వక్ఫ్ బోర్డు భూములపై చంద్రబాబు కుట్ర

కోనసీమ జిల్లా క‌లెక్ట‌ర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ సెల్ ఫిర్యాదు 

అమలాపురం: వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను ప్రభుత్వ భూములుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని   వైయ‌స్ఆర్‌సీపీ  మైనార్టీ సెల్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా   వైయ‌స్ఆర్‌సీపీ  మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంగళగిరిలో ఉన్న 71.57 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ ఆన్‌లైన్ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా మార్చారని ఆరోపించారు. ఇదే విధంగా మంగళగిరి సమీపంలోని మల్లయ్యపాలెంలో ఉన్న 232 ఎకరాల వక్ఫ్ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూములను అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువచ్చి, తెలుగుదేశం పార్టీకి అనుకూల వర్గాలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని   వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు విమర్శించారు. ప్రభుత్వ చర్యల వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలోని ముస్లింలందరూ ఈ విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

వక్ఫ్ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మైనార్టీల హక్కులను కాపాడేందుకు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ  మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరిలో రాజోలు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ఎం.డి. వై. షరీఫ్, అమలాపురం నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ ఖాజా బాబు, ముమ్మిడివరం నియోజకవర్గ అధ్యక్షుడు ఆలీ హుస్సేన్, కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజా బాబు, జమ్మాత్ అధ్యక్షులు ఖాజా బాబు, వలీ, ఆజీ, అమీర్, ఆషిఫ్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top