అనంతపురం : తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై ఆధారరహిత ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, బీసీ సెల్ నగర అధ్యక్షుడు లక్ష్మన్న తదితరులు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిసిందని నిర్ధారణలేని ఆరోపణలు చేశారని వారు పేర్కొన్నారు. సంబంధిత వీడియో ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను ఎస్‌ఐ రామకృష్ణకు అందజేశారు. ల్యాబ్ నివేదికలు, దర్యాప్తు ఫలితాలు ప్రజల ముందుకు రాకముందే సంచలనాత్మక ప్రకటనలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక శాంతి, మత సామరస్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ విషయంలో అనుమానాలు ఉంటే చట్టబద్ధమైన సంస్థల ద్వారా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సిందని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలపలేదని ల్యాబ్ నివేదికల్లో వెల్లడైందని పోలీసులకు వివరించారు. అయినప్పటికీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరియు ఆయనతో అనుబంధం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, సంబంధిత వీడియోలు, ఆధారాలను పరిశీలించి ప్రజా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు పోలీసులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను భక్తులు గమనించాలని, సీబీఐ సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా అవాస్తవ ప్రచారం కొనసాగించడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖతో పాటు అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.