వక్ఫ్ భూముల పరిరక్షణకు ముస్లిం మైనార్టీల నిరసన

కూటమి ప్రభుత్వ కుట్రలపై వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ సెల్ ఆగ్రహం

మచిలీపట్నం: ముస్లిం వక్ఫ్ భూముల పరిరక్షణ కోరుతూ కృష్ణాజిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేద ముస్లింల అభ్యున్నతి కోసం వక్ఫ్ బోర్డు ద్వారా ఏర్పాటైన భూములను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. పరిశ్రమల ఏర్పాటు, అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల విలువైన వక్ఫ్ భూములను దోచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం కృష్ణాజిల్లా వైఎస్ఆర్‌సీపీ మైనార్టీ సెల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు.

కృష్ణాజిల్లా పరిధిలోని వక్ఫ్ భూముల్లో ఒక్క సెంటు భూమిని కూడా ప్రభుత్వానికి ఇవ్వబోమని నాయకులు స్పష్టం చేశారు. వక్ఫ్ భూములకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రీవెన్స్ కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో కృష్ణాజిల్లా వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్ ఖాసిం, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిల్లార్ దాదా, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top