వైయస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి కుట్రలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మండిపాటు

కోనసీమ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నుతోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోమ‌వారం పార్టీ ప‌రిశీల‌కురాలు జ‌క్కంపూడి విజ‌య‌ల‌క్ష్మితో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీలన్నీ కలిసి ఉన్నప్పటికీ ఒక్క వైయ‌స్ జగన్‌ను ఎదుర్కోలేక ఆయన వ్యక్తిత్వంపై బురదజల్లి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నాయని మండిప‌డ్డారు.  వైయ‌స్ జగన్ కంటే మెరుగైన పాలన అందించి ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేయకుండా కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఒక్క ఎన్నికల హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులను అధికార బలంతో మూసివేయిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నిజాయితీగా పనిచేయకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు చేస్తున్న దుష్ప్రచారం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని జగ్గిరెడ్డి పేర్కొన్నారు. లడ్డూకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన ప్రచారం సీబీఐ సిట్ చార్జిషీట్‌తో అబద్ధమని తేలిందని అన్నారు. అయినప్పటికీ నివేదిక తనకు అనుకూలంగా రాకపోవడంతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
లడ్డూ అంశంలో తాను చేసిన ప్రచారం నిజమని ప్రజలను నమ్మించేందుకు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. బాత్రూమ్‌లను శుభ్రం చేసే రసాయనాలు నెయ్యిలో కలిశాయంటూ మాట్లాడటం తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. దేవుడి పేరును కూడా రాజకీయ లాభం కోసం వాడుకోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. లడ్డూ అంశంపై మాట్లాడవద్దని న్యాయస్థానాలు హెచ్చరించినా చంద్రబాబు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా విషప్రచారం కొనసాగిస్తున్నారని త‌ప్పుప‌ట్టారు. శ్రీవారి భక్తుల విశ్వాసంతో ఆటలాడుకోవడం తగదని, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును అంగీకరించి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు.
 

Back to Top