కడప: మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం వైయస్ఆర్‌సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్ వీ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే గూండాలతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ అంశంలో సిట్ నివేదికలో చంద్రబాబువి అబద్ధాలు అని తేలడంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని ఆయన మండిపడ్డారు. కూటమి పాలనలో సామాన్య ప్రజలతో పాటు, మాజీ మంత్రులుకు కూడా భద్రత లేకుండా పోయిందన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ, మాజీ సీఎం వైయస్ జగన్‌తో పాటు టీటీడీ మాజీ చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ద్వారా దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. తమ వైఫల్యాలు ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసులు.. దాడి చేసే గూండాలకు రక్షణగా నిలబడి, బాధితులపైనే కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ఎన్ని అమలు చేశారో చర్చకు సిద్ధమా అని చంద్రబాబును ప్రశ్నించారు. రాయలసీమకు ప్రాణాధారమైన ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి... ఆ ప్రాంత ప్రజల హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్, హింసా రాజకీయాలు ఎక్కువకాలం సాగవని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన బుద్ధిచెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే... ● ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే దాడులా ? ప్రతిపక్షాలు ప్రజల పక్షాన పోరాడుతూ.. ప్రభుత్వ తప్పిదాలను విమర్శించడం సహజం. ప్రజలపట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. కానీ అధికార పక్షం తమ తప్పులను ప్రశ్నించకూడదు. .వాటిపై అసలు మాట్లాడ్డానికే వీలు లేదన్నట్టు ప్రతిపక్షాలపై దాడికి దిగడం సిగ్గుచేటు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసాదంపై అవాకులు, చెవాకులు మాట్లాడారు. లడ్డూ ప్రసాదంలో సుప్రీం కోర్టు నియమించిన దర్యాప్తు సంస్థ జంతుకొవ్వులు లేవని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రకమైన ఆరోపణలు చేసే స్దాయికి దిగజారడంపై ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. వాటిపై నుంచి డైవర్ట్ చేయడానికే మీరు ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడికి దిగారు. ● మీరు మొదలుపెట్టిన సాంప్రదాయం మీక్కూడా తప్పదు... మీరు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తెలియజేస్తూ నిరసన కార్యక్రమం చేసి వస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పచ్చి బూతులు తిట్టారు. గుంటూరు గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఉన్న మీ పార్టీ మహిళా నేత నీచాతినీచంగా బూతులు మాట్లాడితే ఆమెపై ఎలాంటి చర్యలు లేవు. మీ తప్పులను నిలదీస్తే మా ఇళ్లపై గుండాలతో దాడి చేయిస్తారా? ఈ రకమైన సాంప్రదాయం మంచిది కాదు. రానున్న రోజుల్లో ఇదే సాంప్రదాయం కొనసాగితే మీ పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకొండి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ శాఖ రెండేళ్లుగా చేష్టలుడిగి చూస్తోంది. సామాన్య ప్రజలు సైతం అసహ్యించుకునే రీతిలో వ్యవహరిస్తున్నారు. దాడి చేస్తున్న గుండాలకు రక్షణగా నిలబడుతూ.. బాధితులపై కేసులు నమోదు చేయడం ఏ రకమైన సాంప్రదాయం. చంద్రబాబూ ఈ తీరును మీరు సమర్ధిస్తున్నారా? ● సంకీర్ణంలో ఉన్నా ప్రయోజనం శూన్యం.. ఎన్డీయేలో భాగస్వామ్యులుగా ఉన్న టీటీపీ.. ఇవాళ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కనీస మేలు జరగలేదు. అయినా మీరు నోప్పి మాట్లాడ్డం లేదు. కంటితుడుపు చర్యగా రూ.3 వేల కోట్లు, రూ.1100 కోట్లు అమరావతి కోసం, రూ.2 వేల కోట్లు ఎఫ్ ఆర్ బీ ఎం పరిధి దాటి రుణం పొందేందుకు అనుమతి తప్ప ప్రయోజనం ఏం లేదు. ఏడాది పొడవునా మీ భాగస్వామ్య ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రయోజనాలు సాధించడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. మీ తప్పిదాలను ఎత్తిచూపకుండా ఎలా ఉంటాం? హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన మిమ్మల్ని కచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం. ● మీ తప్పిదాలే కాలనాగై కాటేస్తాయి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. దీనిపై చర్చకు మీరు సిద్ధమా? ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఒక సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని చెప్పారు. అదీ లేదు. మీ మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ఎన్ని అమలు చేశారో చర్చకు ప్రభుత్వ పెద్దలు సిద్దమా? మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ రకంగా దాడులకు దిగుతారా? ఇలాంటి దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలు హర్షిస్తారనుకుంటే అది మీ భ్రమే. మీరు ఇవాళ వైయస్ఆర్‌సీపీ నేతలపై చేస్తున్న దాడులు.. మీకు కాలనాగై కాటేయడం ఖాయం. మీరు తప్పించుకుని పోలేరు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన కల్పిస్తారని ప్రజలు మీకు అధికారమిస్తే..ఇంత నీచానికి దిగజారడం దారుణం. ప్రసాదంపై సుప్రీం కోర్టు నియమించి సిట్ చాలా స్పష్టంగా లడ్డూలో జంతు కొవ్వులు లేవని చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిన తర్వాత.. బాధ్యత గల ముఖ్యమంత్రిగా మీరు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. మరలా తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేయడం దారుణం. ● దుష్ప్రచారం చేస్తే నాశనమవడం ఖాయం.. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్, మా పార్టీ నాయకులు తిరుమల లడ్డూని అపవిత్రం చేయాలని కానీ, తిరుమలకు అపకీర్తి చేయాలన్న పనికి పాల్పడితే కచ్చితంగా మేం అందరూ దాని ఫలితం అనుభవిస్తాం. కానీ గుర్తు పెట్టుకో చంద్రబాబూ, కేవలం మీ ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే మీరు సర్వనాశనం కావడం ఖాయం. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిపైనా, లడ్డూ ప్రసాదంపైనా దుష్ప్రచారం చేసిన వారు ఆయన ఆగ్రహానికి గురి కాక తప్పదు. మేము లడ్డూ ప్రసాదంపై తిరుమలలో ప్రమాణం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం, మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా? చంద్రబాబు. ● రాయలసీమ నీటి ప్రాజెక్టుల దుస్థితి మీ పాపమే.. రాయలసీమ ప్రాంతంలో కృష్ణానదిలో నీటి ప్రవాహం చాలా తక్కువ. రాయలసీమను కాపాడుకోవాలంటే... పోతిరెడ్డిపాడు ఒక్కటే శరణ్యం. దివంగత ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి పుణ్యంతో కేవలం 10వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో ఉన్న పోతిరెడ్డిపాడును 44వేల క్యూసెక్కుల సామర్ధ్యం వరకు విస్తరించాడు. 44వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేయాలంటే 880 అడుగులు నీటిమట్టం ఉంటేనే సాధ్యం అవుతుంది. కానీ ఏ రోజైతే 880 అడుగుల దిగువకు పడిపోతే రాయలసీమకు చుక్క నీరు కూడా అందని పరిస్ధితి. అదే పక్కనున్న తెలంగాణాలో అనేక నీటి ప్రాజెక్టులతో 800 అడుగుల నీటిమట్టంతోనే పాలమూరు రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ఎత్తిపోతలు వంటి అనేక పథకాలు చేపడుతున్నారు. రోజుకు 6 టీఎంసీల నీటిని కృష్ణా ప్రవాహం నుంచి ఎత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తికాకపోతే కృష్ణా నదిలో ప్రవాహం తగ్గిపోతే ఏ రకంగా రాయలసీమను కాపాడుకుంటామే మీరు చెప్పే పరిస్ధితిలో లేరు. పైగా పక్క రాష్ట్రం తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా.. నేను ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసేలా ఒప్పించాను అని ప్రకటించారు. దీనిపై ఇంతవరకు ఎందుకు వివరణ ఇవ్వలేదు చంద్రబాబూ? నీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. మిమ్నల్ని, మీ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడి చేస్తామంటే ప్రజలు అమాయకులు కాదు. మిమ్నల్ని వెంటబడి తరిమే రోజులు రానున్నాయి, గుర్తుపెట్టుకొండి. డీజీపీ నుంచి ఎస్పీ వరకు మీకు విజ్ఞప్తి చేస్తుంది ఒక్కటే అక్రమాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపండి. అన్యాయం, అక్రమాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపండి. కానీ పట్టపగలే పోలీసుల సమక్షంలో మా నాయకులపై దాడి చేస్తే.. పట్టించుకోకుండా ప్రేక్షకుల్లా చూస్తారా? తిరిగి మా పే కేసులు పెడతారా? పోలీసులు సాక్షిగా దాడిచేసినా పట్టించుకోకపోతే.. ప్రతిపక్షనేతలు, పలు దఫాలుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు తమ రక్షణ కోసం ప్రైవేటు సైన్యం పెట్టుకోవాలా? కేవలం పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్, చిల్లర రాజకీయాలు ఎల్లకాలం సాగవని హెచ్చరించిన సతీష్ రెడ్డి.... తగిన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ఆనాడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు వైయస్.జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడినా మీ ఇళ్లపైకి వచ్చి దాడి చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇవాళ ప్రభుత్వం చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తూ.. పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.