శ్రీసత్యసాయి జిల్లా: సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీ చరణ్ సర్పంచులకు మద్దతుగా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ, గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం సర్పంచులు అప్పులు చేసి, వడ్డీలకు డబ్బులు తెచ్చి మౌలిక వసతుల పనులు చేపట్టారని తెలిపారు. ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని సర్పంచులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎన్నడూ లేని విధంగా సర్పంచుల నిధులను ఆపేయాలని అధికారులకు మంత్రి సవిత హుకుం జారీ చేయడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. అధికార యంత్రాంగం కూడా మంత్రికి వత్తాసు పలుకుతూ నిధులు మంజూరు చేయకుండా పెండింగ్‌లో ఉంచడం సరైన విధానం కాదన్నారు. సర్పంచులకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే నిధులు నిలిపివేసిన అధికారులపై ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో పంచాయితీలకు నిధులు అందకపోవడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే సర్పంచులను ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమని తీవ్రంగా విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.