శ్రీ సత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం వేపకుంట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడుతూ వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం తలెత్తింది. ప్రభుత్వ స్థలంలోనే విగ్రహం ఏర్పాటు చేయాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరగా, ఈ విషయంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. విగ్రహం ఏర్పాటు పేరుతో గ్రామంలో అలజడి చెలరేగింది. ఇక వైయస్ఆర్‌సీపీ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లిన టీడీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో నలుగురు కార్యకర్తలు గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.