు. అంటే తన బినామీ కంపెనీలకు రాష్ట్ర ఖజానాను దోచిపెట్టేందుకు చంద్రబాబు ఈ కుంభకోణంకు శ్రీకారం చుట్టారు. సెకీ ఒప్పందాలపై విషం చిమ్మారు గతంలో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో కేంద్రప్రభుత్వ సంస్థ సెకీతో అప్పట్లో దేశంలోనే అతి తక్కువ రేటు రూ.2.49 యూనిట్‌కు ఒప్పందం చేసుకుంది. దీనిపై చంద్రబాబు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. బయటి మార్కెట్‌లో యూనిట్ రూ.1.99 కే దొరుకుతుంటే, ఎక్కువ రేటుకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారని, ఇది స్కామ్ అంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టారు. తనకు వంతపాడే ఎల్లో మీడియా ద్వారా పెద్ద ఎత్తున కథనాలను రాయించారు. దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌లను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శిస్తున్నాం. ఈ రోజు అదే చంద్రబాబు సీఎం హోదాలో యూనిట్ విద్యుత్‌ను రూ.4.60కి ఎలా కొనుగోలు చేస్తున్నారు? ఇది అదిపెద్ద స్కామ్ కాదా? గతంలో రూ.2.49 కి కొంటేనే దీనిలో అవినీతి ఉందన్న చంద్రబాబు, దానికి రెట్టింపు రేటుతో ఒప్పందాలు చేసుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటున్నారు? ప్రజల సొమ్మును ఇలా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతున్న తన బినామీ కంపెనీలకు దారాదత్తం చేయడం వెనుక చంద్రబాబు అవినీతి లేదా? చిత్తశుద్ది ఉంటే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల కన్నా తక్కువకు కొనుగోలు చేసి, గతంలో జరిగింది తప్పు అని నిరూపించాలి. అంతేకానీ గత ప్రభుత్వం కన్నా ఎక్కువకు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తున్నాం. విద్యుత్ రంగంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం చంద్రబాబు చెబుతున్న లెక్కల ప్రకారం చూసినా ప్రస్తుతం యాక్సిస్ ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.11 కి ఎక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ఏడాదికి రూ.210 కోట్లు ఎక్కువకు కొనుగోలు చేస్తున్నారు. పాతికేళ్ళ పాటు యాక్సిస్‌కు చేసే చెల్లింపులను వడ్డీతో కలిపి లెక్కిస్తే దాదాపు రూ.11వేల కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయి. అంటే ఇది అతిపెద్ద కుంభకోణం కాదా? ఇదే చంద్రబాబు ఆనాడు సెకీ ఒప్పందాలపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మరిచిపోయారా? ఏపీ పరువును మంటగలిపారంటూ ముసలి కన్నీరు కార్చారు. మరి ఇప్పుడు గతం కంటే రూ.2.11 ఎక్కువకు ఎలా కొంటున్నారు? ప్రశ్నిస్తాను అంటున్న పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏపీలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అదనంగా రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపింది. మరోవైపు అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ భారం అంతా కూడా ప్రజలపై పడుతోంది. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలి. తాజాగా జరిగిన ఎంఓయులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సెకీ రూ.3 కే ఒప్పందం చేసుకుంది. మార్కెట్‌లో రేట్లు ఇలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం రూ.4.60 కి ఎలా చేసుకుంది? విద్యుత్ చార్జీలపై మరో ప్రజా ఉద్యమం తప్పుదు రాష్ట్రంలో గతంలో ఒక గృహానికి వెయ్యి రూపాయల విద్యుత్ బిల్లు వస్తుంటే, నేడు కూటమి ప్రభుత్వంలో అది రెట్టింపు అయ్యింది. ప్రైవేటు కంపెనీలకు ఇలా అధిక రేట్లతో దోచిపెడుతుంటే, ఆ భారం ప్రజలు మోయాలా? ప్రజాకోర్ట్‌లో చంద్రబాబు దోషిలా నిలబడుతున్నారు. ఏపీలో ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో బషీర్‌బాగ్ విద్యుత్ ఆందోళనలో ముగ్గురు రైతులను చంద్రబాబు ప్రభుత్వం పొట్టనపెట్టుకున్నారు. నేడు అదే తరహాలో ప్రజలు విద్యుత్ చార్జీలపై ఉద్యమించే పరిస్థితిని తీసుకువస్తున్నారు. కరెంట్ బిల్లులు కట్టలేక ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతున్నారు. మరోవైపు విశాఖపట్నంలో మూడువేల కోట్లు విలువైన భూములను రూపాయి కంటే తక్కువకే కట్టబెడుతున్నారు. సింహాచలంలో కనీసం పునాదులు కూడా లేకుండా పది అడుగుల గోడను కట్టించి, ఏడుగురు భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తిరుమల శ్రీవారి పవిత్ర క్షేత్రంలో గోమాతలు మృత్యువాత పడుతున్నాయి. తిరుపతిలో నిర్లక్ష్యంతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆరు మంది భక్తులను పొట్టన పెట్టుకున్నారు. గతంలో రాజమండ్రి పుష్కరాల సందర్భంగా 28 మంది మరణాలకు కారకులయ్యారు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. తమ అసమర్థతకు అధికారులను బలిపశువులను చేస్తున్నారు. ఇదేనా చంద్రబాబు పాలనా సామర్థ్యం? ఎన్నికలకు ముందు కరెంట్ బిల్లుల తగ్గిస్తాం, నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తామని హామీ ఇవ్వలేదా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైయస్ఆర్‌సీపీ నిలదీస్తుంది. ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ... సింహాచలం ఘటనలో ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన అయిదుగురు మంత్రులు బాధ్యత వహించాలి. పునాదులు లేకుండా గోడ కడుతుంటే వారు ఏం చేస్తున్నారు? దీనికి అధికారులపైనే చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. రాజమండ్రి పుష్కరాల్లో భక్తుల ఉత్సాహం వల్లే దుర్ఘటన జరిగిందని కమిషన్ నివేదిక ఇవ్వడం వల్ల అధికారులపై చర్యలు తీసుకోలేదు. తన ప్రచారం కోసం షూటింగ్ చేయించుకున్న బాధ్యుడైన చంద్రబాబును తప్పించారు. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యం కాదా? అక్కడ టీటీడీ చైర్మన్, ఈఓలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? తమకు సంబంధించిన అధికారులు కావడం వల్లే వారి జోలికి పోలేదు. చంద్రబాబు దైవాపచారం చేశారు. సాక్షాత్తు శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ బాధ్యతారహితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు ఆరోపణలు చేశారు. శ్రీవారి క్షేత్రంలో గోవులు చనిపోవడం రాష్ట్రానికి అరిష్టం కాదా? ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్న చంద్రబాబును ప్రజలకు క్షమించరని మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు.