కూటమి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌నేత‌ ధర్మాన రామ్ మనోహర్ నాయుడు డిమాండ్‌

శ్రీకాకుళం: తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రీకాకుళం నియోజకవర్గ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ధర్మాన క్యాంప్ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్దపాడు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐకి ఫిర్యాదు అందజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడుదల రజిని తదితర నాయకులపై భౌతిక దాడులు చేసి, ఇళ్లను ధ్వంసం చేయించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విభేదాలను హింసతో అణచివేయడం సరైంది కాదని, దాడులకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. 
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top