వక్ఫ్ బోర్డు, అంజుమన్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించొద్దు

ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టరేట్‌కు వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం వినతి 

విజ‌య‌వాడ‌: కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులు, అంజుమన్‌కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా ఖండిస్తూ, ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టరేట్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎం.డి. రుహుల్లా, జిల్లా మైనారిటీ అధ్యక్షులు మస్తాన్, పార్లమెంట్ కార్యదర్శి, ఉమ్మడి కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మీరు హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులు, అంజుమన్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని ఆరోపించారు. దీనిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై మైనారిటీ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామని తెలిపారు. గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో మైనారిటీలు సంతృప్తిగా ఉన్నారని గుర్తుచేశారు. మసీదుల అభివృద్ధి, వక్ఫ్ భూముల రక్షణ, ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాల అమలు వంటి అంశాల్లో జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా మైనారిటీలకు అన్యాయం జరుగుతోందని, దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ తమ మాటలను సీరియస్‌గా వినకుండా, మొక్కుబడిగా వినతి పత్రం తీసుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం నిద్రపోతున్నట్టుగా ఉందని, అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుని పని చేస్తున్నట్టుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనారిటీల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

 ఎమ్మెల్సీ ఎం.డి. రుహుల్లా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యంలా కొనసాగుతోందని తీవ్రంగా విమర్శించారు. అమరావతిలో ఇప్పటికే 50 వేల ఎకరాలు పూలింగ్‌లో తీసుకున్న చంద్రబాబు నాయుడు, ఇంకా భూములు కావాలంటే అక్కడే తీసుకోవాలి తప్ప మైనారిటీల వక్ఫ్ ఆస్తులపై కన్నేయడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో మైనారిటీలకు పెద్ద కొడుకులా ఉంటానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మైనారిటీ ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. మంగళగిరిలో మైనారిటీల భవిష్యత్తు కోసం పూర్వీకులు ఇచ్చిన 72 ఎకరాల అంజుమన్ భూమిని, లోకేష్ ఐటీ హబ్ పేరుతో తీసుకోవాలని చూడటం ఘోర అన్యాయమని అన్నారు. గుంటూరు ఎమ్మెల్యే కోసం పెద్ద మసీదుకు చెందిన సుమారు 270 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ముస్లింలకు ఒక్క హజ్ హౌస్ కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వం, ఆస్తులు పంచుకోవడంలో మాత్రం ముందుంటోందని విమర్శించారు. 2029లో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని, అప్పటివరకు వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.  కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శులు రిజ్వాన్, బడేమియా, కో-ఆప్షన్ మెంబర్ అలీమ్, తూర్పు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు సుభాని, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మున్నా, జిల్లా సెక్రటరీ కట్టప్ప, జిల్లా కార్యదర్శి ముస్తఫ్ఫా తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
 

Back to Top