శ్రీవారితో ఆటలా? పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసా?

కూటమికి శత్రుచర్ల పరీక్షితరాజు హెచ్చరిక

పార్వ‌తిపురం మ‌న్యం జిల్లా: శ్రీవారి లడ్డూ వివాదానికి కావాలనే ఆజ్యం పోస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఆత్మాభిమానం లేదని పార్వతిపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షితరాజు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం చినమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, ప్రజలు కూటమి నేతల తీరును ఛీ కొడుతున్నా.. వారికి కనీస సిగ్గు కూడా రావడం లేదని విమర్శించారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగి ప్రజలంతా అసహనంతో ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్‌గా వాడుకుంటున్నారని ఆరోపించారు.

శ్రీవారి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సిట్, సీబీఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్‌ఐ వంటి సంస్థలు స్పష్టమైన నివేదికలు ఇచ్చినా, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే లడ్డూలో గొడ్డు, పంది కొవ్వు కలిసిందంటూ మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌, అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా యావత్ ప్రపంచంలోని హిందువుల, శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడటం మహాపాపమని, దీని పర్యవసానం తప్పదని హెచ్చరించారు.

అసలు లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని మీరు ఎలా నిర్ధారించారని చంద్రబాబును ప్రశ్నించారు. 2019లో బోలే బాబా సంస్థతో నెయ్యి ఒప్పందం ఎవరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే 2024 జూలై 25న టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరిగి ఎవరి ఆదేశాలతో టీటీడీకి పంపించారో స్పష్టత ఇవ్వాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టి, పాలన-అభివృద్ధిని పక్కదారి పట్టిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి హింసను ప్రోత్సహిస్తున్నారని కూటమిపై విమర్శలు గుప్పించారు. చివరికి టాయిలెట్లు శుభ్రం చేసే రసాయనాలు కూడా శ్రీవారి ప్రసాదంలో కలిశాయంటూ పచ్చ మీడియాతో కలిసి అబద్ధాలు ప్రచారం చేయడం నీచానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి, భక్తులకు క్షమాపణ చెప్పి ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని, ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాలని శత్రుచర్ల పరీక్షితరాజు డిమాండ్ చేశారు.  సమావేశంలో మండల కన్వీనర్ కోట రమేష్, జెడ్పిటిసి సభ్యురాలు శశికళ, వైస్ ఎంపీపీ సంపత్ కుమార్, బలగ వెంకటరమణ, లోలుగ నారాయణరావు, కృష్ణ, రామకృష్ణ, పాపారావు, రవి, అల్లు రవణమ్మ, ఈశ్వర రావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top